
IPL 2026 : ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ దూసుకుపోతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 82 పరుగుల భారీ తేడాతో ఓడించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం వాషింగ్టన్ సుందర్ కొట్టిన ఆ అద్భుతమైన సిక్సర్. ఏకంగా గ్రౌండ్‌పై కూర్చుని మరీ కొట్టిన ఆ షాట్‌ను చూసి స్టేడియం మొత్తం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. గుజరాత్ ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో ఈ వింత దృశ్యం చోటుచేసుకుంది. ఇషాన్ మలింగ వేసిన లో-ఫుల్ టాస్ బంతిని వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా డీల్ చేశాడు. దాదాపు నేలపై కూర్చుని, ఆ బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా ఫ్లాట్ సిక్సర్‌గా మలిచాడు. ఈ షాట్ చూసిన గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లంతా డగౌట్‌లో లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. క్రికెట్ చరిత్రలోనే ఇది ఒక అత్యంత అరుదైన, క్రియేటివ్ షాట్ అని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
టాస్ గెలిచిన గుజరాత్ మొదట బ్యాటింగ్ చేపట్టింది. పిచ్ బ్యాటింగ్‌కు అంత సులభంగా లేకపోయినా, సాయి సుదర్శన్ (61) ఎంతో పరిణతితో ఆడాడు. మరోవైపు వాషింగ్టన్ సుందర్ కేవలం 33 బంతుల్లోనే 50 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరి వీరోచిత పోరాటంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. వికెట్ కష్టంగా ఉంది, అందుకే చివరి వరకు క్రీజులో ఉండాలని ప్లాన్ చేశామని మ్యాచ్ అనంతరం సుందర్ చెప్పుకొచ్చాడు.
Improvisation at its best 🤌
🎥 Washington Sundar put on a show in Ahmedabad 💥
Scorecard ▶️ https://t.co/o2tKKCeEaH#TATAIPL | #KhelBindaas | #GTvSRH | @gujarat_titans | @Sundarwashi5 pic.twitter.com/eh4vIN4eFW
— IndianPremierLeague (@IPL) May 12, 2026
169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరంభం నుంచే తడబడింది. గుజరాత్ బౌలర్లు కగిసో రబాడ (3/28), జేసన్ హోల్డర్ (3/20) నిప్పులు చెరిగే బంతులతో హైదరాబాద్ బ్యాటర్లను వణికించారు. పవర్‌ప్లే ముగిసేసరికే హైదరాబాద్ 60 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత కోలుకోలేకపోయిన ఆరెంజ్ ఆర్మీ కేవలం 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది.
ఈ గెలుపుతో గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. టీమ్ వర్క్, పక్కా ప్లానింగ్ తో గుజరాత్ ఇప్పుడు ఐపీఎల్ 2026లో అత్యంత బలమైన జట్టుగా కనిపిస్తోంది. రబాడ, సిరాజ్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు నెట్స్‌లో ఎదుర్కోవడం వల్లే తమ బ్యాటింగ్ మెరుగుపడిందని సుందర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. హైదరాబాద్‌ను చిత్తు చేసిన గుజరాత్, ఇప్పుడు టైటిల్ రేసులో అందరికంటే ముందు వరుసలో నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..