ఉక్రెయిన్‌పై జరుగుతున్న దాడులను (Russia Ukraine War) ఆపాలని రష్యా టెన్నిస్ క్రీడాకారిణి అనస్తాసియా పావ్లియుచెంకోవా(Anastasia Pavlyuchenkova) విజ్ఞప్తి చేసింది. ప్రజల్లో భయానక వాతావరణం నెలకొందని సోషల్‌మీడియాలో ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటువంటి పరిస్థితిలో, హింస, యుద్ధాన్ని ఆపాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఇప్పటికే రష్యా పురుష టెన్నిస్ ప్లేయర్ ఆండీ రుబ్లెవ్ యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన తరువాత ఈ రష్యన్ టెన్నిస్ క్రీడాకారిణి కూడా ఇదే వ్యాఖ్యలు చేసింది. మ్యాచ్ తర్వాత రుబ్లెవ్ కెమెరాపై ‘స్టాప్ వార్’ అంటూ రాసిన సంగతి తెలిసిందే. అయితే అనస్తాసియా పావ్లిచెంకోవా రష్యా ప్రభుత్వం ఇటీవల చేసిన చర్యను తీవ్రంగా వ్యతిరేకించింది. రష్యా ఇటీవల ఉక్రెయిన్‌పై దాడి చేసింది. దీని వల్ల చాలా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ఉక్రెయిన్‌పై దాడి తర్వాత తాను భయపడుతున్నానని అనస్తాసియా పావ్లిచెంకోవా ట్వీట్ చేసింది. ఆమె ఇలా రాసింది.. ‘నేను చిన్నప్పటి నుంచి టెన్నిస్ ఆడుతున్నాను. నా జీవితమంతా రష్యాకు ప్రాతినిధ్యం వహించాను. ఇది నా ఇల్లు. నా దేశం. కానీ, ప్రస్తుతం నేను ఎంతో భయపడుతున్నాను. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా అదే స్థితిలో ఉన్నారు. కానీ, నా మనసులో మాట చెప్పడానికి నేను భయపడను. నేను యుద్ధం, హింసకు వ్యతిరేకిని’ అంటూ రాసుకొచ్చింది.
‘వ్యక్తిగత ఆశయాలు లేదా రాజకీయ ఉద్దేశాలు హింసను సమర్థించలేవు. ఇది మన భవిష్యత్తునే కాదు మన పిల్లల భవిష్యత్తును కూడా దూరం చేస్తుంది. నేను కలత చెందాను. ఈ పరిస్థితిలో ఎలా సహాయం చేయాలో తెలియడం లేదంటూ’ పేర్కొంది.
‘నేను టెన్నిస్ ఆడే ప్లేయర్‌ని. నేను రాజకీయ నాయకుడిని కాదు, పబ్లిక్ ఫిగర్‌ని కూడా కాదు. వీటన్నింటితో నాకు అనుభవం లేదు. నేను ఈ నిర్ణయాలకు వ్యతిరేకంగా బహిరంగంగా విభేదించగలను. బహిరంగంగా మాట్లాడగలను’ అంటూ రాసుకొచ్చింది.
— Anastasia Pavlyuchenkova (@NastiaPav) February 28, 2022
Also Read: Pak vs Aus: ఆసీస్ ప్లేయర్ భార్యకు బెదిరింపులు.. పాక్ పర్యటన నుంచి నీ భర్త తిరిగిరాడంటూ మెసేజ్‌లు..
Watch Video: ఈ క్యాచ్ ఓ ‘అద్భుతం’.. అలా ఎలా పట్టావయ్యా బాబు.. షాకవుతోన్న నెటిజన్లు.. వైరల్ వీడియో