
2023 KU అనే ఓ భారీ గ్రహశకలం గంటకు 64,000 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు ప్రయాణిస్తోందని నాసా హెచ్చరించింది. దాదాపు 35 అంతస్తుల భవనం పరిమాణంలో ఉండే ఈ గ్రహశకలం 2025 ఏప్రిల్ 11వ తేదీ శుక్రవారం రాత్రి 9:05 గంటలకు 64,827 కిలో మీటర్ల వేగంతో భూమిని దాటి వెళ్లనుంది. ఈ గ్రహశకలం అపోలో సమూహానికి చెందిన గ్రహశకలాలలో ఒకటి. 2023 KU గ్రహశకలం భూమికి ఒక మిలియన్ కిలోమీటర్ల దూరంలో దాటుతుందని భావిస్తున్నప్పటికీ, గురుత్వాకర్షణ శక్తి, దాని మార్గాల్లో గుర్తించబడని వైవిధ్యాల వల్ల అంత పెద్ద పరిమాణంలో ఉన్న వస్తువులు భూమికి దగ్గర ప్రయాణించడం కాస్త ఆందోళన కలిగించే అంశం.
అపోలో ఆస్టరాయిడ్స్ అనేవి భూమికి దగ్గరగా ఉన్న వస్తువుల సమూహం, వీటి కక్ష్యలు సూర్యుని చుట్టూ భూమి కక్ష్యతో కలుస్తాయి. అవి గ్రహానికి దగ్గరగా ఉండటంతో, వాటి కదలికలను పర్యవేక్షించడం చాలా ముఖ్యం ఎందుకంటే అవి దాటి వెళ్ళినప్పటికీ, చివరి క్షణంలో కక్ష్యను మార్చుకుని భూమికి కోలుకోలేని నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉంది.
ఈ గ్రహశకలం భూమిని ఢీకొంటే, దాని ఫలితంగా కలిగే విధ్వంసం అణు బాంబుల విధ్వంసంతో సమానం. అనేక ప్రాంతాలు నగరాలను తుడిచిపెట్టుకుపోతాయి. 2013లో చెల్యాబిన్స్క్ ఉల్కాపాతం కేవలం 59 అడుగుల వెడల్పు మాత్రమే ఉన్నా.. వేలాది భవనాలను దెబ్బతీసింది. 2023 KU చెల్యాబిన్స్క్ ఉల్కాపాతం కంటే ఆరు రెట్లు పెద్దది.
నాసాకు చెందిన సెంటర్ ఫర్ నియర్-ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అబ్జర్వేటరీలు భూమికి దగ్గరగా ఉన్న వస్తువులను పర్యవేక్షిస్తాయి. పాన్-స్టార్స్, కాటాలినా వంటి టెలిస్కోప్‌లు, JPL గోల్డ్‌స్టోన్ రాడార్ వంటి ప్లానెటరీ రాడార్ వ్యవస్థల ద్వారా డేటా సేకరిస్తారు.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.