Ind Vs Ban: మ్యాచూ పాయే.. పరువూ పాయే.. రోహిత్ శర్మ చేసిన ఆ ఒక్క తప్పిదంతో అంతా మటాష్..
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమిని చవి చూసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో చివరి వరకు పోరాడిన భారత్..
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమిని చవి చూసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో చివరి వరకు పోరాడిన భారత్.. ఒక్క వికెట్ తేడాతో బంగ్లాదేశ్‌పై ఓడిపోయింది. ఒకానొక సమయంలో రోహిత్ సేన ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తుందని అందరూ ఊహించారు. కాని చివరి వికెట్‌కు బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్లు 41 బంతుల్లో అజేయంగా 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఆ జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. అటు బంగ్లాదేశ్‌పై టీమిండియా ఓటమికి పేలవమైన బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో సహా అనేక కారణాలు ఉన్నాయి, కానీ ఎక్కడో రోహిత్ శర్మ కెప్టెన్సీ కూడా దీనికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. రోహిత్ శర్మ తన బౌలర్లను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం వల్లే జట్టు ఓటమిని చవి చూసింది.
ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆశ్చర్యకరమైన వ్యూహాన్ని అనుసరించి, వాషింగ్టన్ సుందర్‌కు కేవలం 5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ఇక్కడ విశేషమేంటంటే.. సుందర్ తాను వేసిన 5 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు, అయితే ఇంత అద్భుతమైన బౌలింగ్ చేసినప్పటికీ.. రోహిత్ అతడికి చివరి వికెట్ తీసే అవకాశాన్ని రోహిత్ ఇవ్వలేదు. బంగ్లాదేశ్ 11వ బ్యాటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్.. ఇక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు సుందర్ ఈజీగా చెక్ పెట్టగలడు. కానీ రోహిత్ వ్యూహం మాత్రం పూర్తిగా వేరు ఉంది.
షకీబ్‌ను పెవిలియన్‌కు పంపిన సుందర్:
ఈ మ్యాచ్‌లో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ షకీబ్ అల్ హసన్ వికెట్‌ను వాషింగ్టన్ సుందర్ తీశాడు. దీంతో పాటు లిటన్ దాస్ వికెట్ కూడా పడగొట్టాడు. సుందర్‌కు పిచ్ నుంచి మంచి సహకారం అందింది. ఒకవేళ రోహిత్ టెయిలెండర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను పెవిలియన్‌కు పంపేందుకు సుందర్‌ను ఉపయోగించి ఉన్నట్లయితే.. టీమిండియా విజయం సాధించేది.
గెలిచే మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది:
మ్యాచ్ గురించి మాట్లాడితే, భారత జట్టు బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. కేవలం 41.2 ఓవర్లలోనే 186 పరుగులకు టీమిండియా ఆలౌటైంది. కేఎల్ రాహుల్ 70 బంతుల్లో 73 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రోహిత్ శర్మ(27), శ్రేయాస్ అయ్యర్(24) ఫర్వాలేదనిపించారు. అయితే దీని తర్వాత భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టును విజయపధంలోకి తీసుకొచ్చారు. ఒక దశలో బంగ్లాదేశ్ 136 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో భారత్‌కు కేవలం ఒక వికెట్ మాత్రమే అవసరమైంది. కానీ పేలవమైన వ్యూహం, ఘోరమైన బౌలింగ్‌తో బంగ్లాదేశ్‌కు విజయం దక్కింది. మెహదీ హసన్- ముస్తఫిజూర్ రెహమాన్‌ల చారిత్రాత్మక భాగస్వామ్యం టీమ్‌ఇండియా ఓటమి చవి చూసేలా చేసింది. దీంతో వన్డే సిరీస్‌లో భారత్ 0-1తో వెనుకబడి ఉంది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే బుధవారం జరగనుంది.