IND vs NZ : ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్.. సిరీస్ కివీస్ సొంతం
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో కింగ్ కోహ్లీ మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. కివీస్ నిర్దేశించిన 338 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత టాప్ ఆర్డర్ కుప్పకూలిన వేళ, ఒంటరి పోరాటం చేస్తూ కేవలం 91 బంతుల్లోనే అద్భుత సెంచరీ పూర్తి చేశాడు. అయితే.. ఈ మ్యాచ్ లో ఇండియా ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది.

IND vs NZ : ఇండోర్ వేదికగా జరిగిన భారత్-న్యూజిలాండ్ మూడో వన్డేలో టీమ్ ఇండియాకు నిరాశ ఎదురైంది. నిర్ణయాత్మకమైన ఈ పోరులో కింగ్ కోహ్లీ వీరోచిత సెంచరీ వృథా అయ్యింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. కివీస్ నిర్దేశించిన 338 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 300 పరుగుల మైలురాయిని దాటినా, కీలక సమయంలో వికెట్లు కోల్పోయి పరాజయాన్ని మూటగట్టుకుంది.
టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా, కివీస్ బ్యాటర్లు చుక్కలు చూపించారు. డారిల్ మిచెల్ (137), గ్లెన్ ఫిలిప్స్ (106) సెంచరీలతో చెలరేగి 337 పరుగుల కొండంత స్కోరును టీమిండియా ముందు ఉంచారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ తలో మూడు వికెట్లు తీసి కివీస్‌ను కట్టడి చేసే ప్రయత్నం చేసినా, మిడిల్ ఓవర్లలో పరుగుల వరదను ఆపలేకపోయారు.
భారీ లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభం దారుణంగా ఉంది. రోహిత్ శర్మ (11), శుభ్‌మన్ గిల్ (23) పవర్‌ప్లేలోనే వెనుదిరగగా, శ్రేయస్ అయ్యర్ (3), కేఎల్ రాహుల్ (1) పూర్తిగా విఫలమయ్యారు. 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో విరాట్ కోహ్లీ ఛేజ్ మాస్టర్ అవతారమెత్తాడు. యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి (53)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరి భాగస్వామ్యం మ్యాచ్‌ను రేసులోకి తెచ్చింది.
నితీష్ అవుట్ అయ్యాక వచ్చిన హర్షిత్ రాణా బ్యాట్‌తోనూ అద్భుతాలు చేశాడు. కేవలం 41 బంతుల్లోనే 52 పరుగులు చేసి కివీస్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. మరోవైపు కోహ్లీ తన 54వ వన్డే సెంచరీని పూర్తి చేసుకుని 124 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. కోహ్లీ క్రీజులో ఉన్నంతసేపు భారత్ గెలుస్తుందని అంతా భావించారు. కానీ, కీలక సమయంలో కోహ్లీ, ఆ వెంటనే సిరాజ్ అవుట్ అవ్వడంతో భారత్ ఆశలు గల్లంతయ్యాయి. చివరి వికెట్‌కు 41 పరుగులు కావాల్సిన దశలో టీమిండియా పోరాటం ముగిసింది.
