U19 T20 World Cup 2025: చరిత్రకు ఒక్క అడుగు దూరంలో.. టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌కు టీమిండియా..

మలేషియా వేదికగా ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు ఫైనల్ కు దూసుకెళ్లింది. శుక్రవారం (జనవరి 31) జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఇంగ్లండ్ ను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది.

U19 T20 World Cup 2025: చరిత్రకు ఒక్క అడుగు దూరంలో.. టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌కు టీమిండియా..
Team India

Updated on: Jan 31, 2025 | 3:08 PM

అమ్మాయిలు అదరగొట్టారు. మలేషియా వేదికగా జరుగుతోన్నఐసీసీ అండర్ -19 మహిళల టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు ఫైనల్ కు దూసుకెళ్లింది. శుక్రవారం (జనవరి 31) ఇంగ్లండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా  ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. ఇక ఆదివారం (ఫిబ్రవరి 02) జరిగే ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు దక్షిణాఫ్రికాతో అమీ తుమీ తేల్చుకోనుంది.  ఇక సెమీ ఫైనల్  మ్యాచ్‌లో  ఇంగ్లాండ్‌ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.  అయితే ఈ నిర్ణయం విఫలమైందనే చెప్పాలి. ఎందుకంటే ఇంగ్లండ్‌ను భారత్ 113 పరుగులకే పరిమితం చేసింది.  డేవినా పెర్రిన్, కెప్టెన్ అబి నార్గ్రోవ్ మినహా మరే ఇంగ్లండ్ బ్యాటర్లు రాణించలేకపోయారు. టీమిండియా బౌలర్లు ఆద్యంతం కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 113 పరుగులు మాత్రమే చేసింది .

సెమీ ఫైనల్‌లో పరుణికా సిసోడియా తన సత్తా చాటింది. ఇంగ్లండ్  బ్యాటర్లకు మూకుతాడు వేయడంలో ఆమె కీలక పాత్ర పోషించింది.  ఈ మ్యాచ్ లో  4 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి 3 వికెట్లను  తీసింది పరుణికా. ఆ తర్వాత ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేస్తోన్న వైష్ణవి శర్మ కూడా ఇంగ్లండ్ వెన్ను విరిచింది. 4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. ఆయుషి శుక్లా 2 వికెట్లు పడగొట్టింది.

ఇవి కూడా చదవండి

 

ఇక 114 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష 29 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 35 పరుగులు చేసి ఔటైంది. గొంగడి కమలినితో కలిసి 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మరోవైపు బ్యాటింగ్‌లో జి కమలిని రాణించింది. ఆమె 50 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో అజేయంగా 56 పరుగులు చేసింది ఆ తర్వాత మిగిలిన పనిని కమలిని, సానికా షెల్కే విజయం సాధించారు.  మొత్తానికి భారత్ 15 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి  భారత్ టార్గెట్ ను అందుకుంది. తద్వారా భారత్ వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరింది. ఫైనల్‌లో భారత్‌ దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..