WCL 2025 : సౌతాఫ్రికా గెలుపునకు సాయం చేసిన పాత రూల్స్..WCLలో సూపర్ ఓవర్ బదులు బౌల్-అవుట్
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 లో సౌత్ ఆఫ్రికా ఛాంపియన్స్, వెస్ట్ ఇండీస్ ఛాంపియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. బౌల్-అవుట్ ద్వారా సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. మ్యాచ్ వివరాలు, బౌల్-అవుట్ నియమం గురించి వివరంగా తెలుసుకుందాం.

WCL 2025 : వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్‌లో రెండో మ్యాచ్ సౌత్ ఆఫ్రికా ఛాంపియన్స్, వెస్ట్ ఇండీస్ ఛాంపియన్స్ మధ్య జరిగింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఛాంపియన్స్ కు ఆశించిన ఆరంభం లభించలేదు. ఓపెనర్ క్రిస్ గేల్ కేవలం 2 పరుగులు చేసి అవుట్ కాగా, డ్వేన్ స్మిత్ 7 పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు. ఇక కీరన్ పొలార్డ్ అయితే డకౌట్ అయ్యాడు. ఈ మధ్యలో మళ్ళీ వర్షం రావడంతో మ్యాచ్‌ను కొంత సమయం ఆపేశారు. ఆ తర్వాత మ్యాచ్ తిరిగి మొదలుకాగా, లిండ్ల్ సిమన్స్ 28 పరుగులు చేయగా, వికెట్ కీపర్ వాల్టన్ బ్యాట్ నుంచి 27 పరుగులు వచ్చాయి. ఇలా నిర్ణీత 11 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి వెస్ట్ ఇండీస్ ఛాంపియన్స్ జట్టు 79 పరుగులు చేసింది.
డక్‌వర్త్ లూయిస్ నియమం ప్రకారం.. సౌతాఫ్రికా జట్టుకు 11 ఓవర్లలో 81 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని ఛేదించిన సౌతాఫ్రికా కూడా మంచి ఆరంభం పొందలేకపోయింది. రిచర్డ్ లెవి 5 పరుగులు చేసి అవుట్ కాగా, హాషిమ్ ఆమ్లా 15 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఇక కెప్టెన్ ఏబీ డివిలియర్స్ కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, మధ్య ఓవర్లలో దూకుడుగా బ్యాటింగ్ చేసిన జేపీ డుమిని 12 బంతుల్లో 25 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో సౌతాఫ్రికా జట్టు గెలవడానికి 12 పరుగులు అవసరం అయ్యాయి. చివరి ఓవర్ వేసిన ఫిడెల్ ఎడ్వర్డ్స్ కేవలం 11 పరుగులు మాత్రమే ఇవ్వడంతో మ్యాచ్ టైగా ముగిసింది.
మ్యాచ్ టైగా ముగియడంతో, ఫలితం కోసం బౌల్-అవుట్ పద్ధతిని ఆశ్రయించారు. సాధారణంగా టీ20 క్రికెట్‌లో మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ ఆడిస్తారు. అయితే, ఈ సూపర్ ఓవర్ నియమం అమలులోకి రాకముందు బౌల్-అవుట్ నియమం ద్వారా మ్యాచ్ ఫలితాలను నిర్ణయించేవారు. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్‌లో సూపర్ ఓవర్‌కు బదులుగా పాత బౌల్-అవుట్ నియమాన్ని ఉపయోగిస్తున్నారు. దీని ప్రకారం రెండు జట్ల నుంచి ఐదుగురు బౌలర్లు ఒక్కొక్కరు ఒక బంతిని వేసి ఎంత మంది వికెట్లను కొట్టగలరో దాని ఆధారంగా మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయిస్తారు. దీని ప్రకారం జరిగిన సౌతాఫ్రికా-వెస్ట్ ఇండీస్ మధ్య జరిగిన బౌల్-అవుట్‌లో వెస్ట్ ఇండీస్ ఛాంపియన్స్ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. సౌత్ ఆఫ్రికా ఛాంపియన్స్ బౌలర్లు 2 సార్లు వికెట్లను కొట్టి మ్యాచ్‌ను గెలుచుకున్నారు.
Bowl-Out Decides SA vs WI Thriller 🍿
You can’t write this drama! After the match ended in a tie, South Africa Champions edge out the Windies Champions 2-0 in a tense bowl-out 🎯#WCL2025 pic.twitter.com/lemLX9R0Ac
— FanCode (@FanCode) July 19, 2025
వెస్ట్ ఇండీస్ ఛాంపియన్స్ ప్లేయింగ్ 11: డ్వేన్ స్మిత్, క్రిస్ గేల్ (కెప్టెన్), కీరన్ పొలార్డ్, విలియం పర్కిన్స్, చాడ్విక్ వాల్టన్ (వికెట్ కీపర్), లెండ్ల్ సిమన్స్, డ్వేన్ బ్రావో, ఆష్లే నర్స్, షెల్డన్ కాట్రెల్, ఫిడెల్ ఎడ్వర్డ్స్, సులైమాన్ బెన్.
సౌత్ ఆఫ్రికా ఛాంపియన్స్ ప్లేయింగ్ 11: ఎబి డివిలియర్స్ (కెప్టెన్), హాషిమ్ ఆమ్లా, మోర్నే వ్యాన్ వైక్ (వికెట్ కీపర్), జేజే స్మట్స్, సరెల్ ఎర్వీ, క్రిస్ మోరిస్, జీన్-పాల్ డుమిని, వేಯ್న్ పార్నెల్, హార్డస్ విల్జోయెన్, డువాన్నే ఒలివియర్, ఆరన్ ఫాంగిసో.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




