Virat Kohli Salary: ఐపీఎల్ స్టార్ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకరు. ఈ టోర్నమెంట్‌లో కోహ్లీ ఎంతో ప్రభావాన్ని చూపిస్తున్నాడు. అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున అరంగేట్రం చేసినప్పటి నుంచి, అతను ఫ్రాంచైజీకి అత్యంత ముఖ్యమైన ఆటగాడిగా ఉన్నాడు. అందుకే ఆర్‌సీబీ అతన్ని ఎప్పుడూ వదలకుండా, అతని జీతం ఏడాదికేడాది పెంచుతూనే ఉంది. ఈ సీజన్‌కు అతన్ని రూ.21 కోట్లకు అట్టిపెట్టుకున్నారు. కానీ, తాజా నివేదిక ప్రకారం, కోహ్లీకి కేవలం రూ.13 కోట్లు మాత్రమే లభిస్తాయంట. అంటే, అతని జీతం నుంచి రూ.8 కోట్లు తగ్గించిందంట. దీని వెనుక కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
నిజానికి, ఆదాయపు పన్ను చట్టం, 1961 నిబంధనల ప్రకారం, IPL ఆదాయాలను “వ్యాపారం లేదా వృత్తి నుంచి వచ్చే ఆదాయం”గా లెక్కిస్తారు. కాబట్టి, ఈ ఆదాయం అత్యధిక పన్ను పరిధిలోకి వస్తుంది. దీని అర్థం కోహ్లీ ఆదాయం రూ.15 లక్షల కంటే ఎక్కువగా ఉండటంతో, అతను తన జీతం రూ.21 కోట్లపైగా అంటే 30% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రకారం, పన్ను రూ.6.3 కోట్లు వస్తుంది.
5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే, పన్నుతో పాటు, 25% సర్‌ఛార్జ్ కూడా చెల్లించాలి. దీని ప్రకారం, అతని జీతం నుంచి మరో రూ.1.575 కోట్లు తగ్గించబడతాయి. ఆ తరువాత, అతను మొత్తం పన్నుపై 4% సెస్ గా విడిగా రూ. 31 లక్షలు చెల్లించాలి. ఈ విధంగా, కోహ్లీ జీతం నుంచి మొత్తం రూ.8.185 కోట్లు తగ్గించబడుతుంది. దీంతో కోహ్లీకి రూ.12.815 కోట్లు (సుమారు రూ.13 కోట్లు) మాత్రమే లభిస్తాయి.
విరాట్ కోహ్లీ 2008 సంవత్సరంలో ఐపీఎల్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆ సమయంలో అతని జీతం కేవలం రూ. 12 లక్షలు మాత్రమే. 3 సీజన్ల తర్వాత, 2011లో అది 8.28 కోట్లకు పెరిగింది. కాగా, 2014 నుంచి 2017 వరకు అతని జీతం రూ. 12 కోట్లు కాగా, 2018 నుంచి 2021 వరకు అది రూ. 17 కోట్లకు చేరుకుంది. అతను 2022 నుంచి 2024 వరకు రూ. 15 కోట్లు సంపాదించాడు. ఇప్పుడు అతని జీతం రూ. 21 కోట్లు అయింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..