AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gautam Gambhir : రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కోచ్ గౌతమ్ గంభీర్.. కానీ వెంటాడుతున్న ఆ పెద్ద ‘కలంకం’

Gautam Gambhir : భారత హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన హయాంలో టీమ్ ఇండియా 2 ఐసీసీ ట్రోఫీలు గెలిచి రికార్డు సృష్టించినప్పటికీ, మరోవైపు కెప్టెన్ల పదవులు ఊడటం, టెస్టుల్లో ఘోర పరాజయాలు వంటి కొన్ని మచ్చలు కూడా ఆయన కోచింగ్ కెరీర్‌ను వెంటాడుతున్నాయి.

Gautam Gambhir : రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కోచ్ గౌతమ్ గంభీర్.. కానీ వెంటాడుతున్న ఆ పెద్ద 'కలంకం'
Gautam Gambhir
Rakesh
|

Updated on: Jul 09, 2026 | 5:18 PM

Share

Gautam Gambhir : భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించి నేటికి (జూలై 9) సరిగ్గా రెండేళ్లు పూర్తయ్యాయి. ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు మెంటార్‌గా ఉండి టైటిల్ గెలిపించిన వెంటనే గంభీర్ నేరుగా భారత జట్టుకు హెడ్ కోచ్‌గా ఎంపికయ్యారు. టీమిండియా చరిత్రలో కోచ్‌గా ఉంటూ రెండు ఐసీసీ ట్రోఫీలను అందించిన ఏకైక వ్యక్తిగా గంభీర్ రికార్డు సృష్టించారు. ఆయన కోచింగ్ బాధ్యతలు చేపట్టాక వచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను భారత్ గెలుచుకుంది. ఆ తర్వాత ఇదే ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026లోనూ భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు ఆయన తదుపరి టార్గెట్ 2027 వన్డే వరల్డ్ కప్. అయితే, గంభీర్ హయాంలో భారత్ ఇన్ని ట్రోఫీలు గెలిచినప్పటికీ, ఆయన కోచింగ్ శైలి వెనుక కెప్టెన్ల పదవులు ఊడటం, టెస్టుల్లో ఘోర పరాజయాలు లాంటి పెద్ద మచ్చలు కూడా ఉన్నాయి.

గంభీర్ కోచింగ్‌లో కెప్టెన్లకు శాపంగా మారిన ట్రోఫీలు

గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో భారత జట్టుకు ట్రోఫీలు అందించిన కెప్టెన్ల పదవులు ఊడిపోవడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలుచుకుంది. సాధారణంగా వరుసగా ఐసీసీ ట్రోఫీలు గెలిపించే కెప్టెన్‌ను సుదీర్ఘ కాలం కొనసాగిస్తారు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన వెంటనే రోహిత్ శర్మ నుంచి వన్డే, టెస్ట్ కెప్టెన్సీని లాగేసుకున్నారు. ఆయన టెస్టుల నుంచి రిటైర్ కావాల్సి వచ్చింది. ప్రస్తుతం రోహిత్ కేవలం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు. ఇక సూర్యకుమార్ యాదవ్ కథ కూడా ఇలాగే ముగిసింది. సూర్య కెప్టెన్సీలో భారత్ ఏ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా 2025 ఆసియా కప్, 2026 టీ20 వరల్డ్ కప్ గెలిచింది. కానీ వరల్డ్ కప్ గెలిచిన వెంటనే సూర్య ఫామ్ బాగోలేదనే సాకుతో అతని కెప్టెన్సీని పీకేశారు. ప్రస్తుతం వన్డేల్లో గిల్‌ను, టీ20ల్లో శ్రేయస్ అయ్యర్‌ను కొత్త కెప్టెన్లుగా నియమించారు.

