మైదానంలోనే రక్తపు వాంతులు.. మృత్యువుతో పోరాటం.. ఈ ప్రపంచ ఛాంపియన్‌ మనోధైర్యానికి సలామ్‌ చెప్పాల్సిందే

|

Feb 04, 2023 | 5:41 PM

క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంలో భాగంగా ఏటా ఫిబ్రవరి 4న క్యాన్సర్‌ దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాగా మందులేని ఈ మహమ్మారిని మనోధైర్యంతో జయించవచ్చని చాలామంది నిరూపించారు. అందులో టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ కూడా ఉన్నాడు.

మైదానంలోనే రక్తపు వాంతులు.. మృత్యువుతో పోరాటం.. ఈ ప్రపంచ ఛాంపియన్‌ మనోధైర్యానికి సలామ్‌ చెప్పాల్సిందే
Yuvraj Singh
Follow us on

క్యాన్సర్. చాపకింద నీరులా విస్తరిస్తోన్న ఈ వ్యాధి పేరు వినగానే చాలా మంది వణికిపోతారు. సైలెంట్‌ కిల్లర్‌గా పేరున్న ఈ మహమ్మారి బారిన పడి ఏటా కోట్లమంది కన్నుమూస్తున్నారు. టెక్నాలజీ పరంగా ప్రపంచం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నా క్యాన్సర్‌కు ఇప్పటికీ సరైన మందు కనిపెట్టకపోవడం మరింత శోచనీయం. ఈక్రమంలో క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంలో భాగంగా ఏటా ఫిబ్రవరి 4న క్యాన్సర్‌ దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాగా మందులేని ఈ మహమ్మారిని మనోధైర్యంతో జయించవచ్చని చాలామంది నిరూపించారు. అందులో టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ కూడా ఉన్నాడు. 2007లో టీ20 ప్రపంచకప్‌ను, 2011లో వన్డే ప్రపంచకప్‌ను టీమిండియా గెల్చుకోవడంలో యువీ కీలక పాత్ర పోషించాడు. అయితే ఎప్పుడైతే అతను క్యాన్సర్‌ బారిన పడ్డాడని తెలియగానే యావత్ క్రికెట్ ప్రపంచం ఉలిక్కిపడింది. 2011లో స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకుంది. ఈ విక్టరీ క్రెడిట్ మొత్తం మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ ఖాతాలోకి వెళ్లిపోయినా.. అసలైన హీరో మాత్రం యువరాజే. ఈ టోర్నీలో బ్యాట్‌తోనూ, బంతితోనూ చెలరేగిన అతను మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచాడు. అయితే ఆ తర్వాతే అతను క్యాన్సర్‌ బారిన పడ్డాడు.

లైవ్‌ మ్యాచ్‌లోనే రక్తపు వాంతులు..

ఇవి కూడా చదవండి

ఏప్రిల్ 2న శ్రీలంకను ఓడించి భారత్ ప్రపంచకప్ గెలుచుకుంది. ఏడు నెలల తర్వాత అంటే 2011 నవంబర్‌లో యువరాజ్‌కు ఊపిరితిత్తులలో కణితి ఉందని, మరో మూడు నెలల తరువాత, ఈ కణితి క్యాన్సర్ అని తేలింది. ఈ వార్త తెలియగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత ఆరోగ్యకరమైన జీవనశైలిని గడిపే ఆటగాడికి క్యాన్సర్ ఎలా వస్తుంది? దీని తర్వాత, యువరాజ్ మాట్లాడుతూ, ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు, అతను రక్తాన్ని వాంతులు చేసుకున్నాడు. జనవరి 2011లో భారత్‌ దక్షిణాఫ్రికా పర్యటనలో తనకు రక్తపు వాంతులు వచ్చాయని షాకింగ్‌ న్యూస్‌ బయటపెట్టాడు. అయినా ప్రపంచకప్‌లో ఆడిన యూవీ మార్చి 20న చెన్నైలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ రక్తపు వాంతులు చేసుకున్నాడు. కానీ ఈ మ్యాచ్‌లో యువరాజ్ సెంచరీ చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలవడం గమనార్హం.

గోడకు కొట్టిన బంతిలా..

క్యాన్సర్‌ యువరాజ్‌ను శారీరకంగా, మానసికంగా కుంగదీసింది. అయితే యువీ మాత్రం మనోధైర్యంతో పోరాడాడు. 2012 ప్రారంభంలో అమెరికా వెళ్లి మూడు నెలలు అక్కడే ఉండి కీమోథెరపీ చేయించుకున్నాడు. ఈ సర్జరీలో యువరాజ్ మూడు దశలను దాటాడు. చికిత్సాక్రమంలో ఎన్నో బాధలను ఎదుర్కొన్నాడు యువరాజ్. ఈ సమయంలోనే అతను చాలా బలహీనంగా మారిపోయాడు. అయితే మరికొన్ని రోజులు టీమిండియాకు సేవలు అందించాలన్న స్ఫూర్తి క్యాన్సర్‌ను బలంగా ఓడించింది. గోడకు కొట్టిన బంతిలా మళ్లీ భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. 2012 ఏప్రిల్‌లో ఇండియాకు వచ్చిన అతను అతి తక్కువ సమయంలోనే టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే క్యాన్సర్‌తో అప్పటికే శారీరకంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న యువీ ఎక్కువ రోజులు కెరీర్‌ కొనసాగించలేకపోయాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..