మాజీ బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) భారత సీనియర్ ఆటగాళ్లపై విమర్శల వర్షం కురిపించాడు. క్రికెటర్లు అంతర్జాతీయ సిరీస్‌ల నుంచి విశ్రాంతి తీసుకొని ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో విరామం లేకుండా ఆడడాన్ని తప్పుబట్టాడు. వెస్టిండీస్‌తో జరగనున్న సిరీస్‌లో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్‌లకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చే వ్యూహంతో తాను ఏకీభవించనని గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఓ ఛానల్‌తో జరిగిన సంభాషణలో గవాస్కర్ మాట్లాడుతూ, ‘ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలనే భావనతో నేను ఏకీభవించను. అది అస్సలు కుదరదు. ఐపీఎల్‌లో రెస్ట్ తీసుకోకుండా, భారత్‌కు ఆడుతున్నప్పుడు మాత్రం ఇలాంటి డిమాండ్ ఎందుకు చేస్తున్నారు. దీనితో నేను ఏకీభవించను. నువ్వు భారత్ తరపున ఆడాలి. విశ్రాంతి గురించి మాట్లాడకండి. టీ20లో ఒక ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లు మాత్రమే ఉంటాయి. ఇది మీ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపదు. టెస్ట్ మ్యాచ్‌లో మనస్సు, శరీరం ప్రభావితమవుతాయని నేను అర్థం చేసుకోగలను. అయితే టీ20లో ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాను’అంటూ చెప్పుకొచ్చాడు.
సడలింపు విధానంలో బీసీసీఐ జోక్యం చేసుకోవాలి..
ఈ విశ్రాంతి విధానంలో క్రికెట్ బోర్డు ఆఫ్ ఇండియా (బీసీసీఐ) జోక్యం చేసుకుంటే బాగుంటుందని ఈ మాజీ కెప్టెన్ అభిప్రాయపడ్డారు. గవాస్కర్ మాట్లాడుతూ, ‘బీసీసీఐ ఈ విశ్రాంతి భావనను పరిశీలించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. గ్రేడ్ ఏ క్రికెటర్లందరికీ చాలా మంచి కాంట్రాక్టులు వచ్చాయి. ప్రతి మ్యాచ్‌కి వారికి డబ్బు వస్తుంది. వేరే కంపెనీలో పనిచేస్తే.. ఆ కంపెనీ సీఈవో లేదా ఎండీకి విశ్రాంతి ఇస్తుందా? అని ప్రశ్నించారు.
వెస్టిండీస్‌లో రోహిత్ స్థానంలో కెప్టెన్‌గా ధావన్..
వెస్టిండీస్ పర్యటనలో భారత క్రికెట్ జట్టు మూడు వన్డేలతో పాటు ఐదు టీ20 మ్యాచ్‌లు కూడా ఆడనుంది. వన్డే మ్యాచ్‌లకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ లేకపోవడంతో కెప్టెన్సీ బాధ్యతలను శిఖర్ ధావన్‌కు అప్పగించారు. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు ముందు, వెస్టిండీస్‌లో వన్డే మ్యాచ్‌లు మినహా ఈ ఫార్మాట్‌లో భారత్ మరే ఇతర మ్యాచ్ ఆడలేదు. వన్డే మ్యాచ్‌ల తర్వాత కరేబియన్, అమెరికా గడ్డపై భారత్ ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.