Ind vs Pak : ఐసీసీ కాంట్రాక్ట్ రూల్స్ బ్రేక్ చేసిన పీసీబీ…48 గంటలు గడిస్తే పాక్ మీద వేటు పడ్డట్లే ?

Ind vs Pak : క్రికెట్ ప్రపంచంలో భారత్-పాకిస్థాన్ మధ్య వివాదం మళ్లీ ముదిరింది. 2026 టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో భారత్‌తో తలపడబోమని పాకిస్థాన్ మొండికేస్తోంది. దీనికి సంబంధించి పాక్ ప్రభుత్వం సోషల్ మీడియాలో ప్రకటన చేసినప్పటికీ ఐసీసీకి ఇంకా అధికారిక సమాచారం ఇవ్వలేదు. దీంతో ఐసీసీ, బీసీసీఐలతో చేసుకున్న ఒప్పందాలను పాక్ ఉల్లంఘిస్తోందని, దీనిపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Ind vs Pak : ఐసీసీ కాంట్రాక్ట్ రూల్స్ బ్రేక్ చేసిన పీసీబీ...48 గంటలు గడిస్తే పాక్ మీద వేటు పడ్డట్లే ?
T20 World Cup 2026

Updated on: Feb 04, 2026 | 2:52 PM

Ind vs Pak : టీ20 వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు ఎప్పుడూ విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అయితే, ఈసారి ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన ఈ మ్యాచ్‌పై పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తమ జట్టు టోర్నమెంట్‌లో పాల్గొంటుందని, కానీ భారత్‌తో మాత్రం ఆడదని పాక్ ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా సంకేతాలు ఇచ్చింది. గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ పాకిస్థాన్‌కు వెళ్లనని చెప్పినప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతోంది. అప్పుడు కుదిరిన ఒప్పందం ప్రకారం.. పాక్ కూడా భారత్ రావాల్సిన పని లేదు కానీ తటస్థ వేదికపై మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.

ఇప్పుడు శ్రీలంకలో తటస్థ వేదికపై మ్యాచ్ జరగనున్నప్పటికీ, పాక్ ఆడనని చెప్పడం ఐసీసీ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. ఐసీసీ ఒప్పందంలో ఫోర్స్ మేజ్యూర్ అనే క్లాజ్ ఉంటుంది. దీని ప్రకారం ప్రకృతి విపత్తులు లేదా అనూహ్య రాజకీయ సంక్షోభాలు ఏర్పడితేనే మ్యాచ్ ఆపడానికి వీలుంటుంది. కానీ, కేవలం రాజకీయ అభ్యంతరాల సాకుతో మ్యాచ్ ఆడనని చెప్పడం ఈ నిబద్ధన కిందకు రాదని ఐసీసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వచ్చే 48 గంటల్లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దీనిపై ఒక అధికారిక వివరణ ఇవ్వాల్సి ఉంది. లేదంటే ఐసీసీ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ఈ వివాదం కేవలం క్రికెట్‌కే పరిమితం కాకపోవచ్చు. పాకిస్థాన్ ప్రభుత్వం భారత్‌తో ఏ ఆటలోనూ ఆడకూడదని నిర్ణయించుకుంటే, అది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ దృష్టికి వెళ్తుంది. ఇలాంటి వివక్షాపూరిత నిర్ణయాల వల్ల పాకిస్థాన్‌పై అన్ని క్రీడల్లోనూ నిషేధం పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు కాబట్టి ఐసీసీ వేచి చూస్తోంది. ఒకవేళ పాక్ బాయ్‌కాట్‌కే మొగ్గు చూపితే, ఐసీసీ తన కాంట్రాక్ట్ పవర్స్ ఉపయోగించి భారీ జరిమానా విధించడమే కాకుండా, పాయింట్లు కోత విధించడం లేదా టీమ్‌ను డిస్క్వాలిఫై చేయడం వంటి చర్యలు తీసుకోవచ్చు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి