CWG 2026 : కామన్వెల్త్ గేమ్స్‌లో మీరాబాయి సరికొత్త చరిత్ర.. ప్రధాని మోదీ ప్రశంసలు
Mirabai Chanu : కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించారు. వరుసగా నాలుగో కామన్వెల్త్ పతకాన్ని అందుకున్న ఆమెను ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. 48 కేజీల విభాగంలో కొత్త రికార్డులు నెలకొల్పారు.

Mirabai Chanu : భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను కామన్వెల్త్ గేమ్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించారు. వరుసగా నాలుగో కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. కామన్వెల్త్ గేమ్స్ 2026లో 48 కేజీల విభాగంలో పోటీపడిన ఆమె అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు. గత మూడు కామన్వెల్త్ గేమ్స్‌లోనూ వెయిట్‌లిఫ్టింగ్‌లో పసిడి పతకాలను గెలుచుకుంటూ వస్తున్న మీరాబాయి, ఈసారి కూడా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుని హ్యాట్రిక్ గోల్డ్ మెడల్‌తో రికార్డు సృష్టించారు. ఈ చారిత్రాత్మక విజయం సాధించిన మీరాబాయి చానును భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు
మీరాబాయి చాను సాధించిన ఈ ఘన విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆమె ప్రతి ఒక్క భారతీయుడికి స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని మోదీ.. “భారతీయ వెయిట్‌లిఫ్టింగ్ చరిత్రలో మరో కొత్త అధ్యాయం లిఖించబడింది. కామన్వెల్త్ గేమ్స్‌లో వరుసగా గోల్డ్ మెడల్ గెలవడమే కాకుండా, తన కెరీర్‌లో నాలుగో కామన్వెల్త్ మెడల్ సాధించి ప్రతీ భారతీయుడికి మీరాబాయి స్ఫూర్తిగా నిలిచారు. ఈ చారిత్రాత్మక విజయం సాధించిన ఆమెకు నా శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఆమె సాధించబోయే సవాళ్లకు కూడా ఆల్ ది బెస్ట్” అని ఆకాంక్షించారు.
Another glorious chapter in Indian Weightlifting!
The talented Mirabai Chanu once again showcased her skills at the Commonwealth Games with a stunning performance in the 48 kg category and winning Gold. With back-to-back Commonwealth Games Golds and an overall fourth CWG medal… pic.twitter.com/37IOvMXBTI
— Narendra Modi (@narendramodi) July 26, 2026
48 కేజీల విభాగంలో సరికొత్త రికార్డులు
మీరాబాయి చాను కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే వరుసగా నాలుగు పతకాలు సాధించిన అరుదైన మైలురాయిని చేరుకున్నారు. అంతకుముందు 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో ఆమె సిల్వర్ పతకం గెలుచుకున్నారు. ఆ తర్వాత 2018, 2022, ఇప్పుడు 2026 కామన్వెల్త్ క్రీడల్లో వరుసగా మూడోసారి గోల్డ్ పతకాలను ముద్దాడారు. ఆదివారం జరిగిన 48 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో స్నాచ్ రౌండ్‌లో 85 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌లో 105 కేజీల బరువును ఎత్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ఈ రెండు రౌండ్లలోనూ వేర్వేరుగా కామన్వెల్త్ గేమ్స్ రికార్డులను నెలకొల్పి మ్యాచ్‌ను ఏకపక్షం చేశారు.
భారత వెయిట్‌లిఫ్టింగ్ దిగ్గజంగా మీరాబాయి
భారతదేశం కన్న అత్యంత విజయవంతమైన వెయిట్‌లిఫ్టర్లలో మీరాబాయి చాను ఒకరుగా నిలిచారు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో వెండి పతకం సాధించిన ఆమె, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో తృణప్రాణంలో పతకం చేజార్చుకుని నాలుగో స్థానంలో నిలిచారు. అంతేకాకుండా 48 కేజీల విభాగంలో వెయిట్‌లిఫ్టింగ్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన ఘనత కూడా మీరాబాయికి ఉంది. నిలకడైన ప్రదర్శనతో భారత్‌కు మరిన్ని అంతర్జాతీయ పతకాలు తీసుకురావడమే లక్ష్యంగా ఆమె ముందుకు సాగుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
