AI Hospital: వైద్య రంగంలో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి AI ఆస్పత్రి! రోబోలే డాక్టర్లు, నర్సులు..
చైనాలో ఏర్పాటైన ప్రపంచపు మొట్టమొదటి ఏఐ ఆసుపత్రి, "ఏజెంట్ ఆసుపత్రి," రోబో డాక్టర్లు, వర్చువల్ నర్సులతో రోగులకు వైద్య సేవలు అందిస్తోంది. 21 వైద్య విభాగాలలో సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రి, USMLE పరీక్షలో 93.06% స్కోర్ సాధించిన AI డాక్టర్లతో వేగవంతమైన, కచ్చితమైన చికిత్సను అందిస్తుంది.

కలలో కూడా ఊహించని కొన్ని వింతలు ఏఐ చేసి చూపిస్తుంది. భవిష్యత్తులో మనిషికి మరో మనిషితో అవసరం లేకుండా ప్రతి అవసరం తీర్చేందుకు ఏఐ మెరుపువేగంతో అభివృద్ధి చెందుతోంది. అలాంటి ఏఐని ఉపయోగించుకొని చైనా మరిన్ని అద్భుతాలు సృష్టిస్తోంది. తాజాగా చైనా చేసిన మరో అద్భుతమే “ఏజెంట్ హాస్పిటల్” ఇదేదో సాధారణ ఆస్పత్రి కాదు.. రోగుల తప్ప మరో వేరే మనిషి కనిపించని ఆస్పత్రి. ఇందులో కేవలం రోగులు మాత్రమే మనుషులు ఉంటారు.. మిగతా వారంతా వర్చువల్‌గానే ఉంటారు. అంతా ఏఐ మయం. రోబోలే డాక్టర్లు, నర్సులు. వింటుంటే వింతగా ఉన్నా.. చైనా దీన్ని నిజం చేసి చూపించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో పనిచేసే ఆస్పత్రిని చైనా ఏర్పాటు చేసింది.
ఎంతో ప్రత్యేకమైన ఈ ఆస్పత్రికి ఏజెంట్ హాస్పిటల్ అనే పేరు పెట్టింది. ఈ వర్చువల్ ఆస్పత్రిని చైనాలోని ప్రముఖ సింఘువా యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీన్ని ఇటీవలె అధికారికంగా ప్రారంభించింది చైనా. ఇందులో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అంతా వర్చువల్‌గానే ఉంటారు. 14 మంది ఏఐ డాక్టర్లు, నలుగురు వర్చువల్ నర్సులు ఈ ఏఐ ఆస్పత్రిలో సేవలు అందిస్తారు. చాట్‌జీపీటీ 3.5 టెక్నాలజీని వాడి ఏఐ రోబో డాక్టర్లు పనిచేస్తారు. ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్, శ్వాసకోశ వ్యాధులు, పిల్లల వైద్యం, కార్డియాలజీ సహా మొత్తంగా 21 విభాగాల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. సాధారణ వైద్యులతో పోల్చితే ట్రీట్‌మెంట్‌లో వేగం, కచ్చితత్వం ఉంటుంది.
మనం వెళ్లే ఆస్పత్రులతో పోల్చితే.. గంటలు, రోజులు పట్టే వైద్య చికిత్స ఈ హాస్పిటల్‌లో కేవలం నిమిషాల్లో అయిపోతుంది. రోజుకు 3 వేల మంది రోగులకు వైద్య సేవలు అందించే సామర్థ్యం కలిగి ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ ఏఐ ఆస్పత్రి ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ ఏఐ రోబో డాక్టర్లు యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ (USMLE)లో 93.06% స్కోర్ సాధించడం విశేషం. పైగా ఈ ఏఐ డాక్టర్లు ఎప్పటికప్పడు తమ నైపుణ్యాన్ని, డేటాను అభివృద్ధి చేసుకుంటూ ఉంటాయి. ఇక పోతే కేవలం వైద్యం, రోగి సంరక్షణ మాత్రమే కాదు.. కాబోయే డాక్టర్లకు ఇవి పాఠాలు కూడా చెబుతాయి. వైద్య విద్యలో విప్లవాత్మక మార్పులకు ఈ ఏజెంట్ ఆస్పత్రి వేదిక కానుంది. వైద్య విద్యార్థులు హైపర్-రియలిస్టిక్ వాతావరణంలో శిక్షణ పొందవచ్చు. భవిష్యత్తులో ఇలాంటి ఆస్పత్రులు ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని ఏర్పాటు అయ్యే అవకాశం మెండుగా ఉంది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




