
2027 World Cup: భారత స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేసేందుకు తన ఆశలను స్పష్టం చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్ రేసులో తాను ఉన్నానని, సెలెక్టర్లు పిలిస్తే దేశం తరఫున ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. చాహల్ నోటి నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
భారత జట్టు ప్రధాన లెగ్ స్పిన్నర్‌గా ఒకప్పుడు ప్రత్యర్థి బ్యాటర్లను వణికించిన యుజ్వేంద్ర చాహల్ మళ్లీ నీలిరంగు జెర్సీ ధరించేందుకు ఆరాటపడుతున్నాడు. రాబోయే 2027 వన్డే ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు తరఫున మైదానంలోకి దిగడమే తన ముందనున్న ప్రధాన లక్ష్యమని ఆయన తేల్చిచెప్పాడు. గత కొంతకాలంగా అంతర్జాతీయ మ్యాచులకు దూరంగా ఉంటున్నప్పటికీ, తనలోని వికెట్ల ఆకలి ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేశాడు. “మైదానంలోకి దిగి దేశానికి విజయాన్ని అందించడమే నా పని. జాతీయ జట్టు నుంచి పిలుపు వస్తే కాదనే ప్రసంగే లేదు. దేశం కోసం ఆడటానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను” అని చాహల్ నమ్మకంగా వెల్లడించాడు. 36 ఏళ్ల వయసు సమీపిస్తున్నా తన స్పిన్ నైపుణ్యం, ఫిట్‌నెస్ ఏమాత్రం తగ్గలేదని ఈ వ్యాఖ్యల ద్వారా చాటిచెప్పాడు. కాగా, యుజ్వేంద్ర చాహల్, భారత జట్టు తరపున వన్డే మ్యాచ్ ఆడి 3.5 సంవత్సరాలు అయింది. చివరిసారిగా జనవరి 2023లో 50 ఓవర్ల మ్యాచ్‌లో భారత జెర్సీని ధరించాడు. అప్పటి నుంచి చాహల్‌కు భారత జట్టులో చోటు దక్కలేదు.
చాహల్ అంతర్జాతీయ కెరీర్ పరిశీలిస్తే ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలలో ఆయనకు తీవ్ర అన్యాయం జరిగిందనే భావన అభిమానుల్లో ఉంది. 2021 టీ20 ప్రపంచకప్ జట్టు నుంచి అనూహ్యంగా ఆయన్ను పక్కన పెట్టారు. ఆ తర్వాత 2022 టీ20 ప్రపంచకప్, 2024 టీ20 ప్రపంచకప్ జట్లలో స్థానం లభించినప్పటికీ తుది జట్టులో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కలేదు. 2023 వన్డే ప్రపంచకప్ జట్టుకు సైతం ఆయన్ను ఎంపిక చేయలేదు. ఇన్ని వరుస పరాభవాలు, పక్కన పెట్టడాలు ఎదురైనప్పటికీ చాహల్ ఏనాడూ సహనం కోల్పోలేదు. నిరాశ పడకుండా దేశవాళీ క్రికెట్, ఐపీఎల్, ఇంగ్లాండ్ కౌంటీ మ్యాచ్‌లలో నిలకడగా వికెట్లు తీస్తూ తన సత్తా నిరూపించుకుంటూనే వచ్చాడు.
ప్రస్తుతం భారత జట్టులో కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ లాంటి స్పిన్నర్లకు ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ చాహల్ తన ప్రయత్నాలను ఆపలేదు. ఇంగ్లాండ్ వన్డే కప్, కౌంటీ ఛాంపియన్‌షిప్‌లలో నార్తాంప్టన్‌షైర్ జట్టు తరఫున బరిలోకి దిగి అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన ఇచ్చాడు. నాలుగు వికెట్ల ప్రదర్శనలతో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. అతను ప్రస్తుతం కేవలం ఆరు మ్యాచ్‌లలో 15 వికెట్లు తీసి, టోర్నమెంట్‌లో నాల్గవ అత్యధిక వికెట్ టేకర్‌గా నిలిచాడు. రెడ్ బాల్, వైట్ బాల్ రెండింట్లోనూ ఇంగ్లాండ్ మైదానాలపై వికెట్ల వర్షం కురిపించి తన పాత వైభవాన్ని చాటుకున్నాడు. ఐపీఎల్‌లోనూ పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున వికెట్ టేకింగ్ బౌలర్‌గా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ అద్భుతమైన ఫామ్ ఆధారంగానే తాను 2027 ప్రపంచకప్ రేసులో బలంగా ఉన్నానని చాహల్ చెబుతున్నాడు.
2027 వన్డే ప్రపంచకప్ టోర్నీకి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఉమ్మడిగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఆఫ్రికా ఖండంలోని పిచ్‌లపై బంతి అదనపు బౌన్స్, ఫ్లైట్‌కు సహకరిస్తుంది. చాహల్ లాంటి చాకచక్యమైన లెగ్ స్పిన్నర్‌కు ఇటువంటి పిచ్‌లు ఎంతో అనుకూలిస్తాయి. గాల్లో బంతిని తిప్పుతూ బ్యాటర్లను మైండ్ గేమ్‌తో అవుట్ చేయడంలో చాహల్ సిద్ధహస్తుడు. వన్డేల్లో భారత్ తరఫున 72 మ్యాచ్‌లలో 121 వికెట్లు, టీ20ల్లో 80 మ్యాచ్‌లలో 96 వికెట్లు సాధించిన ఘనమైన ట్రాక్ రికార్డు ఆయనకుంది. రాబోయే సిరీస్‌లలో బిసిసిఐ సెలెక్టర్లు చాహల్ అనుభవానికి ప్రాధాన్యత ఇస్తారో లేదో వేచి చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..