
మధుమేహం (డయాబెటిస్) చికిత్స, బరువు తగ్గడంలో సమర్థంగా పనిచేసే ఓజెంపిక్ అనే ఔషధం భారత మార్కెట్లో త్వరలో లభ్యం అవుతుంది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) దీని వాడకానకు ఆమోదం తెలిపింది. టైప్ 2 మధుమేహం చికిత్స కోసం దీనిని భారతదేశంలో ఉపయోగిస్తారు.
ఆరోగ్య నిపుణుల సమాచారం ప్రకారం, ఈ ఔషధం ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. చక్కెర స్థాయిలు నియంత్రించడంలో అలాగే బరువు తగ్గడంలో ప్రభావవంతంగా ఉంటుంది. దీనిని డానిష్ ఔషధ సంస్థ నోవో నార్డిస్క్ అభివృద్ధి చేసింది. పలు దేశాల్లో ఇప్పటికే దీనిని వాడుతున్నారు. భారతదేశంలో మధుమేహం సమస్య వేగంగా పెరుగుతోంది. అటువంటి పరిస్థితులలో ఈ ఔషధం ఒక ముఖ్యమైన ఎంపిక అవుతుంది.
ఓజెంపిక్ పనితీరు
ఓజెంపిక్ లో ప్రధాన అంశం సెమాగ్లుటైడ్. ఇది గ్లూకాగాన్ లాంటి పెప్టైడ్-1 (GLP-1) రిసెప్టర్ అగోనిస్ట్. ఇది శరీరంలో ఇన్సులిన్ విడుదల పెంచుతుంది. రక్తంలో చక్కెర నియంత్రిస్తుంది. ఇది ఆకలి తగ్గిస్తుంది, జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీని వలన బరువు తగ్గుదలకు సహాయపడుతుంది.
2017లో అమెరికా, యూరప్లో ఓజెంపిక్ కు తొలిసారి ఆమోదం లభించింది. బరువు తగ్గడంలో సహాయకారిగా ఉండటం వలన స్థూలకాయం చికిత్సలో కూడా దీనిని వాడుతున్నారు. అయితే, భారతదేశంలో ప్రస్తుతం ఇది మధుమేహం చికిత్స కోసం మాత్రమే ఆమోదించారు.
ఎప్పుడు, ఎలా ప్రభావం చూపుతుంది
ఈ ఔషధం వారానికి ఒక్కసారి ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. తక్కువ మోతాదుతో మొదలుపెట్టి క్రమంగా లక్ష్య మోతాదుకు పెంచుతారు.
రక్తంలో చక్కెర స్థాయిల పైన ప్రభావం రెండు నుంచి నాలుగు వారాల్లో కనిపిస్తుంది.
HbA1cలో మెరుగుదలలు 3 నుంచి 6 నెలల్లో కనిపిస్తాయి.
ఈ ఔషధం తీసుకున్న తర్వాత ప్రజలు సగటున 5 నుంచి 10 శాతం బరువు తగ్గుతారు. అయితే, ఇది వ్యక్తి జీవనశైలి, ఆహారంపైన ఆధారపడి ఉంటుంది. ఔషధంతో పాటు ఆహార నియంత్రణ అవసరం.
దుష్ప్రభావాలు, ధర
అన్ని మందుల మాదిరిగానే, ఓజెంపిక్ కొన్ని దుష్ప్రభావాలు చూపుతుంది. ప్రారంభంలో జీర్ణ సమస్యలు, వాంతులు, మలబద్ధకం లేదా విరేచనాలు ఉండవచ్చు. అరుదుగా ప్యాంక్రియాటైటిస్, పిత్తాశయ సమస్యలు రావచ్చు. దుష్ప్రభావాలు తగ్గడానికి తక్కువ మోతాదుతో ప్రారంభించి క్రమంగా పెంచాలని వైద్యులు సూచిస్తారు. దీనిని తప్పనిసరిగా వైద్య పర్యవేక్షణలో తీసుకోవాలి.
భారతదేశంలో ఓజెంపిక్ ధర ఇంకా ప్రకటించలేదు. ఇది పేటెంట్ పొందిన దిగుమతి కాబట్టి ప్రారంభంలో ఖరీదైనది కావచ్చు. సెమాగ్లుటైడ్ పేటెంట్ 2026 మార్చిలో ముగుస్తుంది. తర్వాత భారతీయ ఔషధ సంస్థలు దీని జెనరిక్ వెర్షన్లు విడుదల చేస్తాయి. అప్పుడు ధరలు తగ్గి, ఔషధం అందరికీ అందుబాటులోకి వస్తుంది.