టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ మళ్లీ రికార్డుల వేట మొదలుపెట్టేశాడు. కొన్ని రోజులుగా పేలవ ఫామ్‌తో సతమతమవుతోన్న మన రన్ మెషిన్ ఆసియాకప్‌లో అదరగొట్టేశాడు. అఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 71వ అంతర్జాతీయ సెంచరీ సాధించాడు. టోర్నమెంట్ మొత్తం మీద 276 పరుగులు చేసి విమర్శకుల నోళ్లకు తాళం వేశాడు. ఇప్పుడిదే జోరును ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లోనూ కొనసాగించాలని ఉవ్విళ్లూరుతున్నాడు . కాగా తనదైన ఆటతీరు, వ్యక్తిత్వంతో రోజురోజుకీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోన్న విరాట్ సోషల్ మీడియాలో మరో రికార్డు సాధించాడు. ట్విటర్‌లో 50 మిలియన్ల ఫాలోవర్లు కలిగి ఉన్న మొదటి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
క్రికెట్‌తో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ ఉండే కోహ్లీ తన ప్రొఫెషనల్, పర్సనల్ విషయాలను అందులో పంచుకుంటాడు. తన సతీమణి అనుష్కతో దిగిన ఫొటోలు, వెకేషన్ పిక్స్‌ను తరచూ ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటాడు. అందుకే అతనికి నెట్టింట ఆదరణ ఎక్కువగా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లికి 211 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అదే విధంగా ఫేస్‌బుక్‌లో 49 మిలియన్ల మంది విరాట్‌ను అనుసరిస్తున్నారు. ఇలా మొత్తం సామాజిక మాధ్యమాల్లో కోహ్లీ ఫాలోవర్ల సంఖ్య మొత్తం 310 మిలియన్లకు చేరుకుంది. ఇన్‌స్టాగ్రామ్ విషయానికొస్తే.. అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన మూడో క్రీడాకారుడిగా కొనసాగుతున్నాడు విరాట్. మొదటి, రెండు స్థానాల్లో క్రిస్టియన్ రొనాల్డో (450 మిలియన్లు), లియోనల్ మెస్సీ(333 మిలియన్) ఉన్నారు.
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..