WPL 2027 Auction: మహిళల ప్రీమియర్ లీగ్ వేలానికి ముహూర్తం ఫిక్స్.. వేదిక, సమయం ఇదే
WPL 2027 Auction: డబ్ల్యూపీఎల్ 2027 ఆటగాళ్ల వేలం అక్టోబర్ 28న కొచ్చిలో సాయంత్రం 5:30 గంటలకు జరగనుంది. మొత్తం 146 మంది ఆటగాళ్లు 27 ఖాళీల కోసం పోటీపడనున్నారు. సోఫియా డంక్లీ, సోఫీ మోలిన్యూ రూ.50 లక్షల బేస్ ప్రైస్‌తో బరిలో ఉన్నారు. జి. కమలిని, కిరణ్ నవ్‌గిరే సహా కీలక ఆటగాళ్లపై ఫ్రాంచైజీల దృష్టి నెలకొంది.

WPL 2027 Auction: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2027 సీజన్‌కు సంబంధించిన ఆటగాళ్ల వేలానికి రంగం సిద్ధమైంది. అక్టోబర్ 28న కేరళలోని కొచ్చిలో ఈ వేలం ప్రక్రియ జరగనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 గంటలకు ప్రక్రియ ప్రారంభమవుతుంది.గతంలో రెండుసార్లు ముంబై, ఆ తర్వాత బెంగళూరు అలాగే న్యూఢిల్లీలో వేలాలు జరగగా ఈసారి ఈ వేడుకను కొచ్చిలో నిర్వహించనున్నారు. బీసీసీఐ అక్టోబర్ 19న అధికారికంగా ఈ వివరాలను వెల్లడించింది. వచ్చే సీజన్ కోసం జట్లు ఇప్పటికే తమ వద్ద ఉంచుకునే ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. విడుదల చేసిన ప్లేయర్ల స్థానాలను భర్తీ చేసుకునేందుకు ఇప్పుడు వేలం జరగనుంది. గతంలో జరిగిన మెగా వేలంతో పోలిస్తే ఈసారి మినీ వేలం కావడంతో జట్లు తమకు అవసరమైన కొద్దిమంది ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడంపై దృష్టి పెట్టనున్నాయి.
146 మంది ఆటగాళ్లు.. ఖాళీలు మాత్రం 27
ఈసారి వేలం జాబితాలో మొత్తం 146 మంది ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో 119 మంది భారతీయులు కాగా, 27 మంది విదేశీ ప్లేయర్లు. భారత ఆటగాళ్లలో 22 మందికి అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. మిగతా 97 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు. విదేశీ ఆటగాళ్లలో 14 మంది అంతర్జాతీయ అనుభవం ఉన్నవారు కాగా, 13 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు. వీరిలో అసోసియేట్ దేశాలకు చెందిన ఆరుగురు ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఐదు ఫ్రాంచైజీల్లో కలిపి 27 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 20 స్థానాలు భారత ఆటగాళ్లకు, ఏడు స్థానాలు విదేశీ ప్లేయర్లకు అందుబాటులో ఉన్నాయి. దీంతో వేలంలో చోటు దక్కించుకోవడానికి ఆటగాళ్ల మధ్య గట్టి పోటీ ఉండనుంది.
రూ.50 లక్షల బేస్ ప్రైస్‌తో ఇద్దరు స్టార్ ప్లేయర్లు
ఈ వేలంలో అత్యధిక బేస్ ప్రైస్ రూ.50 లక్షలుగా నిర్ణయించారు. ఇంగ్లండ్ బ్యాటర్ సోఫియా డంక్లీ, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ సోఫీ మోలిన్యూ ఈ ధరతో వేలంలోకి వస్తున్నారు. వీరిని కొనుగోలు చేసేందుకు జట్లు ఆసక్తి చూపించే అవకాశం ఉంది. ఇక రూ.40 లక్షల బేస్ ప్రైస్‌తో నలుగురు ఆటగాళ్లు బరిలో ఉన్నారు. భారత వికెట్‌కీపర్ బ్యాటర్ జి.కమలిని, కిరణ్ నవ్‌గిరే, ఆస్ట్రేలియా ఆటగాళ్లు హీథర్ గ్రాహమ్, జెస్ జొనాసెన్ ఈ జాబితాలో ఉన్నారు. ముఖ్యంగా కమలిని గతంలో ముంబై ఇండియన్స్ జట్టులో ఆడింది. ఇటీవల భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆమెను ముంబై విడుదల చేయడం చర్చనీయాంశమైంది. ఈసారి ఆమెను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తుందనే ఆసక్తి నెలకొంది.
గ్రేస్ హారిస్, స్నేహ్ రాణాపైనా ఫ్రాంచైజీల కన్ను
రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో మొత్తం 30 మంది ఆటగాళ్లు వేలంలోకి వస్తున్నారు. వీరిలో గ్రేస్ హారిస్, స్నేహ్ రాణా, చమరి ఆటపట్టు వంటి పేర్లు ఉన్నాయి. గతంలో డబ్ల్యూపీఎల్లో మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లు కావడంతో వీరికి అవకాశాలు దక్కుతాయా అనే చర్చ జరుగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున టైటిల్ గెలిచిన గ్రేస్ హారిస్, భారత ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా కూడా ఈ వేలంలో అందుబాటులో ఉన్నారు. జట్లకు బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఆల్‌రౌండర్ ఎంపికలు కూడా కీలకం కానున్నాయి. ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్, గత ప్రదర్శన, జట్టు అవసరాలు, అందుబాటులో ఉన్న బడ్జెట్ ఆధారంగా ఫ్రాంచైజీలు బిడ్లు వేయనున్నాయి.
ఏ జట్టులోకి ఎవరు వెళ్తారు?
డబ్ల్యూపీఎల్లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్ జట్లు పోటీపడుతున్నాయి. ప్రతి జట్టు తన అవసరాలకు తగ్గట్టుగా మిగిలిన స్థానాలను భర్తీ చేసుకోవాల్సి ఉంది. భారత యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం కల్పించడంతో పాటు, అంతర్జాతీయ అనుభవం ఉన్న ప్లేయర్లను జట్టులోకి తీసుకోవడం కూడా ఫ్రాంచైజీల వ్యూహంలో కీలకం కానుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
