AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ఫలించని త్రిమూర్తుల వ్యూహాలు.. టీ20 ప్రపంచ కప్‌ నుంచి కోహ్లీసేన ఔట్.. టీమిండియా కొంపముంచిన 5 కారణాలు..!

ICC T20 World Cup 2021: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్ టీంలు టీ20 ప్రపంచ కప్ 2021లో సెమీ-ఫైనల్‌కు చేరుకున్నాయి. టీమిండియా మాత్రం టోర్నీ నుంచి సూపర్ 12‌లోనే నిష్క్రమించింది.

Team India: ఫలించని త్రిమూర్తుల వ్యూహాలు.. టీ20 ప్రపంచ కప్‌ నుంచి కోహ్లీసేన ఔట్.. టీమిండియా కొంపముంచిన 5 కారణాలు..!
T20 World Cup 2021, Indian Cricket Team
Venkata Chari
|

Updated on: Nov 07, 2021 | 7:37 PM

Share

Indian Cricket Team: టీ20 ప్రపంచ కప్ 2021 షెడ్యూల్ ప్రకటించిన సమయంలో ఈ టోర్నమెంట్‌లో టీమిండియా అతిపెద్ద పోటీదారుగా నిలిచింది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వంటి దిగ్గజాలతో కూడిన జట్టు ప్రత్యర్థులకు దడ పుట్టిస్తుందని అనుకున్నారు. కానీ, టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు చాలా పేలవమైన ప్రదర్శనతో సూపర్-12 రౌండ్‌లోనే నిష్క్రమించింది. చివరి ఆశగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌ టీం కూడా హ్యాండివ్వడంతో కోహ్లీసేన బ్యాచ్ దుబాయ్‌ నుంచి బ్యాగులు సర్దుకోనున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌పై ఘన విజయం సాధించిన న్యూజిలాండ్ టీం గ్రూపు 2 నుంచి సెమీఫైనల్ చేరింది. ఇదే గ్రూపు నుంచి పాకిస్తాన్ సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. గ్రూపు 1 నుంచి ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా టీంలు, గ్రూపు 2 నుంచి పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. 2007లో టీ20 చాంపియన్‌గా నిలిచిన టీమిండియాకు మరోసారి నిరాశే ఎదురైంది.

టోర్నీలో టీమ్ ఇండియా చాలా పేలవంగా ప్రారంభమైంది. పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీని తర్వాత, న్యూజిలాండ్ టీం కూడా భారత్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ రెండు పరాజయాలు టీమ్ ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బగా మారాయి. తరువాతి రెండు మ్యాచ్‌లు గెలిచినప్పటికీ, అవి సెమీస్ చేర్చే మార్గాన్ని దక్కించలేకపోయాయి. ఈ టోర్నమెంట్‌లో బలమైన టీమ్ ఇండియా ఎలాంటి తప్పులు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.

దెబ్బతీసిన ఐపీఎల్.. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగే సిరీస్ వరకు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ అద్భుతంగా కనిపించింది. కానీ, ఐపీఎల్ 2021 (IPL 2021) ముగిసే సమయానికి, ప్రతిదీ మారిపోయింది. హార్దిక్ పాండ్యా గాయం కారణంగా టీమ్ ఇండియా బ్యాలెన్స్ చెదిరిపోయింది. జట్టు అతనికి స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా అవకాశం ఇవ్వడంతో పాకిస్థాన్‌పై టీమ్ ఇండియా కేవలం 5 మంది బౌలర్లతోనే మైదానంలోకి దిగింది. తొలి మ్యాచ్‌లోనే ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన టీమ్‌ఇండియా, పాకిస్థాన్‌పై ఓటమి తర్వాత భారత జట్టు ఒక్కసారిగా బలహీనంగా కనిపించడం ప్రారంభించింది.

