MI v RCB-WPL 2023: బెంగళూరుపై ముంబై ఘన విజయం.. ఆల్‌రౌండ్ షోతో ఆర్‌సీబీని ఆడేసుకున్న హేలీ..
హేలే మ్యాథ్యూస్ కేవలం 38 బంతుల్లోనే 77 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. మ్యాథ్యూస్‌తో పాటు నాట్ బ్రంట్ కూడా దూకుడుగా ఆడటంతో..
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ను ఓడించిన ముంబై జట్టు తన ఖాతాలో మరో విజయాన్ని వేసుకుంది. సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై జరిగిన్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి ఆర్సీబీ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని కేవలం 1 వికెట్ కోల్పోయి, 14.2 ఓవర్లలో చేధించింది హర్మన్ ప్రీత్ సేన. హేలే మ్యాథ్యూస్ కేవలం 38 బంతుల్లోనే 77 పరుగులు(13 ఫోర్లు, 1 సిక్స్) చేసి నాటౌట్‌గా నిలిచి అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. మ్యాథ్యూస్‌తో పాటు నాట్ బ్రంట్ కూడా దూకుడుగా ఆడటంతో (55 పరుగులు, 29 బంతుల్లో, 9 ఫోర్లు, 1 సిక్స్) ముంబై ఇండియన్స్ జట్టు మరో విజయాన్ని నమోదు చేసుకుంది. అలాగే అంతకుముందు యస్టికా భాటియా 23 (19 బంతుల్లో, 4 ఫోర్లు) పరుగులు చేసింది. బ్యాట్‌తో(77 నాటౌట్), బంతితో (3 వికెట్లు) ఆల్‌రౌండ్ షో చేసి ముంబై జట్టుకు ఘన విజయం అందించిన మ్యాథ్యూస్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచింది.
అయితే టాస్ గెలిచిన బెంగళూరు జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ముంబయి బౌలర్ల దాటికి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. మరోవైపు దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన స్మృతి మంధాన.. 17 బంతుల్లో 23 పరుగులు (5 ఫోర్లు) చేసి హేలే బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి పెవీలియన్ చేరింది. అంతకు ముందే డివిన్ కూడా 16 పరుగులు(11 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్స్) చేసి ఔట్ అయ్యింది. ఆ తర్వాత దిశా కసత్, హీథర్ నైట్ డకౌట్ కావడంతో బెంగళూరు జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినట్లయింది. ఆ తర్వాత వచ్చిన రిచా ఘోష్ కొంత మేర ఆదుకుంది. 26 బంతుల్లో 28 పరుగులు(3 ఫోర్లు, 1 సిక్స్) చేసిన రిచా బెంగళూరు ఇన్నింగ్స్‌ను పునర్నిర్మించింది.
Clean striking ?@MyNameIs_Hayley on a roll with the bat too!
Follow the match ▶️ https://t.co/zKmKkNrJkZ#TATAWPL | #MIvRCB pic.twitter.com/ONSZ5ZA6MT
— Women’s Premier League (WPL) (@wplt20) March 6, 2023
కాగా, చివర్లో కనికా అహుజా (22 పరుగులు, 13 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయంకా పాటిల్ (23 పరుగులు, 15 బంతుల్లో, 4 ఫోర్లు), మేగన్ స్కట్ (20 పరుగులు, 14 బంతుల్లో, 3 ఫోర్లు) దూకుడుగా ఆడటంతో బెంగళూరు జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. అయితే అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ముంబై జట్టు ప్లేయర్లు బెంగళూరు బౌలర్లందరినీ చితక్కొట్టారు. బెంగళూరు జట్టులో ఒక్క ప్రీతి బోస్ మాత్రమే ఒక్క వికెట్ తీసింది. రేణుకా సింగ్ సహా మిగిలిన వారంతా వికెట్లు తీయకపోగా, భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అటు.. ముంబై బౌలర్లు సమష్టిగా రాణించడంతో పాటు.. మ్యాథ్యూస్ 3 వికెట్లు, సాయిక్ ఇషాక్, అమేలియా కేర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అలాగే పూజా వస్త్రాకర్, నాట్ బ్రంట్ చెరో వికెట్ తీశారు.