భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి సెలవుల కోసం క్రికెట్ నుంచి విరామం తీసుకున్నాడు. కోహ్లి తన భార్య అనుష్క శర్మ, కూతురు వామికతో కలిసి మాల్దీవుల్లో సరదాగా గడుపుతున్నాడు. దీంతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. తాజాగా షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట్లో ఆకట్టుకుంటోంది. సర్దార్‌గా కనిపిస్తున్న ఓ వీడియోను విరాట్ పోస్ట్ చేశాడు. కొత్త లుక్‌లో కనిపించడంతో ఈ వీడియో నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. ఈ వీడియోలో కోహ్లీ, అనుష్కతో కలిసి కాఫీ తాగుతూ, కొన్నిసార్లు ఇద్దరూ కలిసి భాంగ్రా డ్యాన్స్ చేస్తూ కనిపించారు.
అభిమానుల ఫన్నీ రియాక్షన్స్..
ఈ వీడియోను షేర్ చేయడంతో పాటు, కోహ్లి పోస్ట్‌కు ఓ క్యాఫ్షన్ అందించాడు. ‘కొన్ని మరపురాని క్షణాలు.. అంటూ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌ను అనుష్కకు కూడా ట్యాగ్ చేశాడు. ఈ పోస్ట్‌పై, అభిమానులు కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ‘రాజు, రాణి అంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా, సర్దార్ లుక్‌లో సూపర్‌గా ఉన్నావంటూ కామెంట్లు చేశారు.
రెండోసారి సర్దార్ లుక్‌లో కోహ్లీ..
సర్దార్ గెటప్‌లో కోహ్లీ కనిపించడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో కోహ్లీకి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇందులో విరాట్ కోహ్లీ లుక్ ఎక్కువగా చర్చనీయాంశమైంది. సర్దార్ లుక్‌లో విరాట్ కనిపించాడు. అతను ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతూ బిజీగా ఉన్నప్పుడు, ఫొటో గ్రాఫర్‌లు తమ కెమెరాల్లో బంధించారు. తెల్లటి చొక్కాపై నీలిరంగు తలపాగా ధరించి, సర్దార్ లుక్‌లో విరాట్ కోహ్లీ చాలా అందంగా కనిపించాడు.
సెలవుల కోసం మాల్దీవులకు..
విరాట్ కోహ్లీ ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ఆడాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడిన కోహ్లి ఐపీఎల్ సీజన్ చాలా దారుణంగా ఉంది. అతను మూడుసార్లు గోల్డెన్ డక్ కోసం ఔటయ్యాడు. ఆ తర్వాత విరాట్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. చాలా మంది అభిమానులు, అనుభవజ్ఞులు కోహ్లీ క్రికెట్ నుంచి విరామం తీసుకొని సెలవులకు వెళ్లాలని సూచించారు.
విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయించడానికి కూడా ఇదే కారణంగా కావొచ్చని అంటున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగే 5 టీ20ల సిరీస్‌కు కోహ్లీని ఎంపిక చేయలేదు. అయితే జులై 1 నుంచి ఇంగ్లండ్ వేదికగా జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి రానున్నాడు.