Gautam Gambhir: గంభీర్ కోచ్ పదవికి గండం.. టీమిండియా అక్కడా విఫలమైతే ఇంటికేనా..?
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. గంభీర్ ఎకపక్ష నిర్ణయాలతో కొందరు ఆటగాళ్లు బీసీసీఐ కి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అంతే కాదు న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ఓటమిపై కూడా రోహిత్ శర్మ గంభీర్ గురించి బీసీసీఐ కి ఫిర్యాదు చేశాడట. దీంతో రానున్న ఆసీస్ పర్యటనలో టీమిండియా టెస్టు సిరీస్ గెలవకపోతే గంభీర్ పై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది.
స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన 3 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను టీమిండియా వైట్ వాష్ అవడంతో రోహిత్ సేన విమర్శల పాలయిన సంగతి తెలిసిందే. దేశ క్రికెట్ చరిత్రలో మొదటి సారి టీమిండియా భారీ ఓటమిని చవిచూసింది. ఈ ఘోర ఓటమిపై పోస్టుమార్టం చేయడానికి బీసీసీఐ సుదీర్ఘంగా ఆరు గంటల పాటు సమీక్ష నిర్వహించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గంభీర్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అగార్కర్‌ను బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశంలో గౌతమ్ గంభీర్‌పై రోహిత్ శర్మ పలు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. ఆఖరి టెస్టుకి ముంబయి పిచ్‌ను గంభీర్ మార్పించడంపై కూడా సమావేశంలో మండిపడినట్లు తెలుస్తోంది. రెండో టెస్టులో విఫలమైనప్పటికీ మూడో టెస్టులోనూ స్పిన్ పిచ్‌ను ఎందుకు సిద్ధం చేశారు? ఆ మ్యాచ్‌లో బుమ్రాను ఎందుకు తప్పించారు? ఇక ఆస్ట్రేలియా పర్యటనకు ప్రణాళికలు ఏంటి? అని గంభీర్-రోహిత్‌ను బీసీసీఐ ప్రశ్నించింది.
జట్టు ఎంపికలో గౌతమ్ గంభీర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఇప్పటికే పలు వార్తలు వెలువడగా.. బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియా వెళ్లనున్న జట్టు సెలక్షన్ పై కూడా బీసీసీఐ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా టూర్‌కి జట్టుని కూడా గంభీర్‌కి నచ్చినట్లే ఎంపిక చేశాడని ఆరోపణలు వినిపించాయి. దాంతో జట్టు ఎంపికపై ఇప్పటికే గుర్రుగా ఉన్న రోహిత్ శర్మ.. గంభీర్‌పై అవకాశం రాగానే కోచింగ్ శైలితో పాటు అన్ని విషయాల్ని రివ్యూలో చెప్పినట్లు తెలుస్తోంది.
ఇక ఈ సమీక్షతో సంబంధం లేకుండా గంభీర్‌పై బీసీసీఐకి భారత జట్టులోని కీలక ఆటగాళ్లు ఫిర్యాదు చేశారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆటగాళ్ల పేర్లను పేర్కొనకుండా జట్టులోని ప్రధాన సీనియర్లు ఈ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. జట్టు వ్యూహాల్లో గంభీర్‌తో విభేదాలు వస్తున్నట్లు సీనియర్లు పేర్కొన్నారని రాసుకొచ్చాయి.
ఒకవేళ ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ జట్టు విఫలమైతే.. గౌతమ్ గంభీర్‌ను తొలుత టీమ్ వన్డే, టీ20 కోచింగ్ బాధ్యతల నుంచి తప్పిస్తామని హెచ్చరించినట్లు తెస్తోంది. ఆస్ట్రేలియా టూర్‌లో భారత్ జట్టు విఫలమైతే వన్డే, టీ20 కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోందట. టెస్టులకి మాత్రం గౌతమ్ గంభీర్‌ను కొన్నాళ్లు కొనసాగించి ప్రత్యామ్నాయం గురించి ఆలోచించబోతున్నట్లు తెలుస్తోంది.