ఫుట్ బాల్ అభిమానుల కోసం సాకర్ పండుగ వచ్చేసింది. ఖతర్ వేదికగా ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ 2022కి మరికొన్ని గంటల్లో తెర లేవనుంది. ఖతర్ వేదికగా నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు ఫుట్ బాల్ ప్రపంచకప్ జరగనుంది. నాలుగు వారాల పాటు ఫుట్ బాల్ ప్రియులను అలరించనుంది ఈ మెగా టోర్ని. క్రికెట్ ప్రపంచకప్ లో కేవలం 16 జట్లు మాత్రమే పాల్గొంటే.. ఫుట్ బాల్ విశ్వ సంగ్రామంలో అందుకు రెట్టింపుగా.. 32 జట్లు తలపడనున్నాయి. ఫుట్ బాల్ చరిత్రలోనే తొలిసారిగా ఖతర్ ప్రపంచకప్ కు ఆతిథ్యమివ్వనుంది. నవంబర్ 20న జరిగే తొలి మ్యాచ్ లో ఈక్వెడార్ తో ఆతిథ్య ఖతర్ జట్టు తలపడనుంది. ఫుట్ బాల్ ప్రపంచకప్ లో ఆడటం ఖతర్ కు ఇదే తొలిసారి. ఆతిథ్య దేశం హోదాలో ఖతర్ ప్రపంచకప్ కు అర్హత సాధించింది. ఈ ప్రపంచకప్ కోసం మొత్తంగా 7 అత్యాధునిక స్టేడియాలను ఖతర్ నిర్మించింది. గతేడాది యూరో కప్ చాంపియన్ గా నిలిచిన ఇటలీ ఈ ప్రపంచకప్ కు అర్హత సాధించలేకపోవడం గమనార్హం.
మొత్తం 32 జట్లను గ్రూపుకు నాలుగు జట్ల చొప్పున 8 గ్రూపులుగా విభజించారు. ఇప్పటికి 29 జట్లు అర్హత పొందగా, మిగతా మూడు జట్లు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల ద్వారా ఖరారవుతాయి. మొదట లీగ్ దశ జరుగుతుంది. అంటే ప్రతి గ్రూపులో ఉన్న ప్రతి జట్టు కూడా గ్రూపులోని మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఈ లీగ్ దశ ముగిసిన తర్వాత ప్రతి గ్రూప్ లోనూ టాప్ 2లో నిలిచిన రెండు జట్లు ప్రిక్వార్టర్స్ కు అర్హత సాధిస్తాయి. అంటే 16 జట్లు నాకౌట్ దశకు చేరతాయి. ఇక ఇక్కడి నుంచి ప్రతి జట్టుకు కూడా రెండో అవకాశం ఉండదు. గెలిచిన జట్టు ముందుకు ఓడిన జట్టు ఇంటికి అన్న తీరున టోర్నీ సాగుతుంది. ప్రిక్వార్టర్స్ లో 16 జట్ల మధ్య 8 మ్యాచ్ లు జరుగుతాయి. ఈ మ్యాచ్ ల్లో గెలిచిన 8 జట్లు క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధిస్తాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో నాలుగు మ్యాచ్ లు ఉంటాయి. ఇందులో గెలిచిన నాలుగు జట్లు సెమీస్ కు.. సెమీస్ లో గెలిచిన జట్లు ఫైనల్స్ కు వెళ్తాయి. ఫైనల్స్ లో ఓడిన రెండు జట్ల మధ్య మూడో స్థానం కోసం మ్యాచ్ జరుగుతుంది. ఫైనల్ డిసెంబర్ 18న జరగనుంది.
గ్రూప్-ఎ: ఖతర్, ఈక్వెడార్, నెదర్లాండ్స్, సెనెగల్
గ్రూప్-బి: ఇంగ్లండ్, ఇరాన్, అమెరికా, స్కాట్లాండ్/వేల్స్/ఉక్రెయిన్
గ్రూప్-సి: అర్జెంటీనా, సౌదీ అరేబియా, మెక్సికో, పోలాండ్
గ్రూప్-డి: ఫ్రాన్స్, డెన్మార్క్, ట్యునిషియా, యూఏఈ/ఆస్ట్రేలియా/పెరూ
గ్రూప్-ఇ: స్పెయిన్, జర్మనీ, జపాన్, కోస్టారికా/న్యూజిలాండ్
గ్రూప్-ఎఫ్: బెల్జియం, కెనడా, మొరాకో, క్రొయేషియా
గ్రూప్-జి: బ్రెజిల్, సెర్బియా, స్విట్జర్లాండ్, కామెరూన్
గ్రూప్-హెచ్: పోర్చుగల్, ఘనా, ఉరుగ్వే, కొరియా
నవంబర్ 20వ తేదీన జరిగే ఆరంభ పోరు భారత కాలమానం ప్రకారం రాత్రి 9గంటల30 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. ఆ తర్వాతి రోజు నుంచి రోజుకు మూడు నుంచి నాలుగు మ్యాచ్ ల చొప్పున జరుగుతాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల 30నిమిషాలకు ఒక మ్యాచ్, సాయంత్రం 6గంటల30నిమిషాలకు రెండో మ్యాచ్, రాత్రి 9గంటల 30నిమిషాలకు మూడో మ్యాచ్, అర్ధ రాత్రి 12గంటల30 నిమిషాలకు నాలుగో మ్యాచ్ జరుగుతాయి. ఈ మ్యాచ్ లను భారత్ లో స్పోర్ట్స్ 18 చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అదే సమయంలో వూట్ యాప్ డిజిటల్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
ఈ మెగా టోర్నీ ఆరంభ వేడుకలు ఖతార్‌లోని అల్‌ఖోర్‌లోని అల్ బయత్ స్టేడియంలో ఆదివారం జరుగుతాయి. వేడుకలు ముగిసిన వెంటనే ఆతిథ్య జట్టు తొలి మ్యాచులో ఈక్వెడార్‌తో తలపడుతుంది. ఖతార్ కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ఫిఫా వరల్డ్‌కప్ 2022 ఆరంభ వేడుకలు మొదలవుతాయి. భారత్‌లో రాత్రి 7గంటల30 నిమిషాలకు ఆరంభమవుతుంది. ఇండియాలోనూ లైవ్ స్ట్రీమింగ్, లైవ్ టెలికాస్ట్ ఉంటుంది.
