AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డేటా సెంటర్లకు కొత్త అడ్రస్..! సీక్రెట్‌ ప్రయోగాలకు తెరతీసిన ఎలక్ట్రానిక్ దిగ్గజం

ఒకప్పుడు డేటా సెంటర్ అనగానే భారీ భవనాలు గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు టెక్నాలజీ రూపురేఖలు మారిపోతున్నాయి. ఏఐ డేటా వినియోగం పెరగడంతో భూమిపై స్థలం, విద్యుత్ కొరత టెక్ కంపెనీలకు సవాలుగా మారింది. దీనికి పరిష్కారంగా సముద్రాలపై తేలియాడే డేటా సెంటర్లను నిర్మించేందుకు శామ్సంగ్ హెవీ ఇండస్ట్రీస్ సిద్ధమైంది. సముద్రమే డేటా కేంద్రంగా ఎలా మారబోతోందో తెలుసా?

డేటా సెంటర్లకు కొత్త అడ్రస్..! సీక్రెట్‌ ప్రయోగాలకు తెరతీసిన ఎలక్ట్రానిక్ దిగ్గజం
Floating Data Centers.jpg
Nikhil
|

Updated on: Jun 18, 2026 | 9:00 PM

Share

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరుగులు పెడుతుంటే, దానికి కావాల్సిన శక్తి కోసం సముద్రాలే కొత్త అడ్రస్‌గా మారబోతున్నాయి. భూమిపై స్థలం, శీతలీకరణ సమస్యలకు చెక్ పెడుతూ, శామ్సంగ్ సంస్థ సముద్రాలపై తేలియాడే ఏఐ డేటా సెంటర్లను నిర్మిస్తోంది. డేటాను మోయబోతున్న ఓడలు, సముద్ర మధ్యలో పనిచేయబోయే ఏఐ వ్యవస్థల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం..

సముద్రాలపైకి ఎందుకు?

భారీ ఏఐ డేటా సెంటర్లకు నిరంతర విద్యుత్, శక్తివంతమైన కూలింగ్ వ్యవస్థలు చాలా అవసరం. అయితే అమెరికా, యూరప్ వంటి దేశాల్లో భూమి అందుబాటులో లేకపోవడం, విద్యుత్ గ్రిడ్ కనెక్షన్ల కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సి రావడం టెక్ దిగ్గజాలకు పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలోనే శామ్సంగ్ హెవీ ఇండస్ట్రీస్, గ్రీస్‌కు చెందిన క్యాపిటల్ క్లీన్ ఎనర్జీ, లాయిడ్స్ రెజిస్టర్‌తో కలిసి ‘ఫ్లోటింగ్ డేటా సెంటర్’ ప్రాజెక్టును చేపట్టింది. సముద్రపు నీటిని నేరుగా కూలింగ్ కోసం వాడటం ద్వారా విద్యుత్ ఖర్చులను భారీగా తగ్గించుకోవచ్చని కంపెనీ భావిస్తోంది.

సాంకేతిక సామర్థ్యం

శామ్సంగ్ నిర్మిస్తున్న ఈ మొదటి ఫ్లోటింగ్ డేటా సెంటర్ సామర్థ్యం 50 మెగావాట్లు. ఇది వేల సంఖ్యలో ఏఐ సర్వర్లను నిర్వహించగలదు. తీరానికి దగ్గరగా ఉంటే సముద్ర అడుగున ఉన్న కేబుల్స్ ద్వారా విద్యుత్ పొందుతుంది, లేదంటే తనంతట తానుగానే సహజ వాయువుతో విద్యుత్ ఉత్పత్తి చేసుకునే ఫ్యూయల్ సెల్స్ ఇందులో ఉంటాయి. అయితే, సముద్రపు అలలు, తేమ, ఉప్పునీటి వల్ల వచ్చే తుప్పు నుంచి సర్వర్లను రక్షించడం ఒక సవాలు. దీని కోసం శామ్సంగ్ ‘సూపర్ మైక్రో’ సంస్థతో కలిసి ప్రత్యేక పరిశోధనలు చేస్తోంది.

మారుతున్న టెక్నాలజీ

ఈ రంగంలో శామ్సంగ్ ఒక్కటే కాదు. జపాన్, టర్కీ కంపెనీలు కూడా 2027 నాటికి ఇలాంటి ప్రాజెక్టులను ప్రారంభించాలని చూస్తున్నాయి. ఇప్పటికే చైనాలో నీటి అడుగున డేటా సెంటర్ కార్యకలాపాలు సాగిస్తోంది. ఒకప్పుడు ఓడలు సరుకును మాత్రమే మోసేవి, కానీ ఇప్పుడు అవే ఓడలు డేటాను మోయడానికి సిద్ధమవుతున్నాయి. భూమిపై స్థలం అయిపోతున్న వేళ, సముద్రాలే భవిష్యత్ ఏఐ సామ్రాజ్యానికి కొత్త చిరునామాలుగా మారుతున్నాయి. ఏఐ వ్యవస్థలన్నీ నీళ్లపైనే పనిచేసే రోజులు త్వరలోనే రాబోతున్నాయి. టెక్నాలజీలో ఈ మార్పు ఖచ్చితంగా విప్లవాత్మకమే!

Follow Us