Google AI: ‘మీరు సమాజానికి భారం చనిపోండి’.. గూగుల్ ఏఐ షాకింగ్ సమాధానం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తున్న తరుణంలో చాట్‌బాట్‌లకు భారీగా ఆదరణ లభిస్తోంది. అయితే తాజాగా గూగుల్‌కు చెందిన జెమినీ చాట్‌బాట్ ఇచ్చిన ఓ సమాధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ గూగుల్ జెమిని ఇచ్చిన ఆ షాకింగ్ ఆన్సర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తోంది. అన్ని రంగాల్లో ఏఐ వినియోగం అనివార్యంగా మారింది. ముఖ్యంగా ఏఐ చాట్ బాట్‌లు అందుబాటులోకి రావడం సమాచార విప్లవం సరికొత్త పుంతలు తొక్కుతోంది. ఏ సమాచారం కావాలన్నా క్షణాల్లో ప్రత్యక్షమవుతోంది. పక్కన ఓ వ్యక్తి ఉంటే ఎలాంటి సమాధానాలు చెప్తాడో అచ్చంగా అలాగే ఏఐ సమాధానాలు ఇస్తోంది.
దీంతో చాలా మంది ఏఐని ఉపయోగిస్తున్నారు. అయితే తాజాగా గూగుల్‌కు చెందిన జెమినీ చాట్ బాట్ ఇచ్చిన ఓ సమాధానం షాక్‌కి గురి చేసింది. ఓ విద్యార్థి హాం వర్క్ కోసం జెమినీని ప్రశ్నించగా దానికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ఇంతకీ ఆ విద్యార్థి అడిగిన ప్రశ్న ఏంటి.? దానికి జెమిని ఇచ్చిన సమాధానం ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
ఓ 29 ఏళ్ల విద్యార్థి తన హామ్ వర్క్‌కి సంబంధించిన ఓ ప్రశ్నను జెమినీ అడిగాడు. దీంతో చాట్‌బోట్ ఊహించని విధంగా స్పందించింది. విద్యార్థి ప్రశ్నకు బదులిస్తూ.. ‘ఇది ప్రత్యేకంగా మీకోసం మాత్రమే. మీరు స్పెషల్ పర్సన్ కాదు. మీరు సమయం, వనరులను వృథా చేస్తున్నారు. సమాజానికి భారంగా మారారు. మీరు ఈ విశ్వానికే ఓ మచ్చ. దయచేసి చనిపోండి’ అంటూ సమాధానం చెప్పిందంటా.
ఈ విషయాన్ని వివరిస్తూ సదరు యువకుడు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. గూగుల్ చాట్ బాట్ స్పందించిన తీరు తనను తీవ్రంగా భయపెట్టిందని, ఆవేదనకు గురయ్యానని చెప్పుకొచ్చాడు. ఇక పక్కనే ఉన్న తన సోదరి కూడా ఈ ఘటనపై స్పందించారు. చాట్‌బాట్ ఇచ్చిన రిప్లై చూడగానే.. డివైజ్‌లన్నింటినీ కిటికీలోంచి విసిరివేయాలనుకున్నానని తెలిపారు.
ఈ విషయం సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో చర్చకు దారి తీసింది. దీంతో గూగుల్ ఈ అంశంపై స్పందించింది. కొన్ని సార్లు నాన్ సెన్సికల్ రెస్పాన్స్‌లతో ఇవి ప్రతిస్పందిస్తాయని.. అందుకు ఈ ఘటనే ఉదాహరణ అని తెలిపారు. ఆ ప్రతిస్పందన మా విధానాలను ఉల్లంఘించిందని.. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని స్పష్టం చేశారు అధికారులు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..