కరోనా వైరస్ ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న ఈ విపత్కర పరిస్థితులలో విశ్వక్రీడలు అవసరమా? జనం వినోదించే పరిస్థితి ఇప్పుడు ఉందా? దినదినగండంతో బతుకున్న ప్రజలు ఆటల పోటీలను ఆస్వాదించగలరా? ఒలింపిక్స్ జరపకూడదంటూ వస్తున్న విన్నపాలను, డిమాండల్లను జపాన్ దేశ ప్రధాని యోషిహిదే సుగా మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. దేశ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా ఒలింపిక్స్‌ను సురక్షితంగా నిర్వహించాలనే పంతం మీద ఉన్నారు. జులై 23న ఆరంభమయ్యే ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం సాధ్యమేనంటున్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. మరోవైపు అంతర్జాతీయ ఒలింపిక్ కిమటీ కూడా ఇదే భావనతో ఉంది. ఒలింపిక్స్‌ను ఎవరికీ ఎలాంటి హానీ వాటిల్లకుండా సురక్షితంగా జరుపుతామని ఐఓసీ భరోసా ఇస్తుంది కానీ అది జరిగే పనేనా? క్రీడాకారులతో పాటు టోక్యో ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఒలింపిక్స్‌ను నిర్వహిస్తామని ఐఓసీ ఉపాధ్యక్షుడు జాన్ కోట్స్ అంటున్నారు..మొన్న మన దేశంలో నిర్వహించిన ఐపీఎల్ ఏమయ్యిందో తెలిసిందే కదా! అంత చిన్న టోర్నమెంట్‌లోనే అపశ్రుతులు వస్తే ఒలింపిక్స్ లాంటి విశ్వ క్రీడను సజావుగా ఎలా జరుపుతారు.. పైగా జులై మాసం ఎంతో దూరం లేదు. అప్పటికీ కరోనా తగ్గుముఖం పడుతుందన్న గ్యారంటీ ఏమీ లేదు. నిజమే టోక్యో ప్రజలలో 80 శాతం మంది కోవిడ్ వ్యాక్సిన్‌ను వేసుకునే ఉంటారు.. కానీ వ్యాక్సిన్ తీసుకున్న వారికి కరోనా సోకదన్న గ్యారంటీ లేదు కదా! రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా కరోనా అంటుకుంటున్నది కదా! ప్రాణాపాయం వుండదేమో కానీ, ఆరోగ్యం పాడవుతుంది కదా! క్రీడాకారులకు కరోనా సోకితే వారు కోలుకోడానికి ఎంత కాలం పడుతుంది? వారి కెరీర్ కష్టాల్లో పడకుండా ఉంటుందా?
నిజానికి టోక్యో నగరంలో ఒలింపిక్స్ సందడి ఈపాటికే మొదలవ్వాలి. కానీ ఆతిథ్య నగరంలో ఆ కళే లేదు. టార్చ్ ర్యాలీలు లేవు. స్టేడియంల ముస్తాబులు లేవు. క్రీడాకారులకు ట్రైనింగ్‌లు లేవు. ఓ రకమైన నిర్లిప్తత అక్కడ ఆవరించింది. అసలు టోక్యో నగరవాసులెవరికీ ఒలింపిక్స్‌ను నిర్వహించాలని లేదు. జపాన్‌లో కూడా ఒలింపిక్స్‌ను వాయిదా వేయడం మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 80 శాతం మంది ప్రజలు విముఖంగా ఉన్నారు. నాలుగేళ్లకోమారు జరిగే ఈ విశ్వక్రీడ నిజానికి పోయిన సంవత్సరమే జరగాలి. గత సంవత్సరం కరోనా సృష్టించిన విలయానికి జడిసి ఒలింపిక్స్‌ను వాయిదా వేశారు. ఆధునిక ఒలింపిక్స్ సంగతికొస్తే 1896లో గ్రీస్‌లోని ఏథెన్స్‌లో మొదటి ఒలింపిక్స్ జరిగాయి. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఈ ప్రపంచ క్రీడలు జరుగుతూనే వస్తున్నాయి. మొదటి ప్రపంచయుద్ధం కారణంగా 1916లో ఈ పోటీలు జరపలేకపోయారు. అలాగే రెండో ప్రపంచ యుద్ధం కూడా ఈ పోటీలపై ప్రభావం చూపింది. అందుకే 1940, 1944లో జరగాల్సిన ఒలింపిక్స్‌ను పూర్తిగా రద్దు చేశారు. ఈ మూడు సార్లు తప్ప ప్రతీసారి ఒలింపిక్స్ జరిగాయి.. అమెరికా, సోవియట్ రష్యాల మధ్య ఉన్న ప్రచ్ఛన్న యుద్ధం కారణంగా కొన్ని దేశాలు ఒలింపిక్స్‌ను బహిష్కరించి ఉండవచ్చు.. కొన్ని ఒలింపిక్స్ పోటీలు నెత్తుటి మరకలు చూసి ఉండవచ్చు. కానీ పోటీలు మాత్రం జరిగాయి.. విశ్వ వేదికల్లో క్రీడాకారులు తమ సత్తాను చాటుకున్నారు. తమలోని ప్రతిభను ప్రదర్శించడానికి క్రీడాకారులకు ఒలింపిక్స్ కు మించిన టోర్నమెంట్ లేదు. అందులో పతకం సాధిస్తే చాలని అనుకునే క్రీడాకారులు కోకొల్లలు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో క్రీడాకారులు కూడా ఆ పోటీలో పాల్గొనేందుకు జంకుతున్నారు. ఎప్పుడు ఎక్కడ్నుంచి వైరస్ అంటుకుంటుందో తెలియని పరిస్థితి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కంటికి కనిపించని ఆ వైరస్ సోకదన్న గ్యారంటీ ఏమీ లేదు.. నిరుడు ఈ పోటీలను వాయిదా వేసినప్పుడు వచ్చే ఏడాదికల్లా అంతా సద్దుమణిగిపోతుందనీ, కరోనా పూర్తిగా అంతరించిపోతుందని అనుకున్నారు. అందుకే ఈ ఏడాది జులై 23 నుంచి ఆగస్టు ఎనిమిదో తేదీ వరకు జరిగే పోటీలకు ఎలాంటి అవాంతరాలు ఉండవని భావించారు. కానీ కరోనా సెకండ్‌వేవ్ వారి ఆశలపై నీళ్లు చల్లింది. రెండో దశ చాలా వేగంగా విస్తరిస్తూ ఉండటంతో జపాన్‌లో పరిస్థితులు మారిపోయాయి. అక్కడ కూడా కరోనా కేసులు చాలా వస్తున్నాయి. ప్రజలు భయం నీడలో బతుకుతున్నారు. బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. గడచిన నెల రోజుల వ్యవధిలో టోక్యో నగరంతో పాటు మరో ఆరు ప్రాంతాలలో ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో తెలుస్తోంది.
