
Virat Kohli : ఐపీఎల్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌లోనే కింగ్ కోహ్లీ తన విశ్వరూపం చూపించాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన పోరులో విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 39 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు చేసి అజేయంగా నిలవడమే కాకుండా, తన జట్టుకు ఘనవిజయాన్ని అందించాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న ఒక భారీ రికార్డును బద్దలు కొట్టి, ప్రపంచ క్రికెట్‌లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో సరికొత్త చరిత్ర సృష్టించాడు.
4000 పరుగుల మైలురాయి
ఐపీఎల్ చరిత్రలో ఛేజింగ్ సమయంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకున్నాడు. ఇప్పటివరకు ఏ ఇతర ఆటగాడూ ఛేజింగ్‌లో 3500 పరుగుల మార్కును కూడా తాకలేకపోయారు. కానీ విరాట్ కోహ్లీ ఏకంగా 4000 పరుగుల మార్కును దాటి ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లేయర్‌గా నిలిచాడు. రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ వంటి దిగ్గజాలు కూడా ఈ విషయంలో విరాట్ వెంటే ఉన్నారు కానీ అతని దరిదాపుల్లో ఎవరూ లేరు. తన 19 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌లో నిలకడకు మారుపేరుగా నిలుస్తూ ఈ ఘనత సాధించాడు.
రోహిత్ శర్మ రికార్డు బద్దలు
విరాట్ కోహ్లీ కేవలం ఛేజింగ్‌లోనే కాదు, ఒకే స్టేడియంలో అత్యధిక పరుగులు చేసిన విషయంలోనూ రోహిత్ శర్మను వెనక్కి నెట్టాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఛేజింగ్ సమయంలో రోహిత్ శర్మ పేరిట ఉన్న 1265 పరుగుల రికార్డును, కోహ్లీ తన 69 పరుగుల ఇన్నింగ్స్ ద్వారా అధిగమించాడు. ప్రస్తుతం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో విరాట్ ఛేజింగ్‌లో చేసిన పరుగులు 1288 కి చేరాయి. ఒకే వేదికపై రెండో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ ఇప్పుడు అగ్రస్థానంలో నిలిచాడు. ఇది విరాట్‌కు తన హోమ్ గ్రౌండ్‌పై ఉన్న పట్టును మరోసారి నిరూపించింది.
హాఫ్ సెంచరీల హ్యాట్రిక్
చిన్నస్వామి స్టేడియంలో ఛేజింగ్ చేసేటప్పుడు కోహ్లీకి ఇది 10వ సారి 50 కంటే ఎక్కువ పరుగులు చేయడం. ఐపీఎల్ చరిత్రలో ఒకే స్టేడియంలో ఛేజింగ్ సమయంలో 10 సార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మ (వాంఖడే) సరసన విరాట్ చేరాడు. అంతేకాకుండా, ఐపీఎల్ మొత్తంగా చూసుకుంటే ఒకే స్టేడియంలో అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు, అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రికార్డు కూడా విరాట్ కోహ్లీ పేరు మీదనే ఉంది. 37 ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా పరిగెడుతూ, అద్భుతమైన షాట్లతో అలరించిన విరాట్, ఆర్సీబీ టైటిల్ డిఫెన్స్‌ను ఘనంగా ప్రారంభించాడు.
ఆర్సీబీ కోటలో సన్‌రైజర్స్ చిత్తు
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 202 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ జోడీ ఆ లక్ష్యాన్ని చాలా చిన్నదిగా మార్చేశారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పడిక్కల్ 25 బంతుల్లో 61 పరుగులు చేసి ఔట్ అయినప్పటికీ, విరాట్ మాత్రం చివరి వరకు క్రీజులో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మ్యాచ్ ముగిసే సమయానికి ఇంకా 27 బంతులు మిగిలి ఉండటం ఆర్సీబీ ఆధిపత్యానికి అద్దం పడుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీకి ఇది ఒక ఊపునిచ్చే విజయం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..