Why MI Lost to SRH: 243 కొట్టినా దక్కని గెలుపు.. హార్దిక్ సేన కొంపముంచిన ఆ మూడు ఘోర తప్పిదాలివే
Why MI Lost to SRH : 243 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ ముంబై ఇండియన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. టాస్ వద్ద తప్పు నిర్ణయం, బౌలింగ్ వైఫల్యం, కీలక క్యాచ్‌లు వదిలేయడం వంటి మూడు ప్రధాన తప్పిదాలు ముంబై ఓటమికి కారణమయ్యాయి. ఈ పరాజయంతో ప్లే ఆఫ్ ఆశలు దాదాపు ముగిసినట్టే కనిపిస్తున్నాయి.

Why MI Lost to SRH: వాంఖడే స్టేడియంలో పరుగుల వరద పారినా, ముంబై ఇండియన్స్‌కు మాత్రం కన్నీళ్లే మిగిలాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 243 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ, ముంబై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ సీజన్‌లో ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఆరో ఓటమితో ముంబై ప్లే ఆఫ్ ఆశలు దాదాపు ఆవిరై పోయాయి. సొంత గడ్డపై వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయి ముంబై తన చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇంత భారీ స్కోరు చేసినా ముంబై ఎందుకు ఓడిపోయింది? హార్దిక్ పాండ్యా సేన చేసిన ఆ మూడు పెద్ద తప్పులేంటో వివరంగా తెలుసుకుందాం.
టాస్ గెలిచినా.. తప్పుడు నిర్ణయం
వాంఖడే పిచ్ నంబర్-8పై ఈ మ్యాచ్ జరిగింది. ఈ పిచ్‌పై భారీ స్కోర్లు నమోదవుతాయని అందరికీ తెలుసు. పైగా సాయంత్రం వేళ ముంబైలో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని పక్కా సమాచారం ఉన్నప్పటికీ, హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు వల్ల బంతి తడిగా మారి బౌలర్ల చేతి నుంచి జారిపోతుంది. అదే జరిగింది.. ముంబై బౌలర్లు బంతిని గ్రిప్ చేయలేక వరుసగా బౌండరీలు ఇచ్చుకున్నారు. అదే హైదరాబాద్ టాస్ గెలిచి ఉంటే కచ్చితంగా బౌలింగ్ ఎంచుకునేది. ఈ ఒక్క నిర్ణయమే ముంబై ఓటమికి పునాది వేసింది.
బుమ్రా మ్యాజిక్ మిస్సవ్వడం – పవర్ ప్లే వైఫల్యం
ముంబై ఇండియన్స్ ప్రధానాస్త్రం జస్ప్రీత్ బుమ్రా. కానీ ఈ మ్యాచ్‌లో బుమ్రా అత్యంత ఖరీదైన బౌలర్‌గా మారాడు. 4 ఓవర్లలో 54 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ట్రెండ్ బౌల్ట్ కూడా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేదు. పవర్ ప్లేలోనే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ విరుచుకుపడి 93 పరుగులు పిండుకున్నారు. మొదటి వికెట్‌కే 129 పరుగుల భాగస్వామ్యం రావడంతో ముంబై బౌలర్లు ఆత్మరక్షణలో పడిపోయారు. కీలక సమయంలో వికెట్లు తీసే బౌలర్ లేకపోవడం ముంబైకి శాపంగా మారింది.
చేజేతులా వదిలేసిన క్యాచ్‌లు
సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో 76 పరుగులు చేసి ముంబైని ముంచేశాడు. అయితే అతడిని అవుట్ చేసే రెండు సువర్ణ అవకాశాలను ముంబై ఫీల్డర్లు చేజేతులా జారవిడిచారు. మూడో ఓవర్లో నమన్ ధీర్.. హెడ్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను వదిలేశాడు. ఐదో ఓవర్లో మరో కష్టమైన క్యాచ్‌ను కూడా అందుకోలేకపోయారు. ఆరంభంలోనే హెడ్ వికెట్ పడి ఉంటే మ్యాచ్ స్వరూపం మరోలా ఉండేది. ఈ క్యాచ్‌ల డ్రాప్‌తో ఊపిరి పోసుకున్న హెడ్.. ముంబై బౌలర్లను ఊచకోత కోశాడు.
ముంబై ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా?
ఈ ఓటమితో ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. మిగిలిన అన్ని మ్యాచ్‌లు గెలిచినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. బ్యాటింగ్ లో రాన్ రికల్టన్ (123*) అద్భుత సెంచరీతో ముంబైకి భారీ స్కోరు అందించినా, బౌలర్ల వైఫల్యం వల్ల ఆ శ్రమ అంతా వృధా అయింది. ముంబై ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఒకవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ ఫియర్ లెస్ ఆటతీరుతో దూసుకుపోతుంటే, ముంబై మాత్రం తన సొంత సామ్రాజ్యంలోనే కుప్పకూలుతోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
