
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సైకిల్‌లో టీమిండియా అగ్రస్థానానికి చేరుకుంది. ఇప్పటికే రెండు డబ్ల్యూటీసీ సైకిల్‌లు పూర్తయినప్పటికీ.. ఆ ట్రోఫీ మాత్రం భారత్‌కు అందని ద్రాక్షే. వరుసగా రెండు సీజన్లు ఫైనల్‌కు చేరుకున్నా.. చివరి అంకంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల చేతిలో ఘోర ఓటమిపాలైంది. ఇక ఈసారైనా కచ్చితంగా ట్రోఫీ సాధించాలన్న కసితో ఉంది టీమిండియా. ఇప్పటికే ఇంగ్లాండ్‌పై వరుసగా మూడు టెస్టుల్లో విజయం సాధించి.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో తమ విన్నింగ్ పర్సెంటేజ్‌ను మెరుగుపరుచుకున్న భారత్.. తాజాగా అగ్రస్థానంలోకి చేరుకుంది.
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టులో న్యూజిలాండ్ 172 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 75 విజయశాతంతో అగ్రస్థానంలో ఉన్న కివీస్ జట్టు.. 60 విజయశాతంతో దెబ్బకు రెండో స్థానంలోకి పడిపోయింది. ఈ క్రమంలోనే 64.58 విజయశాతంతో ఉన్న టీమిండియా.. అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అటు 55 విజయశాతంతో మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా.. తమ విజయశాతాన్ని 59.09కి మెరుగుపరుచుకుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా.. భారత్, ఇంగ్లాండ్ మధ్య చెరో టెస్ట్ మిగిలి ఉండటంతో డబ్ల్యూటీసీ టేబుల్‌లో మరిన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.
డబ్ల్యూటీసీ 2023-2025 సైకిల్‌లో భారత్ ఎనిమిది మ్యాచులు ఆడగా అయిదింటిలో గెలిచింది. రెండు మ్యాచుల్లో ఓడగా ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. 64.58 విజయశాతంతో అగ్రస్థానంలో ఉంది. న్యూజిలాండ్ ఐదు టెస్టులు ఆడింది. రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మూడు మ్యాచుల్లో గెలవడంతో 60 విజయశాతం కలిగి ఉంది. దీంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఆస్ట్రేలియా 11 మ్యాచులు ఆడింది. ఏడింటిలో గెలవగా మూడు మ్యాచుల్లో ఓడింది. మరో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. 59.09 విజయశాతంతో మూడో స్థానంలో కొనసాగుతోంది.
ఆ తరువాత బంగ్లాదేశ్ (50), పాకిస్తాన్ (36.66), వెస్టిండీస్ (33.33), దక్షిణాఫ్రికా (25) వరుసగా నాలుగు, ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో ఉన్నాయి. ఇక భారత్‌తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడుతున్న ఇంగ్లాండ్ 21 విజయశాతంతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఆడిన రెండు మ్యాచుల్లో ఓడిన లంక జట్టు ఆఖరి స్థానంలో నిలిచింది.
India strengthen their position in the top two of the #WTC25 table 💪 pic.twitter.com/9RE5qv8dEg
— ESPNcricinfo (@ESPNcricinfo) February 26, 2024