Ind vs Pak : క్రికెట్ ప్రపంచంలో బిగ్గెస్ట్ న్యూస్.. చివరకు దారికొచ్చిన పాకిస్తాన్..భారత్‌తో మ్యాచ్‌కు పీసీబీ గ్రీన్ సిగ్నల్ ?
Ind vs Pak : టీ20 వరల్డ్ కప్ 2026లో అసలైన మజా ఇచ్చే భారత్ పాకిస్తాన్ మ్యాచ్‌పై నీలినీడలు తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ భారత్‌తో ఆడేది లేదు అంటూ భీష్మించుకు కూర్చున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎట్టకేలకు మెత్తబడింది.

Ind vs Pak : టీ20 వరల్డ్ కప్ 2026లో అసలైన మజా ఇచ్చే భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై నీలినీడలు తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ భారత్‌తో ఆడేది లేదు అంటూ భీష్మించుకు కూర్చున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎట్టకేలకు మెత్తబడింది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌పై తమ పంతాన్ని వీడి, యూ-టర్న్ తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. శ్రీలంక క్రికెట్ బోర్డు విజ్ఞప్తి మేరకు, భారత్‌తో తలపడే అంశంపై తమ ప్రభుత్వంతో మాట్లాడతామని పీసీబీ ప్రకటించింది.
శ్రీలంక క్రికెట్ బోర్డు విజ్ఞప్తి ఏంటి?
పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం తన గ్రూప్ మ్యాచ్‌లను కొలంబో, పల్లెకెలె వేదికగా ఆడుతోంది. అయితే భారత దేశంతో క్రికెట్ ఆడేందుకు పాక్ ప్రభుత్వం మొదట నిరాకరించింది. దీనివల్ల ఫిబ్రవరి 15న జరగాల్సిన అతిపెద్ద మ్యాచ్ క్యాన్సల్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు శమ్మి సిల్వా నేరుగా పీసీబీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీకి ఈమెయిల్ పంపారు. భారత్-పాక్ మ్యాచ్ జరగకపోతే శ్రీలంక క్రికెట్‌కు భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతుందని, టికెట్ల ఆదాయం దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీలంకకు ప్రస్తుతం ఆర్థికంగా పాక్ మద్దతు అవసరమని బతిమిలాడటంతో పాక్ బోర్డు దిగివచ్చింది.
ఆర్థిక నష్టం, ఐసీసీ ఒత్తిడి
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఐసీసీకి, బ్రాడ్‌కాస్టర్లకు కాసుల వర్షం. ఈ మ్యాచ్ రద్దయితే కోట్లాది రూపాయల రెవెన్యూ నష్టం జరుగుతుంది. శ్రీలంక క్రికెట్ బోర్డు చేసిన విజ్ఞప్తిని కాదనలేక, పీసీబీ చీఫ్ ఈ విషయాన్ని తమ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటికే తమ జట్టును టోర్నీ కోసం శ్రీలంక పంపినప్పటికీ, కేవలం భారత్‌తో ఆడేందుకు మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పుడు శ్రీలంక బోర్డు విన్నపంతో పాక్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం.
విజయంతో మొదలుపెట్టిన పాక్
మరోవైపు, టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ తన ప్రస్థానాన్ని ఘనంగా ప్రారంభించింది. శనివారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో నెదర్లాండ్స్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించి బోణీ కొట్టింది. 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో పాక్ బ్యాటర్లు తడబడినా, చివరికి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు భారత్‌తో మ్యాచ్‌కు కూడా పీసీబీ మొగ్గు చూపితే, ఫిబ్రవరి 15న కొలంబో స్టేడియం అభిమానుల కేరింతలతో హోరెత్తడం ఖాయం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