ప్రాక్టీస్‌లో దంచినా.. ప్రధాన మ్యాచుల్లో తేలిపోయారు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి బ్యాట్స్‌మెన్‌తో సన్నద్ధమైన టీమిండియా వార్మప్ మ్యాచ్‌లలో అద్భుతంగా బ్యాటింగ్ చేసినా లీగ్ దశ ప్రారంభమైన వెంటనే అందరూ ఫ్లాప్ అయ్యారు. పాకిస్థాన్, న్యూజిలాండ్‌లపై భారత టాప్ ఆర్డర్ ఘోరంగా ఓడిపోయింది. ఇది మాత్రమే కాదు, పాకిస్తాన్‌తో ఓడిపోయిన తర్వాత భారత జట్టు చాలా భయాందోళనలకు గురైంది. రోహిత్ శర్మను ఓపెనింగ్‌కు బదులుగా మూడవ స్థానంలో బ్యాటింగ్‌కు పంపారు. దుబాయ్ పిచ్‌పై బౌలర్లు పోరాడగలిగేంత పరుగులు బ్యాట్స్‌మెన్లు స్కోర్ చేయలేకపోవడంతో దారుణ పరాజయాలు మిగిలాయి.

బౌలర్ల ఎంపికలో లోపం.. భారత జట్టు వైఫల్యానికి మూడో అతిపెద్ద కారణం బౌలర్ల ఎంపిక. టీమ్ ఇండియా ఒకప్పుడు యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ వంటి ఇద్దరు మణికట్టు స్పిన్నర్లతో రాణించేంది. కానీ, ఈ మొత్తం టోర్నమెంట్‌లో, విరాట్ అండ్ కంపెనీ మణికట్టు స్పిన్నర్‌ను ప్లేయింగ్ XIలో ఆడించలేదు. మొదట, రాహుల్ చాహర్‌ను ఎంచుకున్నా.. ప్లేయింగ్ XIలో చోటివ్వలేదు. యుజ్వేంద్ర చాహల్ అనుభవం కాన్నా రాహుల్ చాహర్‌‌ను ఎంచుకున్నారు. అయినా చాహర్‌కు ప్లేయింగ్ XI లోనే అవకాశం ఇవ్వలేదు. దీంతో తొలి రెండు మ్యాచ్‌ల మిడిల్ ఓవర్లలో టీమిండియా వికెట్లు కూడా తీయలేకపోయింది.

కొంపముంచిన టాస్.. టీమ్ ఇండియా ఓటమికి టాస్ నాలుగో ప్రధాన కారణంగా నిలిచింది. దుబాయ్‌లో జరిగిన డే-నైట్ మ్యాచ్‌లలో, మొదట బ్యాటింగ్ చేసే జట్టు ఎల్లప్పుడూ పరుగులు చేయడంలో ఇబ్బంది పడడం చూసిందే. భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటి రెండు పెద్ద మ్యాచ్‌లలో టాస్ ఓడిపోయాడు. రాత్రి కురిసిన మంచు కారణంగా పాకిస్థాన్ 152 పరుగుల లక్ష్యాన్ని సులభంగా అందుకోగా, న్యూజిలాండ్ టీంతో భారత్ 111 పరుగులకే ఆలౌటైంది.

దెబ్బతీసిన బయోబబుల్.. టీమ్ ఇండియా ఓటమికి బయో బబుల్ కూడా ఒక ప్రధాన కారణంగా నిలిచింది. ఇంగ్లండ్‌లో టెస్ట్ సిరీస్ ఆడిన తర్వాత టీమ్ ఇండియా ఆటగాళ్లు వెంటనే యూఏఈ చేరుకుని IPL 2021 ఆడటం ప్రారంభించారు. టీ20 ప్రపంచ కప్ 2021, ఐపీఎల్ 2021 టోర్నీలు వెంటనే ప్రారంభమయ్యాయి. బయో-బబుల్‌తోపాటు మితిమీరిన క్రికెట్ ఆటగాళ్లపై భారంగా మారిందని ఈ టోర్నమెంట్‌తో తెటతెల్లమైంది. ఈ విజయాన్ని కెప్టెన్, టీమ్ మేనేజ్‌మెంట్లే స్వయంగా ప్రకటించడం తెలిసిందే.

Also Read: NZ vs AFG Match Result: సెమీస్ చేరిన న్యూజిలాండ్.. కోహ్లీసేనకు నిరాశే మిగిల్చిన ఆఫ్ఘనిస్తాన్..!

T20 World Cup 2021: 2007 నుంచి 2016 వరకు ఒక్కటే.. టీ20 ప్రపంచకప్‌ 2021లో మాత్రం మూడు.. ఆ ‘హ్యాట్రిక్’ బౌలర్లు ఎవరో తెలుసా?