Kohli vs Ganguly: కోహ్లి పేలవ ఫామ్‌కు గంగూలీనే కారణం.. పాక్ మాజీ ప్లేయర్ కీలక వ్యాఖ్యలు..
సౌరవ్ గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీని ఉద్దేశపూర్వకంగా వేధించారని, ఇది ఆటగాడి బ్యాటింగ్‌పై ప్రభావం చూపిందని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు.
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫామ్ గురించి చాలా కాలంగా ప్రశ్నిస్తున్నారు. కానీ, ఆసియా కప్ 2022లో ఈ ఆటగాడు అద్భుత ప్రదర్శన చేశాడు. ఆసియా కప్ 2022లో ఆఫ్ఘనిస్థాన్‌పై దాదాపు 3 సంవత్సరాల తర్వాత విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ సాధించాడు. అంతకుముందు, విరాట్ కోహ్లీ తన చివరి అంతర్జాతీయ సెంచరీని నవంబర్ 2019లో చేశాడు. ఆఫ్ఘనిస్థాన్‌పై విరాట్ కోహ్లీ 61 బంతుల్లో 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. విరాట్ కోహ్లీ అంతర్జాతీయ కెరీర్‌లో ఇది 71వ సెంచరీ.
విరాట్ కోహ్లి పేలవ ఫామ్‌కు సౌరవ్ గంగూలీనే కారణం!
విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‌పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ కీలక ప్రకటన చేశాడు. భారత మాజీ ఆటగాడు అజయ్ జడేజాతో చర్చ సందర్భంగా, రషీద్ లతీఫ్ మాట్లాడుతూ, రవిశాస్త్రి భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నంత కాలం, విరాట్ కోహ్లీ బాగానే కొనసాగాడని, అయితే ఆ తర్వాత విరాట్ కోహ్లీ బ్యాడ్ ఫేజ్ ప్రారంభమైందని చెప్పుకొచ్చాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ రాకతో పెద్ద మార్పు వచ్చిందని రషీద్ లతీఫ్ అభిప్రాయపడ్డాడు. అలాగే, విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్‌కు సౌరవ్ గంగూలీని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ నిందించాడు.
తెరవెనుక ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం: రషీద్ లతీఫ్
గతేడాది టీ20 ప్రపంచకప్ సందర్భంగా మహేంద్రసింగ్ ధోనీని భారత జట్టుకు మెంటార్‌గా నియమించారని రషీద్ లతీఫ్ చెప్పాడు. దీనికి ముందు టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించాడు. తెరవెనుక ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టమని, అయితే విరాట్ కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయం చాలా షాకింగ్‌గా ఉందని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ అన్నాడు. దీని తరువాత, భారత జట్టు టెస్ట్ మ్యాచ్‌లు ఆడటానికి దక్షిణాఫ్రికా పర్యటనకు వెళుతుంది. అక్కడ కెప్టెన్ రోహిత్ శర్మ అన్‌ఫిట్ అయ్యాడు. అదే సమయంలో, విరాట్ కోహ్లీ కెప్టెన్సీని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత KL రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించారు.
సౌరవ్ గంగూలీ BCCI ప్రెసిడెంట్ అయ్యాక పరిస్థితులు మారాయి: రషీద్ లతీఫ్
2019 వన్డే ప్రపంచకప్ సందర్భంగా రవిశాస్త్రి టీమిండియా ప్రధాన కోచ్‌గా వ్యవహరించారని, అయితే సౌరవ్ గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్ అయ్యాక పరిస్థితులు మారాయని రషీద్ లతీఫ్ తెలిపాడు. రవిశాస్త్రి స్థానంలో రాహుల్ ద్రవిడ్‌ను టీమిండియా కోచ్‌గా నియమించారు. తెరవెనుక ఏదో ఒక గేమ్ జరుగుతోందని రషీద్ లతీఫ్ అభిప్రాయపడ్డాడు. ఈ సమయంలో విరాట్ కోహ్లీని ఉద్దేశపూర్వకంగా వేధించారని, దాని ప్రభావం ఈ ఆటగాడి బ్యాటింగ్‌లో కనిపించిందని కూడా అతను చెప్పుకొచ్చాడు. అయితే, 2022 ఆసియా కప్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు. భారత మాజీ కెప్టెన్ ఆసియా కప్ 2022లో 92 సగటు, 147.59 స్ట్రైక్ రేట్‌తో 276 పరుగులు చేశాడు.