U19 Womens World Cup: అండర్‌ 19 మహిళల ప్రపంచకప్‌లో తెలుగు తేజాలు.. సౌతాఫ్రికా ఫ్లైట్‌ ఎక్కనున్న త్రిష, షబ్నమ్‌

|

Dec 05, 2022 | 4:49 PM

ఆదివారం జరిగిన నాలుగో టీ20లో త్రిష (39; 6 ఫోర్లు, ఒక సిక్సర్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించింది. కాగా ఇప్పుడు ఈ అమ్మాయికి మరో అదృష్టం వరించింది.

U19 Womens World Cup: అండర్‌ 19 మహిళల ప్రపంచకప్‌లో తెలుగు తేజాలు.. సౌతాఫ్రికా ఫ్లైట్‌ ఎక్కనున్న త్రిష, షబ్నమ్‌
Gongadi Trisha, Shabnam
Follow us on

గొంగడి త్రిష.. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తున్న పేరు. తెలంగాణలోని భద్రాచలంకు చెందిన ఈ అమ్మాయి ఇటీవల అండర్‌19 జాతీయ మహిళల క్రికెట్‌ జట్టుకు ఎంపికైంది. తద్వారా మిథాలీ రాజ్‌ తర్వాత భారత జట్టులో స్థానం దక్కించుకొన్న తెలంగాణ క్రీడాకారిణిగా త్రిష అరుదైన ఘనత సాధించింది. ప్రస్తుతం ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో మన తెలుగమ్మాయి అదరగొడుతోంది. ఆదివారం జరిగిన నాలుగో టీ20లో త్రిష (39; 6 ఫోర్లు, ఒక సిక్సర్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించింది. కాగా ఇప్పుడు ఈ అమ్మాయికి మరో అదృష్టం వరించింది. ఐసీపీ మొదటిసారిగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న అండర్‌19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భద్రాచలం అమ్మాయి భాగం కానుంది. దక్షిణాఫ్రికా వేదికగా జరిగే ఈ టోర్నీ కోసం భారత మహిళల జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఇందులో గొంగడి త్రిషకు కూడా స్థానం లభించింది. టీమిండియా సెన్సేషనల్‌ ఓపెనర్‌ షెఫాలీ వర్మ ఈ జట్టకు కెప్టెన్‌గా వ్యవహరించనుంది.

ఎనిమిదేళ్ల వయసులోనే..

ఇక త్రిష విషయానికొస్తే.. ఎనిమిదేళ్ల వయసులో అండర్‌- 16 క్రికెట్‌ జట్టుకు ఎంపికైంది. ఆతర్వాత మరో నాలుగేళ్లకే అండర్‌-19 క్రికెట్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. అలాగే హైదరాబాద్‌ మహిళల క్రికెట్‌ జట్టులో 12 ఏళ్లకే స్థానం సంపాదించిన త్రిష చిన్న వయసులోనే బీసీసీఐ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు గెల్చుకొంది. బౌలింగ్‌.. బ్యాటింగ్‌లోనూ ఆల్‌రౌండ్‌ ప్రతిభ చూపుతున్న త్రిష లెగ్‌ స్పిన్నర్‌గా అమోఘంగా రాణిస్తోంది.

ఇవి కూడా చదవండి

విశాఖ అమ్మాయి కూడా..

కాగా విశాఖ పట్నానికి చెందిన ఎండీ షబ్నమ్‌ కూడా అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ జట్టులో స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మాయి కూడా ముంబై వేదికగా జరుగుతోన్న న్యూజిలాండ్‌ సిరీస్‌లో ఆడుతోంది. అండర్‌ 19 మహిళల టీ20 ప్రపంచకప్ జనవరి 14 నుంచి 29 వరకు జరగనుంది.

అండర్-19 మహిళల ప్రపంచకప్ జట్టు:

షెఫాలీ వర్మ (కెప్టెన్), శ్వేతా సెహ్రావత్ (వైస్ కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్) , గొంగడి త్రిష, సౌమ్య తివారీ, సోనియా మెహదియా, హర్లే గాలా (వికెట్ కీపర్), సోనమ్ యాదవ్, మన్నత్ కశ్యప్, అర్చన దేవి, ప్రశ్వి చోప్రా , టిటాస్ సాధు, ఫలక్ నాజ్, ఎండీ షబ్నమ్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..