భారత క్రికెట్ జట్టుకు దూరమైన వెటరన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహా(wriddhiman saha)కు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) NOC (నో అబ్జెక్షన్ లెటర్) ఇచ్చింది. అంటే సాహా ఇకపై బెంగాల్ తరపున దేశవాళీ క్రికెట్‌లో కనిపించకపోవచ్చు. ఈ క్రమంలో CAB నుంచి దూరం కావడంతో.. సాహా 15 ఏళ్ల అనుబంధం కూడా ముగిసింది. IPL 2022లో గుజరాత్ టైటాన్స్‌ను ఛాంపియన్‌గా చేయడంలో కీలక పాత్ర పోషించిన సాహా, గత కొంతకాలంగా CABతో మాత్రం అంతగా కలిసిరాలేదు. అతను రంజీ ట్రోఫీలో కూడా తన జట్టు కోసం ఆడలేదు. దాని కారణంగా అతను విమర్శలను కూడా ఎదుర్కొన్నాడు. CAB అధికారి చేసిన విమర్శలతో సాహా తీవ్ర నిరాశకు గురయ్యాడు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. అప్పట్లో ఈ విషయం నిరంతరం చర్చల్లో నిలిచింది.
వృద్ధిమాన్ సాహా CAB కార్యాలయానికి వచ్చి అధ్యక్షుడు అవిషేక్ దాల్మియాను కలిసి యూనియన్ నుంచి NOC కావాలని కోరాడంట. సాహా అభ్యర్థన మేరకు, అతను మరొక రాష్ట్రం కోసం ఆడటానికి NOC ఇచ్చినట్లు తెలుస్తోంది.
CAB జాయింట్ సెక్రటరీ దేబబ్రత వెటరన్ వికెట్ కీపర్‌పై తీవ్ర విమర్శలు చేశాడు. రాష్ట్రం కోసం దేశవాళీ మ్యాచ్‌లు ఆడమంటే, వింత సాకులు చెప్పేవాడని ఆరోపించాడు. దీంతో కోపోద్రిక్తుడైన సాహా.. దాస్‌ను బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందిగా కోరాడు.
ఎన్‌ఓసీ పొందిన అనంతరం విలేకరులతో మాట్లాడిన సాహా.. నేను ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాను. అందుకే ఈరోజు NOC తీసుకున్నాను. బెంగాల్‌తో తనకు ఎప్పుడూ ఎలాంటి విభేదాలు ఉండవని, భవిష్యత్తులో అవసరమైతే మళ్లీ సేవ చేసేందుకు సిద్ధంగా ఉంటానని చెప్పుకొచ్చాడు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్‌తో నాకు ఎలాంటి ఇగో సమస్యలు లేవని తెలిపాడు. నాకు ఒకరితో (జాయింట్ సెక్రటరీ దేబు) విభేదాలు వచ్చాయి. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది అంటూ వివరణ ఇచ్చాడు.
నివేదికల ప్రకారం, సాహా త్రిపుర తరపున ఆడేందుకు సిద్ధమయ్యాడంట. అయితే, ఆ జట్టు తరపున సరికొత్త పాత్రలో సాహా కనిపించేందుకు సిద్ధమయ్యాడు. మెంటార్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ధృవీకరణ వెలువడలేదు.
సాహా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కెరీర్ గురించి మాట్లాడితే, 37 ఏళ్ల క్రికెటర్ 122 మ్యాచ్‌ల్లో 41.98 సగటుతో 6423 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 38 అర్ధ సెంచరీలు ఉన్నాయి.