Telugu News Sports News CWG 2022 indian Weight Lifter Vikas Thakur celebrations after winning medal goes viral Telugu Sports News
CWG 2022: కామన్వెల్త్‌లో ముచ్చటగా మూడో మెడల్.. బాలయ్య స్టైల్‌లో తొడగొట్టిన భారత వెయిట్‌లిఫ్టర్
Commonwealth Games 2022: పురుషుల 96 కేజీల విభాగంలో 28 ఏళ్ల వికాస్ ఠాకూర్ (Vikas Thakur) రజతం సొంతం చేసుకున్నాడు. స్నాచ్ రౌండ్‌లో 155 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌లో 191 కిలోల బరువు ఎత్తిన వికాస్.. మొత్తంగా 346 కేజీలు ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు.
Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ 2022 లో భారత వెయిట్ లిఫ్టర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. తమకు బాగా అచ్చొచ్చిన ఈవెంట్‌లో పతకాల పంట పండిస్తున్నారు. మొదటి 4 రోజుల్లో ఏకంగా 8 పతకాలు గెల్చుకున్న భారత వెయిట్‌లిఫ్టర్లు ఐదో రోజు కూడా సత్తాచాటారు. పురుషుల 96 కేజీల విభాగంలో 28 ఏళ్ల వికాస్ ఠాకూర్ (Vikas Thakur) రజతం సొంతం చేసుకున్నాడు. స్నాచ్ రౌండ్‌లో 155 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌లో 191 కిలోల బరువు ఎత్తిన వికాస్.. మొత్తంగా 346 కేజీలు ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. కాగా కామన్‌వెల్త్‌లో వికాస్‌కు ఇది వరుసగా మూడో పతకం కావడం విశేషం. 2014 గ్లాస్గో క్రీడల్లో రజతం గెలిచిన ఈ పంజాబీ వెయిట్‌లిఫ్టర్.. 2018 గోల్డ్ కోస్ట్ గేమ్స్‌లో కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు.
లూధియానాకు చెందిన వికాస్ కొన్ని రోజుల క్రితం దారుణ హత్యకు గురైన పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాలాకుపెద్ద అభిమాని. సిద్ధూ మూసేవాల మరణవార్తను తెలుసుకుని అతను చాలా మనస్తాపానికి గురయ్యాడు. రెండు రోజుల వరకు అన్న పానీయాలు ముట్టలేదు. అందుకే కామన్వెల్త్ లో మెడల్ గెలిచిన వెంటనే బర్మింగ్‌హామ్ వేదికగా సిద్ధూకు ఘన నివాళి అర్పించాడీ స్టార్ వెయిట్‌లిఫ్టర్. ఈ సందర్భంగా గాల్లోకి పంచ్‌లు విసురుతూ బాలయ్య స్టైల్‌లో తొడగొట్టి సంబరాలు చేసుకున్నాడు. ‘సిద్ధూ హత్య తర్వాత రెండు రోజుల పాటు నేను అన్నం ముట్టలేదు. నేను అతనిని ఎప్పుడూ కలవలేదు కానీ అతని పాటలు ఎప్పుడూ నాతో ఉంటాయి. నేను ఆయనకు ఎప్పుడూ పెద్ద అభిమానిని’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు వికాస్. కాగా ఠాకూర్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.