AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG 4th T20 : సంజూ శాంసన్‌ను మళ్లీ జట్టులోకి తీసుకోవడానికి గల ఆ 3 బలమైన కారణాలు ఇవే

IND vs ENG 4th T20 : బ్రిస్టల్‌లో జరిగే నాలుగో టీ20లో సంజూ శాంసన్‌కు మళ్లీ అవకాశం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. లెఫ్ట్-రైట్ బ్యాటింగ్ కాంబినేషన్, ఒత్తిడిలో రాణించే సామర్థ్యం, ఇంగ్లండ్ పేస్ పిచ్‌లపై అనుభవం కారణంగా అతని ఎంపికపై చర్చలు జోరందుకున్నాయి.

IND vs ENG 4th T20 : సంజూ శాంసన్‌ను మళ్లీ జట్టులోకి తీసుకోవడానికి గల ఆ 3 బలమైన కారణాలు ఇవే
Sanju Samson
Rakesh
|

Updated on: Jul 09, 2026 | 4:06 PM

Share

IND vs ENG 4th T20 : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో నాలుగో పోరు జూలై 9వ తేదీ గురువారం బ్రిస్టల్ వేదికగా జరగనుంది. ఇప్పటికే సిరీస్‌లో 0-2తో వెనుకబడిన టీమిండియాకు సిరీస్ గెలిచే అవకాశం లేకపోయినప్పటికీ, మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిచి సిరీస్‌ను కనీసం డ్రా చేసుకునే సువర్ణ అవకాశం ఉంది. అందుకోసం బ్రిస్టల్‌లో జరిగే మ్యాచ్‌లో భారత్ ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఇంగ్లాండ్‌ను అడ్డుకోవాలంటే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో కీలక మార్పులు చేయక తప్పదు. ఈ నేపథ్యంలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మళ్లీ జట్టులోకి వస్తాడా, వస్తే ఎవరి స్థానంలో వస్తాడనే చర్చలు జోరందుకున్నాయి.

భారత బ్యాటింగ్ లైనప్‌లో లెఫ్ట్ హ్యాండర్స్ రద్దీ

సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవడానికి మొదటి ముఖ్యమైన కారణం.. ప్రస్తుత భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఎక్కువగా ఉండటం. ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీలతో పాటు నంబర్-3లో ఆడే ఈషాన్ కిషన్ కూడా లెఫ్ట్ హ్యాండరే. వీరితో పాటు అక్షర్ పటేల్, తిలక్ వర్మ, శివమ్ దూబే కూడా ఎడమచేతి వాటంతోనే బ్యాటింగ్ చేస్తారు. మిడిల్ ఆర్డర్‌లో రైట్ హ్యాండ్ ఉన్న ఏకైక బ్యాటర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రమే. గత మ్యాచ్‌లో ఈ కారణం చేతనే శివమ్ దూబే కంటే ముందు హర్షిత్ రాణాను బ్యాటింగ్‌కు పంపించారు. క్రీజులో లెఫ్ట్-రైట్ కాంబినేషన్ ఉంటే బౌలర్లకు ప్లాన్స్ మార్చడం కష్టమవుతుంది కాబట్టి, రైట్ హ్యాండర్ అయిన సంజూ శాంసన్ రాక జట్టుకు ఎంతో అవసరం.

ఒత్తిడిని జయించడంలో సంజూ మొనగాడు

సంజూ శాంసన్ జట్టులోకి రావడానికి రెండో కారణం.. అత్యంత ఒత్తిడితో కూడిన పరిస్థితులను అతను ఎదుర్కొనే విధానం. అంతర్జాతీయ క్రికెట్ అయినా, ఐపీఎల్ అయినా ఒత్తిడిలో రాణించగలనని సంజూ గతంలో చాలాసార్లు నిరూపించాడు. గత టీ20 వరల్డ్ కప్‌లో ఆరంభంలో ఫామ్ కోల్పోయినప్పటికీ, జట్టు ఇరుకున పడిన తరుణంలో తనకు వచ్చిన అవకాశాన్ని సంజూ అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన వర్చువల్ క్వార్టర్ ఫైనల్‌తో పాటు, సెమీఫైనల్ మరియు ఫైనల్ మ్యాచ్‌లలో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి భారత్‌ను ప్రపంచ విజేతగా నిలబెట్టాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ చేతిలో ఓటమి అంచున ఉన్న టీమిండియాకు సంజూ లాంటి ప్రెజర్ హ్యాండ్లర్ చాలా అవసరం.

ఇంగ్లాండ్ పిచ్‌లపై పేస్ అండ్ బౌన్స్‌ను తట్టుకునే సత్తా

సరిగ్గా సౌతాఫ్రికా పర్యటనలో రెండు అద్భుతమైన సెంచరీలు బాది, తనకు పేస్, బౌన్స్ పిచ్‌లపై తిరుగులేని రికార్డు ఉందని సంజూ శాంసన్ నిరూపించాడు. ఇంగ్లాండ్ గడ్డపై కేవలం ఒకే ఒక్క ఇన్నింగ్స్ ఆడిన తర్వాత టీమ్ మేనేజ్‌మెంట్ అతనిపై వేటు వేసింది. ఇంగ్లీష్ పిచ్‌లపై పరిస్థితులను అర్థం చేసుకోవడానికి సంజూకు మరికొంత సమయం ఇచ్చి ఉంటే, అతను ఖచ్చితంగా ఇక్కడ కూడా భారీ స్కోర్లు సాధించి ఉండేవాడని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే బ్రిస్టల్ పిచ్‌పై ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సంజూ శాంసన్ అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

సంజూ వస్తే వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మలలో ఎవరి స్థానానికి ఎసరు?

ఇక ఇప్పుడు ఉన్న అసలైన ప్రశ్న.. సంజూ శాంసన్ జట్టులోకి వస్తే ఎవరి స్థానాన్ని భర్తీ చేస్తాడు? యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అరంగేట్రం చేసి కేవలం రెండు మ్యాచ్‌లే అయ్యాయి కాబట్టి, అంత త్వరగా అతనిని పక్కన పెట్టడం న్యాయం కాదు. మరోవైపు, ఈషాన్ కిషన్ ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్-1 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు, కాబట్టి అతనిని డ్రాప్ చేసే ప్రసక్తే లేదు. ఈ సమీకరణాల ప్రకారం చూస్తే.. వైస్ కెప్టెన్ తిలక్ వర్మ మాత్రమే ఏకైక ఆప్షన్‌గా మిగిలాడు. ఈ యూకే పర్యటనలో తిలక్ వర్మ ప్రదర్శన అంత ఆశాజనకంగా లేదు. అతను పరుగులు చేసినప్పటికీ స్ట్రైక్ రేట్ చాలా తక్కువగా ఉంది, ముఖ్యంగా స్పిన్ బౌలింగ్ ఆడటానికి అతను బాగా ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి సంజూ శాంసన్ కోసం తిలక్ వర్మపైనే వేటు పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us