W,W,W,W,W.. హ్యాట్రిక్‌తో సరికొత్త చరిత్ర.. డబ్ల్యూపీఎల్ నుంచి నేరుగా టీమిండియా స్క్వాడ్‌లోకే..?
Who is Nandini Sharma: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్‌లో ఒక అద్భుతం చోటుచేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ యువ పేసర్ నందిని శర్మ గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చారిత్రాత్మక హ్యాట్రిక్ సాధించి క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది. ఈ ఫీట్ సాధించిన తొలి అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా ఆమె రికార్డు సృష్టించింది.

Who is Nandini Sharma: నవీ ముంబయి వేదికగా ఆదివారం జరిగిన గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరులో ఒక కొత్త స్టార్ పుట్టుకొచ్చింది. ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 24 ఏళ్ల పేసర్ నందిని శర్మ ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడమే కాకుండా, అద్భుతమైన హ్యాట్రిక్‌తో సరికొత్త రికార్డు నెలకొల్పింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన నాలుగో బౌలర్‌గా, అలాగే ఒకే మ్యాచ్‌లో 5 వికెట్లు + హ్యాట్రిక్ తీసిన తొలి ప్లేయర్‌గా ఆమె నిలిచింది.
గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్ 20వ ఓవర్లో నందిని శర్మ ఈ అరుదైన ఫీట్ సాధించింది. సోఫీ డివైన్ (95) విధ్వంసంతో గుజరాత్ భారీ స్కోరు దిశగా సాగుతున్న వేళ, నందిని తన బౌలింగ్‌తో బ్రేకులు వేసింది. ఇన్నింగ్స్ ఆఖరి మూడు బంతుల్లో వరుసగా కనిక అహుజా (స్టంపౌట్), రాజేశ్వరి గైక్వాడ్ (క్లీన్ బౌల్డ్), రేణుక సింగ్ (ఎల్బీడబ్ల్యూ)లను అవుట్ చేసి హ్యాట్రిక్ పూర్తి చేసింది. అంతకుముందే సెట్ బ్యాటర్ సోఫీ డివైన్ వికెట్‌ను కూడా ఆమె పడగొట్టడం విశేషం. మొత్తంగా 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 5 వికెట్లు తీసింది.
ఎవరీ నందిని శర్మ..?
చండీగఢ్‌కు చెందిన నందిని శర్మ కుడిచేతి వాటం మీడియం ఫాస్ట్ బౌలర్. 2001 సెప్టెంబర్ 20న జన్మించిన ఆమె, డొమెస్టిక్ క్రికెట్‌లో చండీగఢ్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించింది. నార్త్ జోన్ తరపున ఆడుతూ నిలకడగా రాణిస్తున్న ఆమెను చూసి డబ్ల్యూపీఎల్ స్కౌట్స్ ఆకర్షితురాలైంది. 2026 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను రూ. 20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. కొన్న మొదటి సీజన్‌లోనే ఆమె తన విలువను నిరూపించుకుంది.
రికార్డుల వేట: డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఇసీ వాంగ్ (ముంబై), దీప్తి శర్మ (యూపీ), గ్రేస్ హారిస్ (యూపీ) మాత్రమే హ్యాట్రిక్ సాధించారు. ఇప్పుడు వారి ఎలైట్ జాబితాలో నందిని చేరిపోయింది. గతేడాది సీనియర్ మహిళల టీ20 ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకరిగా నిలిచిన నందిని, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి బ్యాటర్లను సైతం తన వైవిధ్యమైన బంతులతో ముప్పతిప్పలు పెడుతోంది.
కెప్టెన్ ప్రశంసలు: మ్యాచ్ అనంతరం నందిని మాట్లాడుతూ.. తన కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైందని చెప్పింది. “నేను కేవలం స్టంప్స్ లక్ష్యంగా బౌలింగ్ చేయాలనుకున్నాను. వికెట్లు వస్తాయని నా టీమ్ మేట్స్ నమ్మకం ఇచ్చారు. హ్యాట్రిక్ వస్తుందని అస్సలు ఊహించలేదు” అని ఆనందం వ్యక్తం చేసింది.
ఈ ప్రదర్శనతో నందిని శర్మ త్వరలోనే భారత జాతీయ జట్టులోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




