
ఒకప్పుడు కారు నడపడం చాలా సరదాగా, సులభంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. రోడ్లపై కేవలం ట్రాఫిక్ పోలీసులు మాత్రమే కాదు.. ప్రతి జంక్షన్ లోనూ అత్యాధునిక ఏఐ ఆధారిత స్మార్ట్ కెమెరాలు నిరంతరం నిఘా ఉంచుతున్నాయి. అతివేగం, సీట్‌బెల్ట్ పెట్టుకోకపోవడం, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్‌లో మాట్లాడటం లేదా సిగ్నల్ జంప్ చేయడం వంటి చిన్న తప్పు చేసినా సరే.. ఈ స్మార్ట్ కెమెరాలు క్షణాల్లో కనిపెట్టేస్తున్నాయి. ఏమాత్రం ఆలస్యం లేకుండా నేరుగా చలాన్ మెసేజ్ మొబైల్‌కు వచ్చేస్తోంది. అందుకే ఈ రోజుల్లో కొత్త కారు కొనుగోలు చేసేటప్పుడు కేవలం మైలేజ్, డిజైన్, లుక్స్, ఇంజిన్ పవర్ మాత్రమే చూస్తే సరిపోదు. భారీ జరిమానాల నుండి మన జేబును కాపాడే, ప్రాణాలకు రక్షణ ఇచ్చే స్మార్ట్ సెక్యూరిటీ ఫీచర్లు కార్లలో ఉండటం అత్యవసరంగా మారింది. అదృష్టవశాత్తూ ఒకప్పుడు కేవలం కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లకే పరిమితమైన ఈ అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్లు, ఇప్పుడు సామాన్యుడి బడ్జెట్, మధ్యశ్రేణి కార్లలో కూడా అందుబాటులోకి వచ్చాయి. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించక ముందే డ్రైవర్లను హెచ్చరించే ఆ టాప్ ఫీచర్లు ఏంటో అందరూ తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్లో ADAS ఫీచర్‌కు డిమాండ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇందులో డ్రైవర్‌ను అలర్ట్ చేసే అనేక సబ్ ఫీచర్లు ఉంటాయి.
స్పీడ్ వార్నింగ్: సదరు రోడ్డుపై నిర్ణయించిన వేగ పరిమితిని దాటి కారు వెళ్తుంటే ఈ సిస్టమ్ వెంటనే బీప్ శబ్దాలతో డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది. దీనివల్ల ఓవర్ స్పీడ్ చలాన్ల బారిన పడకుండా ఉండొచ్చు.
లేన్ అసిస్ట్: కారు లేన్ దాటి పక్కకు వెళ్తుంటే స్టీరింగ్‌ను సరిచేస్తూ అలర్ట్ చేస్తుంది.
ఫార్వర్డ్ కొలిజన్ అలర్ట్: ముందు ఏదైనా వాహనం అడ్డు వస్తే ముందే హెచ్చరించి, ప్రమాదాలను నివారిస్తుంది.
చాలాసార్లు ఏ రోడ్డుపై ఎంత స్పీడ్ లిమిట్ ఉందో బోర్డులు ఉన్నా మనం గమనించం. కానీ ఈ ఫీచర్ రోడ్డు పక్కన ఉండే వేగ పరిమితి బోర్డులను, నో-పార్కింగ్ వంటి ఇతర ట్రాఫిక్ సంకేతాలను ఆటోమేటిక్‌గా రీడ్ చేస్తుంది. ఆ వివరాలను నేరుగా డ్రైవర్ ముందుండే డిజిటల్ స్క్రీన్‌పై ప్రదర్శిస్తుంది. తద్వారా డ్రైవర్ నియమ నిబంధనల ప్రకారం కారును కంట్రోల్ చేసుకోవచ్చు.
సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఇప్పుడు ఏఐ కెమెరాలు భారీగా ఫైన్ వేస్తున్నాయి. అయితే ఇప్పుడు వస్తున్న దాదాపు ప్రతి కొత్త కారులోనూ స్మార్ట్ సీట్ బెల్ట్ రిమైండర్ వస్తోంది. డ్రైవర్ లేదా ప్రయాణీకులు బెల్ట్ పెట్టుకోకపోతే కారు నిరంతరం అలారం ధ్వనిస్తూనే ఉంటుంది. ఇది భద్రతను పెంచడంతో పాటు చలాన్లను పూర్తిగా నివారిస్తుంది.
ఈ రోజుల్లో డాష్‌క్యామ్ అనేది కారులో అత్యంత కీలకమైన భాగంగా మారిపోయింది. కారు విండ్‌షీల్డ్‌కు ఉండే ఈ కెమెరా రోడ్డుపై జరిగే ప్రతి సంఘటనను లైవ్‌గా రికార్డ్ చేస్తుంది. రోడ్డుపై ఏదైనా వివాదం జరిగినప్పుడు లేదా మన తప్పు లేకపోయినా పొరపాటున పోలీసులు తప్పుడు జరిమానా విధించినప్పుడు.. మన వైపు ఉన్న నిజాయితీని నిరూపించుకోవడానికి ఈ డాష్‌క్యామ్ ఫుటేజ్ ఒక బలమైన సాక్ష్యంగా ఉపయోగపడుతుంది.
భారీ ట్రాఫిక్ ఉన్న ఏరియాల్లో కారును నడపాలన్నా లేదా ఇరుకైన ప్రదేశాల్లో పార్కింగ్ చేయాలన్నా ఈ ఫీచర్ ఒక వరం లాంటిది. కారు చుట్టూ ఉన్న పరిసరాలను స్క్రీన్ పై క్లియర్ గా చూపిస్తుంది. దీనివల్ల పక్కన ఉన్న వాహనాలకు లేదా డివైడర్లకు కారు తగలకుండా స్క్రాచెస్ పడకుండా సురక్షితంగా డ్రైవ్ చేయవచ్చు.
రోడ్లపై కెమెరాల నిఘా పెరిగిన నేపథ్యంలో కొత్త కారు కొనేటప్పుడు ఈ స్మార్ట్ సేఫ్టీ ఫీచర్లు ఉన్న మోడల్స్‌ను ఎంచుకోవడమే ఉత్తమమైన మార్గం. ఇవి కేవలం చలాన్ల జరిమానాల నుండి మన డబ్బును ఆదా చేయడమే కాదు.. అంతకంటే విలువైన మన ప్రాణాలకు శ్రీరామరక్షగా నిలుస్తాయి.