
Dope Test: భారతదేశంలో డోప్ టెస్టులకు (Dope Test) సంబంధించి గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. గతంలో టీమ్ ఇండియా ఓపెనర్ పృథ్వీ షా కూడా డోప్ టెస్టులో ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, తను కావాలని ఉత్ప్రేరకాలు తీసుకోలేదని, తెలియక తప్పుడు మందు వాడటం వల్లే ఆ సమస్య వచ్చిందని ఆయన వివరణ ఇచ్చాడు. తాజాగా, మరో ఇద్దరు భారత క్రీడాకారులు డోప్ టెస్టులో పాజిటివ్‌గా తేలి వార్తల్లో నిలిచారు.
డోప్ టెస్టులో పట్టుబడిన ఫాస్ట్ బౌలర్ ఉత్తరాఖండ్‌కు చెందిన ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ రాజన్ కుమార్ డోప్ టెస్టులో పాజిటివ్‌గా తేలినట్లు ‘నాడా’ (NADA – జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ) ప్రకటించింది. దీంతో ఈ 29 ఏళ్ల పేసర్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. రాజన్ కుమార్ నుంచి సేకరించిన శాంపిల్స్‌లో ‘అనాబాలిక్ స్టెరాయిడ్స్’ (Drostanolone, Metenolone) తో పాటు ‘క్లోమిఫీన్’ అనే నిషేధిత పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా మహిళల్లో సంతానలేమి చికిత్సకు వాడే క్లోమిఫీన్, పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచి క్రీడా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. గతంలో మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ అన్షులా రావు కూడా ఇలాగే డోప్ టెస్టులో చిక్కుకున్నాడు.
తమిళనాడుకు చెందిన మహిళా స్ప్రింటర్ ధనలక్ష్మి కూడా ఈ టెస్టులో ఫెయిల్ అయ్యారు. ఆమె ఇలా పట్టుబడటం ఇది రెండోసారి. 2022లో ఆమెపై మూడేళ్ల నిషేధం విధించగా, 2025లో తిరిగి మైదానంలోకి వచ్చిన వెంటనే మళ్లీ డోపింగ్‌లో చిక్కారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 22 నుంచి ఆమెపై ఏకంగా 8 ఏళ్ల నిషేధం విధించారు. ఇంత సుదీర్ఘ కాలం నిషేధం అంటే ఆమె కెరీర్ దాదాపు నాశనమైనట్లేనని చెప్పాలి.
భారతదేశంలో డోపింగ్ నియంత్రణ బాధ్యతలను ‘నాడా’ (NADA) నిర్వహిస్తుంది. ఇది భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలో 2005లో స్థాపించబడింది. ఈ సంస్థ ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (WADA) నిబంధనల ప్రకారం పనిచేస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో ‘వాడా’ ఎలాగైతే నిఘా ఉంచుతుందో, భారత్ లోపల ‘నాడా’ అలా పనిచేస్తుంది. క్రీడాకారులు తీసుకునే ఆహారం లేదా సప్లిమెంట్లలో ఏదైనా నిషేధిత అంశం ఉన్నట్లు తేలితే, కేసు తీవ్రతను బట్టి వారికి శిక్ష విధిస్తారు.
లిస్టులో ఉన్న ప్రముఖులు భారత్‌లో డోప్ టెస్టులో పట్టుబడిన వారిలో పెద్ద పేర్లే ఉన్నాయి. క్రికెటర్లు పృథ్వీ షా, అన్షులా రావుతో పాటు కుస్తీ వీరులు నర్సింగ్ యాదవ్, బజరంగ్ పునియా వంటి వారు కూడా ఈ వివాదాల్లో చిక్కుకున్నారు. పృథ్వీ షా కేసులో, ఆయన తీసుకున్న దగ్గు మందులో నిషేధిత అంశం ఉండటంతో 2019లో ఆయనపై ఎనిమిది నెలల నిషేధం విధించారు. ఆ సమయంలో బీసీసీఐ నేరుగా నాడా పరిధిలోకి రాకపోయినప్పటికీ, అంతర్గత విచారణ తర్వాత ఈ చర్య తీసుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..