
West Indies ODI World Cup 2027: ఇటీవల టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ ముగిసిన వెంటనే వన్డే క్రికెట్ సందడి మొదలైంది. బంగ్లాదేశ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లా పులులు అద్భుత ప్రదర్శన చేశాయి. నిర్ణయాత్మకమైన చివరి వన్డేలో 11 పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకున్నాయి. ఈ గెలుపు బంగ్లాదేశ్ ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా, 2027 వరల్డ్ కప్ క్వాలిఫికేషన్ రేసులో ఆ జట్టును ముందు వరుసలో నిలబెట్టింది.
బంగ్లాదేశ్ సాధించిన ఈ విజయంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. తాజా ర్యాంకింగ్స్ ప్రకారం, బంగ్లాదేశ్ 10వ స్థానం నుంచి 9వ స్థానానికి ఎగబాకగా, వెస్టిండీస్ జట్టు 9 నుంచి 10వ స్థానానికి పడిపోయింది. 2027 వన్డే ప్రపంచకనప్‌కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే ఆతిథ్యం ఇస్తున్నాయి. ఆతిథ్య దేశాలుగా ఈ రెండు జట్లు నేరుగా అర్హత సాధించగా, మిగిలిన ఎనిమిది జట్లు ర్యాంకింగ్స్ ఆధారంగానే ప్రవేశిస్తాయి.
వెస్టిండీస్ జట్టు 2027 ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాలంటే టాప్-10లో కొనసాగడం తప్పనిసరి. కానీ, ప్రస్తుతం బంగ్లాదేశ్ జోరు చూస్తుంటే కరేబియన్ జట్టుకు కష్టాలు తప్పేలా లేవు. రాబోయే వన్డే మ్యాచుల్లో వెస్టిండీస్ ఓడిపోతే, ఆ జట్టు క్వాలిఫికేషన్ రేసు నుంచి పూర్తిగా తప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే గత వన్డే వరల్డ్ కప్‌నకు అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్, మరోసారి అటువంటి చేదు అనుభవాన్ని ఎదుర్కోవాల్సి రావడం ఆ జట్టు అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.
మరోవైపు, గత వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన భారత్, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ టైటిల్ చేజార్చుకోకూడదని పట్టుదలగా ఉంది. సౌత్ ఆఫ్రికా గడ్డపై జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికలతో సిద్ధమవుతోంది. మొత్తానికి 2027 వన్డే వరల్డ్ కప్ క్వాలిఫికేషన్ పోరు రసవత్తరంగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..