Video: తొలుత బ్యాట్‌తో బీభత్సం.. ఆ తర్వాత ‘పుష్ప’ స్టైల్‌తో పిచ్చెక్కించిన వైభవ్ సూర్యవంశీ..

Vaibhav Suryavanshi Pushpa Celebration Video: మొత్తానికి, వైభవ్ సూర్యవంశీ రూపంలో భారత్‌కు మరో విధ్వంసకర ఓపెనర్ దొరికాడని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే జోరు కొనసాగిస్తే భవిష్యత్తులో టీమిండియా సీనియర్ జట్టులో కూడా అతను కీలక ఆటగాడిగా మారడం ఖాయం.

Video: తొలుత బ్యాట్‌తో బీభత్సం.. ఆ తర్వాత పుష్ప స్టైల్‌తో పిచ్చెక్కించిన వైభవ్ సూర్యవంశీ..
Vaibhav Suryavanshi Pushpa Celebration Video

Updated on: Jan 08, 2026 | 7:05 AM

Vaibhav Suryavanshi Pushpa Celebration: భారత క్రికెట్‌లో మరో అద్భుత నక్షత్రం ఉదయించింది. కేవలం 14 ఏళ్ల వయసులోనే మైదానంలో పరుగుల విధ్వంసం సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ, తాజాగా దక్షిణాఫ్రికా గడ్డపై అరివీర భయంకరమైన సెంచరీతో చరిత్ర సృష్టించాడు. అండర్-19 జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి సిరీస్‌లోనే జట్టును విజయపథంలో నడిపించడమే కాకుండా, తనదైన శైలిలో ‘పుష్ప’ మేనరిజంతో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు.

దక్షిణాఫ్రికా గడ్డపై భారత అండర్-19 జట్టు అప్రతిహత విజయయాత్రను కొనసాగిస్తోంది. బెనోని వేదికగా జరిగిన మూడో వన్డేలో యువ భారత్ 233 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ అద్భుత విజయానికి సారథి వైభవ్ సూర్యవంశీ ఆడిన మెరుపు ఇన్నింగ్సే ప్రధాన కారణం.

రికార్డుల సెంచరీ..

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ కేవలం 63 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మొత్తం 74 బంతులు ఎదుర్కొన్న వైభవ్, 9 ఫోర్లు, 10 భారీ సిక్సర్ల సాయంతో 127 పరుగులు చేశాడు. యూత్ వన్డే క్రికెట్ చరిత్రలో సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా వైభవ్ అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

‘తగ్గేదే లే’ అంటూ పుష్ప సెలబ్రేషన్: వైభవ్ తన సెంచరీ మైలురాయిని చేరుకున్న వెంటనే, మైదానంలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాలోని ‘తగ్గేదే లే’ (Pushpa Celebration) మేనరిజం చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం బ్యాటింగ్‌లోనే కాకుండా, మైదానంలో తన కాన్ఫిడెన్స్‌తో నెటిజన్లను ఫిదా చేస్తున్నాడు ఈ యువ సంచలనం.

భారీ స్కోరు.. ఘోర పరాజయం..

వైభవ్ (127)తో పాటు మరో ఓపెనర్ ఆరోన్ జార్జ్ (118) కూడా సెంచరీతో మెరవడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 393 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 394 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. కేవలం 35 ఓవర్లలో 160 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి ప్రోటీస్ బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టించారు.

ఐదు దేశాల్లో సెంచరీలు..

వైభవ్ సూర్యవంశీ ప్రతిభ ఒక్క దేశానికే పరిమితం కాలేదు. కేవలం 14 ఏళ్లకే భారత్, యూఏఈ, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇప్పుడు దక్షిణాఫ్రికాలో సెంచరీలు సాధించి తన సత్తా చాటాడు. రాబోయే అండర్-19 ప్రపంచకప్‌కు ముందు వైభవ్ ఇలాంటి ఫామ్‌లో ఉండటం భారత జట్టుకు పెద్ద కలిసొచ్చే అంశం.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.