
దేశవాళీ క్రికెట్‌లో పరుగులు వరద పారిస్తున్న ముంబై స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, టీమిండియాలో చోటు కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. తాజాగా, బుచ్చిబాబు ట్రోఫీలో ముంబై తరపున ఆడుతూ తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ XI (TNCA XI) జట్టుపై అద్భుతమైన శతకం సాధించాడు. తన సెంచరీతో అతను కేవలం జట్టును ఆదుకోవడమే కాకుండా, తనను నిలకడగా పక్కన పెడుతున్న జాతీయ సెలక్టర్లకు గట్టి సమాధానం పంపాడు.
మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే, బుచీ బాబు ట్రోఫీలో భాగంగా జరిగిన తొలి రోజు ఆటలో ముంబై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ముంబైకి ఆశించిన శుభారంభం దక్కలేదు. ముషిర్ ఖాన్ (30), ఆయుష్ మాత్రే (13) త్వరగా అవుటయ్యారు. ఆ తర్వాత వచ్చిన హర్ష్ అఘావ్ (2) కూడా నిరాశపరిచాడు. ఈ సమయంలో జట్టు 98 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పుడే క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్, సువేద్ పార్కర్‌తో కలిసి జట్టును నిలబెట్టాడు.
ప్రతికూల పరిస్థితుల్లో కూడా సర్ఫరాజ్ తన సహజసిద్ధమైన దూకుడుతో బ్యాటింగ్ చేశాడు. తమిళనాడు బౌలర్లను లక్ష్యంగా చేసుకుని స్కోరు వేగాన్ని పెంచాడు. పార్కర్ ఒకవైపు నెమ్మదిగా ఆడుతూ భాగస్వామ్యాన్ని అందించగా, సర్ఫరాజ్ మాత్రం బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కేవలం 92 బంతుల్లోనే అతను తన శతకాన్ని పూర్తి చేసుకుని, ఒక బలమైన సందేశాన్ని పంపాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 10 ఫోర్లు, 6 సిక్సర్లు బాదడం విశేషం.
సర్పరాజ్ ఈ మ్యాచ్‌లో 114 బంతుల్లో 138 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. అతని ఇన్నింగ్స్‌తో ముంబై 300 పరుగుల మార్కును సునాయసంగా దాటింది. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో సర్ఫరాజ్‌కు ఇది 16వ శతకం. అతను గత మూడు రంజీ సీజన్లలో 100కు పైగా సగటుతో పరుగులు సాధిస్తున్నాడు. అయినప్పటికీ, వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌కు కూడా అతన్ని ఎంపిక చేయకపోవడంపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. బుచ్చిబాబు ట్రోఫీలో సర్ఫరాజ్ ప్రదర్శన, రాబోయే దేశవాళీ సీజన్‌కు మంచి ఆరంభాన్ని ఇచ్చింది.
గతంలోనూ అనేక సందర్భాల్లో సర్ఫరాజ్ తన బ్యాట్‌తోనే జవాబిచ్చాడు. రంజీ ట్రోఫీ ఫైనల్‌లో సెంచరీ సాధించినప్పుడు, తన ఎమోషన్స్ ను వెలిబుచ్చి, ‘సెలక్టర్లు ఇదిగో నా సత్తా’ అన్నట్టుగా సంబరాలు చేసుకున్నాడు. ఇప్పుడు బుచ్చి బాబు ట్రోఫీలో కూడా అతను ఇదే కసిని ప్రదర్శించాడు. సర్ఫరాజ్ నిలకడైన ప్రదర్శన, టీమిండియా టెస్టు జట్టులో కరుణ్ నాయర్ స్థానానికి సవాలు విసురుతోంది. రాబోయే డూలీప్ ట్రోఫీలో కూడా సర్ఫరాజ్ వెస్ట్ జోన్ తరపున ఆడనున్నాడు. ఈ టోర్నమెంట్‌లలో అతని ప్రదర్శన, జాతీయ జట్టులో అతని భవితవ్యాన్ని నిర్ణయించే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..