AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Be Alert: EV కొనేముందు ఈ విషయం తెలుసుకోకపోతే కచ్చితంగా ప్రమాదంలో పడతారు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. పర్యావరణహితమైన ప్రయాణం కోసం సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, పెరుగుతున్న ఈవీల సంఖ్యకు అనుగుణంగా మన ఇళ్లలో ఛార్జింగ్ సౌకర్యాలు లేవని తాజా రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి. వాహనాన్ని కొనుగోలు చేయడం ఎంత ముఖ్యమో, దాన్ని సురక్షితంగా ఛార్జ్ చేసేలా ఇంటి విద్యుత్ వ్యవస్థను సిద్ధం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం.

Be Alert: EV కొనేముందు ఈ విషయం తెలుసుకోకపోతే కచ్చితంగా ప్రమాదంలో పడతారు
Electric Vehicle Charging Safety.jpg
Nikhil
|

Updated on: Jul 01, 2026 | 11:30 PM

Share

అలయన్స్ ఫర్ యాన్ ఎనర్జీ ఎఫిషియంట్ ఎకానమీ (AEEE), కాజమ్ నివేదిక ప్రకారం, చాలామంది తమ ఇళ్లలో ఉన్న సాధారణ సాకెట్లు లేదా ఎక్స్‌టెన్షన్ బోర్డుల ద్వారా ఈవీలను ఛార్జ్ చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో అగ్ని ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ సమస్య ఎందుకు తలెత్తుతోంది? దీన్ని ఎలా అధిగమించాలి?

పెరుగుతున్న వాహనాలు..

2016లో కేవలం 50,000 ఈవీలు అమ్ముడవ్వగా, 2025 నాటికి ఈ సంఖ్య 23 లక్షలకు పెరిగింది. ఇందులో 91 శాతం వాటా కేవలం ఎలక్ట్రిక్ టూ-వీలర్లు, త్రీ-వీలర్లదే. అంటే మన దైనందిన జీవితంలో ఈవీల పాత్ర చాలా పెరిగింది. కానీ, ఇంటి వద్ద సురక్షితమైన ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసుకునే విషయంలో చాలామంది వెనుకబడి ఉన్నారు. కేవలం 55 శాతం మందికి మాత్రమే ఇంట్లో సరైన ఛార్జింగ్ సదుపాయం ఉంది. దాదాపు 30 శాతం మంది తమ ఇంటి ఎలక్ట్రికల్ సిస్టమ్‌లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని నివేదిక స్పష్టం చేస్తోంది.

ఎందుకు ప్రమాదకరం?

చాలామంది ఈవీలను సాధారణ సాకెట్ల ద్వారా ఛార్జ్ చేస్తారు. ఇది దీర్ఘకాలంలో ప్రమాదకరం. ఇంటి వైరింగ్ సామర్థ్యం, లోడ్ కెపాసిటీని పరిగణనలోకి తీసుకోకుండా ఛార్జ్ చేయడం వల్ల షార్ట్ సర్క్యూట్లు, బ్యాటరీ దెబ్బతినడం, చివరకు అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఎక్స్‌టెన్షన్ బోర్డులను వాడటం వల్ల ఛార్జర్ కూడా త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంది.

అపార్ట్‌మెంట్లలో ఇబ్బందులు..

ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో 60 నుంచి 80 శాతం జనాభా అపార్ట్‌మెంట్లలోనే నివసిస్తున్నారు. ఇక్కడ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయడం పెద్ద సవాలుగా మారింది. పార్కింగ్ స్థలాలు అందరికీ ఉమ్మడిగా ఉండటం, విద్యుత్ లోడ్ పరిమితులు ఉండటం వల్ల ప్రతి ఒక్కరూ ఛార్జింగ్ సాకెట్లను ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు. ఆర్డబ్ల్యూఏ (RWA) అనుమతులు, ఇంటి యజమాని అంగీకారం పొందడం ఈ ప్రక్రియలో అతి పెద్ద అడ్డంకిగా మారింది.

ఈవీని కొన్న ప్రతి ఒక్కరూ ఇంటి వైరింగ్ సరిగ్గా ఉందో లేదో ఎలక్ట్రీషియన్ ద్వారా పరీక్షించుకోవాలి. ఎక్కువ విద్యుత్ సామర్థ్యం అవసరమైనప్పుడు ప్రత్యేకమైన ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. అపార్ట్‌మెంట్లలో నివసించే వారు ఆర్డబ్ల్యూఏతో మాట్లాడి సామూహిక ఛార్జింగ్ స్టేషన్ల కోసం ప్రయత్నించాలి. భద్రతే ప్రాధాన్యతగా భావించి, సరైన పద్ధతుల్లో ఛార్జ్ చేసుకుంటేనే ఈవీ ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.

Follow Us