అస్సాం రాజధాని గువహటి వేదికగా భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ కు సడన్ గా అనుకోని అతిథి రావడంతో కాసేపే మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. ఇంతకీ ఆ అతిథిని చూసి ఒక్కసారిగా గ్రౌండ్ లో ఉన్న ఆటగాళ్లతో పాటు.. అభిమానులు సైతం షాక్ కు గురయ్యారు. ఇంతకీ ఆ అతిథి ఎవరనుకుంటున్నారా.. సర్పం.. అదేనండీ పాము సడన్ గా గ్రౌండ్ లో ప్రత్యక్షం కావడంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ లో భాగంగా రెండో మ్యాచ్ గువహటిలో జరుగుతుండగా.. మైదానంలోకి ఊహించని రీతిలో ఒక పాము ప్రవేశించింది. అస్సాంలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో పాము రావడంతో స్టేడియం సిబ్బంది వెంటనే అప్రమత్తమై పాములను పట్టుకునే పరికరాలు, బకెట్‌తో మైదానంలోకి వచ్చి పామును తీసుకెళ్లిపోయారు. పాము గ్రౌండ్ లోకి వచ్చినప్పుడు భారత్ బ్యాటింగ్ చేస్తుండగా, ఓపెనర్లు కెఎల్.రాహుల్, రోహిత్ శర్మ క్రీజ్ లో ఉన్నారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఫీల్డింగ్ చేస్తుండటంతో 11 మంది ఆటగాళ్లు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
స్టేడియం సిబ్బంది పామును పట్టుకున్నప్పుడు కెఎల్.రాహుల్ తో పాటు వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్ ఈ విషయం గురించే చర్చించుకుంటూ నవ్వుతూ కనిపించారు. పవర్ ప్లే పూర్తయిన తర్వాత.. ఏడో ఓవర్ పూర్తై ఎనిమిదో ఓవర్ ప్రారంభంలో ఈసంఘటన జరిగింది. కేశవ్ మహారాజ్ బౌలింగ్ చేయడానికి ప్రయత్నించగా.. అంఫైర్ పాముని గమనించి బౌలర్ ని ఆపమని చెప్పాడు. వెంటనే స్టేడియం సిబ్బంది వచ్చి పామును తీసుకెళ్లడంతో కొద్దిసేపు అంతరాయం తర్వాత మ్యాచ్ ప్రారంభమైంది.
#INDvsSA pic.twitter.com/E0kvbafucc
— Sanju Here ?? (@me_sanjureddy) October 2, 2022
టాస్ గెలిచిన సౌతాఫ్రికా భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 22 బంతుల్లో 61 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 49 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఓపెనర్లు కెఎల్.రాహుల్ 28 బంతుల్లో 57, రోహిత్ శర్మ 37 బంతుల్లో 43 పరుగులు చేసి శుభారంభాన్ని అందించారు. చివర్లో దినేష్ కుమార్ మెరుపులు మెరిపించి 7 బంతుల్లో 17 పరుగులు చేశాడు. దీంతో భారత్ దక్షిణాఫ్రికాకు 238 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..