ప్రపంచంలో ఎక్కడ చదివినా ఖర్చంతా నాదే.. బాస్ బేబీకి ఐపీఎల్ ఫౌండర్ బంపర్ ఆఫర్..!

Vaibhav Sooryavanshi Scholarship: రాజస్థాన్ రాయల్స్ టోర్నీ నుంచి వైదొలిగినప్పటికీ, వైభవ్ సూర్యవంశీ రూపంలో భారత క్రికెట్‌కు ఒక ధ్రువతార లభించింది. ఆటతో పాటు చదువులోనూ రాణించేందుకు లలిత్ మోదీ వంటి దిగ్గజం అందించిన ఈ స్కాలర్‌షిప్ ఆఫర్, భవిష్యత్తులో ఈ యువ సంచలనం మరిన్ని శిఖరాలను అధిరోహించడానికి ఖచ్చితంగా దోహదపడుతుంది.

ప్రపంచంలో ఎక్కడ చదివినా ఖర్చంతా నాదే.. బాస్ బేబీకి ఐపీఎల్ ఫౌండర్ బంపర్ ఆఫర్..!
Vaibhav Sooryavanshi Scholarship

Updated on: May 30, 2026 | 2:24 PM

Vaibhav Sooryavanshi Scholarship: ఐపీఎల్ 2026 సీజన్‌లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా ఈ బుడతడి అద్భుత ఆటతీరుకు ముగ్ధుడైన ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ, ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయంలో ఉచితంగా చదువుకునేందుకు పూర్తి స్థాయి స్టడీ స్కాలర్‌షిప్‌ను ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

గుజరాత్ బౌలర్లపై వైభవ్ ‘సూర్య’ ప్రతాపం..!

ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2 పోరులో గుజరాత్ టైటాన్స్ బౌలింగ్‌ను వైభవ్ సూర్యవంశీ చీల్చిచెండాడాడు. కేవలం 47 బంతుల్లోనే 96 పరుగులు చేసి సెంచరీకి కేవలం 4 పరుగుల దూరంలో అవుటయ్యాడు. ఈ సీజన్‌లో వైభవ్‌కు ఇది ఆరో హాఫ్ సెంచరీ కాగా, గత నాలుగు ఇన్నింగ్స్‌లలోనే మూడోసారి 90 పరుగుల మార్కు దాటడం విశేషం. ఈ అద్భుత ఇన్నింగ్స్ ద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో, అత్యంత వేగంగా (ఎదుర్కొన్న బంతుల పరంగా) 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా వైభవ్ రికార్డులకెక్కాడు.

ప్రతిభ చదువుకు దూరం కాకూడదు: లలిత్ మోదీ..

వైభవ్ సూర్యవంశీ అవుటైన వెంటనే ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక భావోద్వేగ పోస్ట్ చేశారు. వైభవ్ సాధించిన 96 పరుగులు వంద పరుగుల కంటే చాలా గొప్పవని కొనియాడారు. భయమంటే తెలియని ఒక యువ ప్రతిభ దేశాన్ని ఎలా నిద్రలేపిందో వైభవ్ నిరూపించాడని మోదీ పేర్కొన్నారు.

క్రీడలు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, జీవితాలను మార్చే అవకాశాలను సృష్టించాలని తాను నమ్ముతానని మోదీ అన్నారు. అందుకే వైభవ్ ప్రపంచంలో ఏ కాలేజీ లేదా విశ్వవిద్యాలయంలో చదువుకోవాలనుకున్నా, దానికి అయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని ప్రకటించారు. ఒక అద్భుతమైన ప్రతిభ చదువుకు, గొప్పతనానికి మధ్య ఏదో ఒకదాన్నే ఎంచుకోవాల్సిన పరిస్థితి రాకూడదని ఆయన ఆకాంక్షించారు.

రికార్డుల వేటలో క్రిస్ గేల్‌నే దాటేశాడు..!

కేవలం 15 ఏళ్ల వయసులోనే తన రెండో ఐపీఎల్ సీజన్ ఆడుతున్న వైభవ్, దిగ్గజాల రికార్డులను సైతం బద్దలు కొడుతున్నాడు. అంతకుముందు జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు బాదిన ఈ కుర్రాడు, ఈ సీజన్‌లో తన సిక్సర్ల సంఖ్యను 65కి చేర్చాడు. తద్వారా ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డును వైభవ్ తుడిచిపెట్టేశాడు.

పోరాడి ఓడిన రాజస్థాన్ రాయల్స్..

వైభవ్ సూర్యవంశీ అసాధారణ పోరాటం చేసినప్పటికీ, రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫైనల్ చేరడంలో విఫలమైంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ అద్భుతంగా రాణించడంతో రాజస్థాన్ బౌలర్లు ఆ పరుగులను కాపాడుకోలేకపోయారు. రియాన్ పరాగ్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ ఈ ఓటమితో టోర్నీలో మూడో స్థానంతో సరిపెట్టుకుని ఫైనల్ రేసు నుండి నిష్క్రమించింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us