
లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటి నిరంతరం పెరుగుతున్న ఈ రోజుల్లో.. బైక్ లేదా కార్ బయటకు తీయాలంటేనే సామాన్యుడు జేబులు తడుముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రోజూ ఆఫీసులకు, లాంగ్ ట్రిప్‌లకు ప్రయాణించే వారికి గూగుల్ మ్యాప్స్ ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ చెప్పింది. మన జేబుకు చిల్లు పడకుండా, ఇంధన ఖర్చులను భారీగా తగ్గించే ఒక సూపర్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అదే ఫ్యూయల్-ఎఫిషియంట్ రూట్స్. సాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్లాలంటే తక్కువ సమయం తీసుకునే రూట్ లేదా షార్ట్‌కట్‌లను వెతుకుతాం. కానీ ఈ ఫీచర్ సమయంతో పాటు మీ వాహనానికి అతి తక్కువ ఇంధనం ఖర్చయ్యే మైలేజ్ ఫ్రెండ్లీ మార్గాన్ని పక్కాగా చూపిస్తుంది. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫీచర్ అసలు ఎలా పనిచేస్తుంది? దీన్ని మొబైల్‌లో ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఈ ఫీచర్ కేవలం దూరాన్ని మాత్రమే కాకుండా.. రోడ్డుపై ఉండే ట్రాఫిక్ పరిస్థితులు, రోడ్డులోని ఎత్తుపల్లాలు, మొత్తం దూరం, వాహనం ప్రయాణించాల్సిన సగటు వేగం వంటి అనేక కీలక అంశాలను ఏఐ సాంకేతికతతో విశ్లేషిస్తుంది. భారీ ట్రాఫిక్, తరచుగా బ్రేకులు వేయాల్సిన సిగ్నల్స్ ఉన్న రోడ్లను నివారించడం ద్వారా ఇది మీ వాహనం ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
గూగుల్ మ్యాప్స్ ప్రకారం.. ఇంజన్ రకాన్ని బట్టి ఇంధనం ఆదా అయ్యే పద్ధతులు మారుతుంటాయి. ఉదాహరణకు
డీజిల్ కార్లు: హైవేలపై ప్రయాణించినప్పుడు మెరుగైన మైలేజీని ఇస్తాయి.
హైబ్రిడ్ – ఎలక్ట్రిక్ వాహనాలు: సిటీ ట్రాఫిక్‌లో ఎక్కువ సమర్థవంతంగా పనిచేస్తాయి.
ఒకవేళ మీరు మీ వాహన రకాన్ని యాప్‌లో ఎంచుకోకపోతే.. గూగుల్ మ్యాప్స్ డిఫాల్ట్‌గా పెట్రోల్ వాహనాన్ని బేస్ చేసుకుని మార్గాలను సూచిస్తుంది. కాబట్టి మీ ఇంజన్ రకాన్ని ఖచ్చితంగా సెట్ చేసుకోవడం చాలా ముఖ్యం.
పెట్రోల్, డీజిల్, డబ్బు ఆదా కావడం అనేది పూర్తిగా మీ డ్రైవింగ్ శైలి, ప్రయాణ మార్గంపై ఆధారపడి ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ గూగుల్ మ్యాప్స్‌లో ఈ చిన్న సెట్టింగ్ మార్చుకుని పెట్రోల్ బిల్లు తగ్గించుకోండి.