భారత్.. ఫిఫా వరల్డ్ కప్ 2022 ఆరంభ వేడుకల లైవ్ స్ట్రీమింగ్ ఎందులో అంటే ఫిఫా వరల్డ్ కప్ 2022 ప్రసార హక్కులను స్పోర్ట్స్ 18 దక్కించుకుంది. రిలయన్స్ వీరి యజమాని. మ్యాచులు, ఆరంభ వేడుకలన్నీ స్పోర్ట్స్ 18, స్పోర్ట్స్ 18 హెచ్‌డీటీవీలో ప్రసారం అవుతాయి. జియో సినిమా యాప్, వెబ్‌సైట్, జియో టీవీలో లైవ్‌స్ట్రీమింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి.
ఫిఫా వరల్డ్ కప్ కోసం ఖతార్ దేశం పెట్టిన ఖర్చు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.ఏకంగా 200 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో ఏకంగా రూ.16లక్షల 60 వేల కోట్లు దీనికి ఖర్చు చేసింది. 1954 ఫిఫా ప్రపంచ కప్‌కు ఆతిథ్యమిచ్చిన స్విట్జర్లాండ్ తర్వాతి చిన్న దేశంగా నిలవనుంది ఖతార్. ఈ దేశంలో 2.8 మిలియన్ల మంది నివాసితులు మాత్రమే ఉంటారు. ఖతార్ యార్క్‌షైర్ ప్రాంతం అంత పరిమాణంలో ఉంది. దేశం యొక్క పరిమాణం పక్కన పెడితే తలసరి ఆదాయంలో ఇది ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనదిగా కీర్తి గడించింది. సాధారణంగా ఫిఫా ప్రపంచ కప్ ఎప్పుడూ మే, జూన్ మరియు జూలైలలో వేసవి సీజన్‌లో నిర్వహిస్తారు.ఈసారి ఫిఫా వరల్డ్ కప్ కోసం నిర్వహించిన వేలంలో పోటీ తీవ్రంగా కొనసాగింది. అనేక రౌండ్లలో జపాన్, అమెరికా, దక్షిణ కొరియా వంటి దేశాలను ఓడించి ఖతార్ నిర్వహణ హక్కులను గెలుచుకుంది. రికార్డు స్థాయిలో ఖర్చు పెట్టి.. ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఫిఫా వరల్డ్ కప్ నిర్వహణ కోసం ఇప్పటివరకు ఈ దేశం దాదాపు 200 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.ప్రపంచ కప్ ఫైనల్స్‌ను నిర్వహించడానికి వారు కొత్త నగరమైన లుసైల్‌ను నిర్మించారు. నిర్మాణం, మౌలిక సదుపాయాలు, ఆసుపత్రులు, హోటళ్లు, విమానాశ్రయాలు, అనేక కొత్త స్టేడియంల కోసం.. ఈ దేశం ప్రతి వారం 500 మిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. వేసవిలో దేశం యొక్క వేడి, తేమతో కూడిన పరిస్థితుల కారణంగా ఈ ప్రపంచ కప్ 20 నవంబర్ 2022 న మొదలై క్రిస్మస్‌కు ఒక వారం ముందు అంటే 2022 డిసెంబర్ 18న ముగుస్తుంది. ఆ సమయంలో సగటు ఉష్ణోగ్రత 24°C ఉంటుంది. నవంబర్ చివరి నుంచి డిసెంబర్ మధ్యలో ప్రపంచకప్ జరగడం ఇదే తొలిసారి.
ఫుట్‌బాల్ ప్రపంచ కప్ మొదటిసారి 1930లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 21 ప్రపంచకప్‌లు జరిగాయి. ఇప్పటి వరకూ 8 జట్లు టైటిల్‌ను గెలుచుకున్నాయి. బ్రెజిల్ జట్టు అత్యధికంగా ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత ఇటలీ, జర్మనీ తలో 4 సార్లు ఈ టైటిల్‌ను గెలుచుకున్నాయి. ఆతిథ్య దేశాలు మాత్రమే 6 సార్లు ట్రోఫీని గెలుచుకున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..