27 ఏళ్ల తర్వాత లంక చేతిలో సిరీస్ ఓటమి

గత రెండేళ్లలో గంభీర్ పర్యవేక్షణలో భారత్ 23 వన్డే మ్యాచ్‌లు ఆడి 16 మ్యాచ్‌ల్లో గెలిచి, 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. గంభీర్ వన్డే కోచింగ్ కెరీర్ ఆరంభంలో ఒక పెద్ద అవమానం ఎదురైంది. దాదాపు 27 సంవత్సరాల తర్వాత శ్రీలంక చేతిలో భారత్ ఒక ద్విపాక్షిక వన్డే సిరీస్‌ను ఓడిపోయింది. దీనివల్ల 2024లో భారత్ కనీసం ఒక్క వన్డే మ్యాచ్ కూడా గెలవలేకపోయింది, ఇది 45 ఏళ్ల తర్వాత జరగడం గమనార్హం. అయితే ఆ తర్వాత పుంజుకున్న టీమిండియా, 2025 ఛాంపియన్స్ ట్రోఫీతో సహా వరుసగా 8 వన్డే మ్యాచ్‌లు గెలిచి అదరగొట్టింది. ఇంగ్లాండ్‌ను 3-0 తో, సౌతాఫ్రికాను 2-1తో, న్యూజిలాండ్‌ను 2-1తో, అఫ్గానిస్తాన్‌ను 3-0తో భారత్ ఓడించింది. కానీ ఆస్ట్రేలియా చేతిలో 1-2 తో సిరీస్ ఓడిపోయింది.

టెస్ట్ క్రికెట్‌లో దారుణమైన ట్రాక్ రికార్డ్

గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా ఉన్న కాలంలో అత్యంత ఘోరమైన ప్రదర్శన టెస్ట్ ఫార్మాట్‌లోనే నమోదైంది. గత రెండేళ్లలో భారత్ 18 టెస్టులు ఆడి కేవలం 6 మ్యాచ్‌ల్లో గెలిచి, 10 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 2 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. భారత్ తన సొంత గడ్డపై న్యూజిలాండ్ (0-3), సౌతాఫ్రికా (0-2) చేతిలో ఘోరంగా వైట్‌వాష్ అయింది. దాదాపు 36 ఏళ్ల తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో భారత్ టెస్ట్ సిరీస్ ఓడిపోయింది. అంతేకాకుండా, 19 ఏళ్ల తర్వాత బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్ ఒక టెస్ట్ మ్యాచ్‌ను కోల్పోయింది. 10 ఏళ్ల తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కూడా ఆస్ట్రేలియా (1-3) చేతిలో భారత్ చేజార్చుకుంది. 25 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా చేతిలో హోమ్ టెస్ట్ సిరీస్ ఓడిపోవడం గంభీర్ టెస్ట్ కోచింగ్ సామర్థ్యంపై పెద్ద ప్రశ్న మార్క్ వేసింది.

ఐర్లాండ్ చేతిలో చారిత్రాత్మక ఓటమి

టీ20 ఫార్మాట్‌లో గంభీర్ రికార్డు చాలా అద్భుతంగా ఉంది. భారత్ ఆయన కోచింగ్‌లో 48 మ్యాచ్‌లు ఆడి 37 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కేవలం 8 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది. ఇందులో ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. గంభీర్ నేతృత్వంలో భారత్ 2025 ఆసియా కప్‌ను (7 మ్యాచ్‌లు గెలిచి), 2026 టీ20 వరల్డ్ కప్‌ను (8 మ్యాచ్‌లు గెలిచి) ముద్దాడింది. శ్రీలంకను 3-0 తో, బంగ్లాదేశ్‌ను 3-0 తో, ఇంగ్లాండ్‌ను 4-1 తో, న్యూజిలాండ్‌ను 4-1 తో భారత్ చిత్తు చేసింది. అయితే, ఇంతటి ఘనమైన రికార్డు ఉన్నప్పటికీ, ఇటీవల ఐర్లాండ్ పర్యటనలో భారత్ 0-2 తో సిరీస్ ఓడిపోవడం గంభీర్ టీ20 కెరీర్‌లో ఒక మచ్చగా మిగిలిపోయింది. ఎందుకంటే చరిత్రలో ఐర్లాండ్ చేతిలో భారత్ ఎప్పుడూ మ్యాచ్ ఓడిపోలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us