AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PKL 2024: అషు మాలిక్ సూపర్ టెన్‌.. బెంగాల్‌ వారియర్స్‌పై దబాంగ్‌ ఢిల్లీ విజయం

Pro Kabaddi League, PKL 2024 Season 11: ప్రొ కబడ్డీ లీగ్‌(పీకేఎల్‌) 11వ సీజన్‌ దబాంగ్ ఢిల్లీ కేసీ మళ్లీ విజయాల బాట పట్టింది. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత బెంగాల్ వారియర్స్‌ను ఓడించి మూడో విజయం ఖాతాలో వేసుకుంది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా బుధవారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 33–30 తేడాతో బెంగాల్‌పై ఉత్కంఠ విజయం సాధించింది.

PKL 2024: అషు మాలిక్ సూపర్ టెన్‌.. బెంగాల్‌ వారియర్స్‌పై దబాంగ్‌ ఢిల్లీ విజయం
Dabang Delhi K.c. Beats Bengal Warriorz
Janardhan Veluru
|

Updated on: Nov 07, 2024 | 9:52 PM

Share

హైదరాబాద్‌, 7 నవంబర్: ప్రొ కబడ్డీ లీగ్‌(పీకేఎల్‌) 11వ సీజన్‌ దబాంగ్ ఢిల్లీ కేసీ మళ్లీ విజయాల బాట పట్టింది. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత బెంగాల్ వారియర్స్‌ను ఓడించి మూడో విజయం ఖాతాలో వేసుకుంది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా బుధవారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 33–30 తేడాతో బెంగాల్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. ఢిల్లీ కెప్టెన్‌, స్టార్ రెయిడర్‌‌ అషు మాలిక్ పది పాయింట్లతో మరో సూపర్ టెన్ సాధించాడు. అతనికి తోడు వినయ్‌ 8 పాయింట్లు, ఆశీష్​ ఆరు పాయింట్లతో రాణించారు. బెంగాల్ వారియర్స్‌ జట్టులో రెయిడర్ నితిన్ కుమార్ 15 పాయింట్లతో అద్భుతంగా పోరాడినా ఫలితం లేకపోయింది. కెప్టెన్, డిఫెండర్ ఫజెల్ అత్రాచలి 5 పాయింట్లతో హైఫైవ్ ఖాతాలో వేసుకున్నాడు.

హోరాహోరీలో ఢిల్లీ పైయి..

ఆరంభంలో ఆట హోరాహోరీగా సాగినా దబాంగ్ ఢిల్లీ క్రమంగా జోరు పెంచి తొలి అర్ధభాగంలో పైచేయి సాధించింది. మణిందర్‌‌ బోనస్‌తో బెంగాల్ వారియర్స్‌ జట్టు ఖాతా తెరిచాడు. ఆవెంటనే ఢిల్లీ స్టార్ రెయిడర్‌‌ బోనస్‌ సాధించినా ఫజెల్ అత్రాచలి అతడిని ట్యాకిల్ చేశాడు. తర్వాతి రెయిడ్‌లో విజయ్ కూడా ప్రత్యర్థి డిఫెండర్లకు చిక్కగా.. డూ ఆర్ డై రెయిడ్‌లో నితిన్‌ కుమార్‌‌ అషు మాలిక్ పట్టు నుంచి తప్పించుకొని వచ్చాడు. దాంతో బెంగాల్ 4–1తో ఆరంభ ఆధిక్యం దక్కించుకుంది. కానీ, ఆశీష్‌ వరుస రెయిడ్లలో విజయవంతం కావడంతో ఢిల్లీ 6–6తో స్కోరు సమం చేసింది. అషు మాలిక్ రెయిండింగ్‌లో జోరు పెంచగా.. డిఫెన్స్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేసింది. మణిందర్‌తో పాటు విశ్వాస్‌ను ట్యాకిల్ చేసి బెంగాల్ ను ఆలౌట్ చేసి 14–8తో ఆధిక్యాంలోకి వెళ్లింది. బెంగాల్ జట్టులో నితిన్ వరుస రెయిడ్ పాయింట్లు రాబట్టినా.. ఆధిక్యాన్ని కాపాడుకున్న ఢిల్లీ19-13తో తొలి అర్ధభాగాన్ని ముగించింది.

Dabang Delhi K.c. Beats Bengal Warriorz2

Dabang Delhi K.c. Beats Bengal Warriorz

ఢిల్లీదే జోరు..

రెండో అర్ధభాగంలోనూ వారియర్స్‌ ఆటగాడు నితిన్‌ జోరు చూపెడూ సూపర్‌‌ 10 పూర్తి చేసుకున్నాడు. దాంతో బెంగాల్ నెమ్మదిగా ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించి పోటీలోకి వచ్చే ప్రయత్నం చేసింది. డిఫెన్స్‌లోనూ కాస్త మెరుగైంది. అటు రెయిడింగ్‌లో నితిన్‌కు తోడు సుశీల్‌ కూడా వెంటవెంటనే రెండు రెయిడ్ పాయింట్లు రాబట్టాడు. డూ ఆర్ డై రెయిడ్‌కు వచ్చిన అంకిత్‌ మానెను అద్భుతంగా ట్యాకిల్‌ చేసిన ఫజెల్‌ అత్రాచలి హై ఫైవ్ పూర్తి చేసుకున్నాడు. దాంతో మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా బెంగాల్27–31తో ఢిల్లీ ఆధిక్యాన్ని నాలుగు పాయింట్లకు పరిమితం చేసింది. ఈ దశలో అషు మాలిక్ ఎమ్టీ రైయిడ్‌తో సమయం వృథా చేసే ప్రయత్నం చేశాడు. చివర్లో నితిన్‌ మెరుపు వేగంతో రెండు పాయింట్లు తీసుకురావడంతో స్కోరు 29–31తో ఉత్కంఠా మారింది. అయితే, డూ ఆర్‌‌ డై రెయిడ్‌కు వెళ్లిన అషు మాలిక్‌.. మయూర్ కదమ్‌ను డైవింగ్ హ్యాండ్‌ టచ్‌తో ఢిల్లీకి మరో పాయింట్‌ అందించాడు. ఆ వెంటనే నితిన్‌ మరో టచ్‌ పాయింట్‌ తెచ్చినా.. ఆఖరి రెయిడ్‌కు వచ్చిన అషు మాలిక్‌.. ఫజెల్‌ అత్రాచలి పట్టు నుంచి తప్పించుకొని వచ్చాడు. దాంతో ఢిల్లీ మూడు పాయింట్ల ఆధిక్యంతో మ్యాచ్‌ను ముగించింది.