మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. హెచ్‌సీఏ అధ్యక్ష పదవి నుంచి అజారుద్దీన్ దిగిపోవాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కొన్ని నెలల క్రితం ప్రెసిడెంట్ పదవి నుంచి అజారుద్దీన్‌ను అపెక్స్ కౌన్సిల్ సస్పెండ్ చేసింది. అపెక్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంపై అంబుడ్స్ మెన్ దీపక్ వర్మ తో కలిసి అజారుద్దీన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
ఫిబ్రవరి 26, 2020లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై అపెక్స్ కౌన్సిల్ వేటు వేసింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉండటం, హెచ్‌సీఏ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి కారణాలతో హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ అధ్యక్షుడు అజార్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న తనకు నోటీసులు ఇవ్వడంపై మహమ్మద్ అజహరుద్దీన్ మీడియా సమావేశం నిర్వహించి అపెక్స్ కౌన్సిల్‌పై మండిపడ్డారు. అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు నోటీసులు ఇచ్చే హక్కు లేదని చెప్పారు. కౌన్సిల్‌లో మెజారిటీ లేకుండా సమావేశాలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. కొందరు బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
లోధా సిఫార్సుల మేరకే నోటిసులు ఇచ్చామని అపెక్స్ కౌన్సిల్ స్పష్టం చేసింది. కౌన్సిల్‌లో వర్గాలు ఉన్నాయని అజహరుద్దీన్ అనడం సరికాదని చెప్పింది. వీలైతే ఆయన కోర్టుకు వెళ్లి పోరాటం చేసుకోవచ్చని తెలిపింది. ఈ విషయంలో బీసీసీఐ జోక్యం ఉండదని తేల్చి చెప్పింది. దీంతో అజారుద్దీన్ సుప్రీకోర్టు వెళ్లాడు. అయితే సుప్రీం కోర్టు అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాన్ని సమర్థించింది. హెచ్‌సీఏ అధ్యక్ష పదవి నుంచి అజారుద్దీన్ దిగిపోవాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.