WTC Final 2023: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో విజయం కోసం భారత్‌కి ఇంకా 280 పరుగులు అవసరం. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఐదో రోజు ఆట ఇంకా మిగిలి ఉండగా.. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(44), అజింక్యా రహానే(20) ఉన్నారు. అయితే మ్యాచ్ అనంతరం భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో 100 శాతం విజయం మాదే, అవసరమైతే నేనూ బ్యాటింగ్ చేస్తానని ధీమా వ్యక్తం చేశాడు. షమి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 11 బంతుల్లోనే 13 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
అలాగే శుభమాన్ గిల్(18)ని పెవిలియన్ బాట పట్టించిన వివాదాస్పద క్యాచ్ గురించి మాట్లాడుతూ.. ‘‘అతను(థర్డ్ అంపైర్) రివ్యూపై నిర్ణయం ప్రకటించేందుకు మరి కొంత సమయం తీసుకోవచ్చు. ఇది WTC ఫైనల్; సాధారణ మ్యాచ్ కాదు. అతను జూమ్ చేసి(బంతి నేలకు తాకిందా లేదా) ఉండాల్సింది.. కానీ అదంతా ఆటలో భాగమే’ అని చెప్పాడు. అలాగే ‘పిచ్ పూర్తిగా సిద్ధం కాలేదని నేను భావిస్తున్నా. ఈ మ్యాచ్‌లో గెలవగలమని మేము 100 శాతం నమ్ముతున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలిచ్చి విజయం సాధించాం. ఈ మ్యాచ్‌లోనూ గెలుస్తాం, అవసరమైతే నేనూ బ్యాటింగ్ చేస్తా’ అని షమి తెలిపాడు.
కాగా, మూడో రోజు తన రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కంగారుల జట్టు మొత్తం 443 పరుగుల ఆధిక్యంతో 270 రన్స్ వద్ద డిక్లేర్ చేసింది. దీంతో 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు రోహిత్ శర్మ(43), గిల్(18) విధ్వంసకరమైన శుభారంభాన్ని అందించారు. అయితే స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో గిల్ వివాదాస్పదరీతిలో క్యాచ్ ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారా(27)తో కలిసి రోహిత్ కొంత సమయం ఆడి వెనుదిరిగాడు. వీరిద్దరు పెవిలియన్ చేరాక క్రీజులోకి వచ్చిన కోహ్లీ, రహానే నిలకడగా రాణిస్తున్నారు. ఇక టీమిండియా విజయం కోసం 280 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆసీస్ బౌైలర్లు మరో 7 వికెట్లు తీస్తే చాలు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..