టీమ్ అంటే ఇలా ఉండాలి.. 2027 వన్డే వరల్డ్ కప్ కొట్టాలంటే సరైన జట్టు!

2027 వన్డే ప్రపంచకప్ కోసం మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తన టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ ఆటగాళ్లకు చోటు కల్పించాడు. బలమైన బ్యాటింగ్, పేస్ బౌలింగ్ కలయికతో జాఫర్ ఎంపిక చేసిన జట్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

టీమ్ అంటే ఇలా ఉండాలి.. 2027 వన్డే వరల్డ్ కప్ కొట్టాలంటే సరైన జట్టు!
2027 World Cup Team India

Updated on: Jul 28, 2026 | 1:35 PM

2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ, మాజీ భారత క్రికెటర్ వసీం జాఫర్ ఇప్పటికే తన డ్రీమ్ టీమ్‌ను ప్రకటించాడు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నీ కోసం అనుభవజ్ఞులు, స్టార్ ఆటగాళ్లతో కూడిన బలమైన జట్టును ఎంపిక చేశాడు. వసీం జాఫర్ ఎంపిక చేసిన జట్టులో కెప్టెన్‌గా రోహిత్ శర్మకు చోటు దక్కగా, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ విభాగంలో స్థానం సంపాదించారు. వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేసిన జాఫర్, ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌లపై విశ్వాసం వ్యక్తం చేశాడు.

బౌలింగ్ విభాగంలో ప్రపంచ స్థాయి పేసర్లైన జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్‌లకు చోటు కల్పించాడు. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్‌ను ఎంపిక చేయడం ద్వారా అనుభవం, వైవిధ్యానికి ప్రాధాన్యం ఇచ్చాడు. మొత్తం మీద బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండ్ సమతుల్యతతో కూడిన జట్టును జాఫర్ రూపొందించినట్లు కనిపిస్తోంది. 2027 వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు జరగనుంది. ఈసారి మొత్తం 14 జట్లు టోర్నీలో పాల్గొననున్నాయి. ఆతిథ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వేలకు నేరుగా అర్హత లభించగా, మిగతా జట్లు వన్డే ర్యాంకింగ్స్, క్వాలిఫయింగ్ టోర్నీల ఆధారంగా ఎంపిక కానున్నాయి.

ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లాండ్ వంటి అగ్ర జట్లు ప్రపంచకప్‌కు బలమైన పోటీదారులుగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, వసీం జాఫర్ ప్రకటించిన జట్టుపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. కొందరు యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతుండగా, మరికొందరు అనుభవజ్ఞులే ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో విజయానికి కీలకమని చెబుతున్నారు.

వసీం జాఫర్ ఎంపిక చేసిన భారత్ ప్లేయింగ్ XI

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us