Roger Federer Retirement: రోజర్ ఫెదరర్ టెన్నిస్ కోర్టుకు వీడ్కోలు పలికాడు. లండన్ వేదికగా జరుగుతున్న లావర్ కప్ కోర్టులో అతను తన చివరి మ్యాచ్ ఆడాడు. విశేషమేమిటంటే, పురుషుల సింగిల్స్‌లో మకుటం లేని..
Roger Federer Retirement: రోజర్ ఫెదరర్ టెన్నిస్ కోర్టుకు వీడ్కోలు పలికాడు. లండన్ వేదికగా జరుగుతున్న లావర్ కప్ కోర్టులో అతను తన చివరి మ్యాచ్ ఆడాడు. విశేషమేమిటంటే, పురుషుల సింగిల్స్‌లో మకుటం లేని ఈ రాజు తన చివరి మ్యాచ్‌ను స్విస్ బుల్ రఫెల్ నాదల్‌తో కలిసి డబుల్స్ బరిలోకి దిగాడు. అయితే ఈ వీడ్కోలు మ్యాచ్‌లో ఫెడరర్- నాదల్ జోడి ఓటమిపాలైంది. ఆరంభంలో అదరగొట్టిన ఈ సూపర్ జోడీ ఫ్రాన్సెస్ టియాఫో- జాక్ సాక్ చేతిలో4-6, 7-6(2), 11-9 ఓటమిపాలైంది. కాగా ఫెదరర్ తన చివరి మ్యాచ్‌లో గెలుపొందాలని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. కానీ అదేమి జరగలేదు. కాగా ఈ మ్యాచ్ తర్వాత టెన్నిస్ కోర్టంతా కన్నీటి భావోద్వేగాలతో నిండిపోయింది. ఫెదరర్‌తో పాటు చివరి మ్యాచ్‌లో అతనితో కలసి కోర్టును పంచుకున్న నాదల్ వెక్కివెక్కి ఏడ్చారు. వారితో పాటు జకోవిచ్, ముర్రే వంటి స్టార్ ఆటగాళ్లతో పాటు టోర్నీ నిర్వాహకులు, ప్రేక్షకులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఫెదరర్.. ‘ఇది నాకు చాలా పెద్ద రోజు. టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్నందుకు నేనేమీ విచారంగా లేను. ఇక్కడ నిలబడటంనాకు చాలా సంతోషంగా ఉంది. అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్యన చివరి మ్యాచ్ ఆడడం మర్చిపోలేని అనుభూతి. ఇన్ని సంవత్సరాలు పాటు నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అంటూ భావోద్వేగానికి గురయ్యాడీ స్విస్ స్టార్. కాగా 41 ఏళ్ల ఫెదరర్ గత వారమే సోషల్ మీడియా ద్వారా రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. లావర్ కప్‌కు ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రఫెల్ నాదల్‌తో కలిసి డబుల్స్ ఆడాలనేది తన కల అని చెప్పాడు. తాజాగా తన కలను సాకారం చేసుకుని టెన్నిస్‌కు ఘనంగా వీడ్కోలు పలికాడీ లెజెండ్ ప్లేయర్.