ఇంత జరుగుతున్నా ఇంకా ఒలంపిక్స్‌ను నిర్వహించి తీరుతాం అంటూ మొండిపట్టు పట్డడం సరికాదు. ఒలింపిక్స్ మొదలవ్వడానికి చాలా రోజుల ముందే క్రీడాకారులతో పాటు స్పోర్ట్స్ విలేజ్‌లలో ఉండే అందరికీ టీకాలు ఇస్తామని, బయోబబుల్‌లో అంత్యత కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఒలింపిక్స్‌ను నిర్వహిస్తామని ప్రధాని చెబుతున్నారు కానీ అది జరిగేపని కాదని ఇంతకు ముందు జరిగిన క్రీడాపోటీలలో వెలుగు చూసిన వైఫల్యాలు రుజువు చేస్తున్నాయి. సాధారణంగా ఒలింపిక్స్‌లో 11 వేల మంది వరకు క్రీడాకారులు పాల్గొంటారు. సిబ్బంది ఓ అయిదువేల మంది వరకు ఉంటారు. ఇతరత్రా పనులను నిర్వహించేవారు ఓ 45 వేల మంది వరకు ఉంటారు. అంటే మొత్తంగా ఓ 60 వేల మంది ఒలింపిక్స్ కోసం పాటుపడాల్సి ఉంటుంది. ఇంత మందిని బయోబబుల్‌లో ఉంచడం ఎలా సాధ్యం? ఒలింపిక్స్ కోసం ఇప్పటి వరకు 18 లక్షల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసిన జపాన్ ప్రభుత్వం ఎంతసేపూ ఆ డబ్బు గురించే ఆలోచిస్తున్నది తప్ప ప్రజల ప్రాణాల గురించి ఆలోచించడం లేదనేది కొందరి విమర్శ. నిజమే.. ఇప్పుడు క్రీడలను రద్దు చేస్తే అంత డబ్బూ వృధా అయినట్టే కదా అన్నది ప్రభుత్వ భావన! క్రీడలు జరిగితే పెట్టిన ఖర్చులో ఎంతో కొంత సంపాదించుకోవచ్చని అనుకుంటుంది. ఇప్పటికే ప్రేక్షకులను అనుమతించేది లేదని ప్రభుత్వం చెప్పింది. అంటే ఆదాయం కేవలం ఒలింపిక్స్ ప్రసార హక్కుల నుంచి మాత్రమే వస్తుంది.. వచ్చే ఈ ఆదాయాన్ని కూడా ఎందుకు వదులుకోవాలనేది జపాన్ ప్రభుత్వం, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీల అభిప్రాయం. అయినా ప్రేక్షకులు లేకుండా జరిగే క్రీడా పోటీలలో ఈ కిక్కు ఉండదు.. ప్రేక్షకుల కేరింతలు, చప్పట్లు, అరుపులు ఇవి ఉంటేనే స్టేడియంలకు ఓ కళ. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? అన్న నినాదం ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు కాకపోతే వచ్చే ఏడాది… అప్పుడు కూడా సాధ్యం కాకపోతే మరుసటి ఏడాది… కట్టిన స్టేడియంలకు వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. కాకపోతే అప్పటి వరకు మెయింటైన్స్ చేయాల్సి ఉంటుందంతే! ప్రజల ప్రాణాలతో పోలిస్తే ఆ సొమ్మేం విలువైనది కాదు.. చూద్దాం జపాన్ ప్రభుత్వం, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీలు ఏ నిర్ణయం తీసుకుంటాయో!
మరిన్ని ఇక్కడ చూడండి: మంగళవారం నుంచి రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం మొదలు పెట్టండి.. అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
Andhrapardesh: ఆంధ్రప్రదేశ్ రైతులకు గుడ్ న్యూస్.. మంగళవారం వారి ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